జన హృదయ విజేత

ABN , First Publish Date - 2022-10-07T09:54:27+05:30 IST

దైవ ప్రవక్త మహమ్మద్‌... కాబా గృహ అర్చకుల వంశమైన, ప్రసిద్ధమైన ఖురైష్‌ వంశానికి చెందినవారు.

జన హృదయ విజేత

9న మిలాద్‌-ఉన్‌-నబీ (దైవ ప్రవక్త మహమ్మద్‌ జయంతి)


దైవ ప్రవక్త మహమ్మద్‌... కాబా గృహ అర్చకుల వంశమైన, ప్రసిద్ధమైన ఖురైష్‌ వంశానికి చెందినవారు. ఆయన తండ్రి అబ్దుల్లా, తాత అబ్దుల్‌ ముత్తలిబ్‌. మక్కా నగరంలో క్రీస్తు శకం 571 ఏప్రిల్‌ 22న మహమ్మద్‌ జన్మించారు. ఆయనకు ఆరేళ్ళ వయసున్నప్పుడు... తల్లి బీబీ అమీనా పరమపదించారు. ఎనిమిదో ఏటి వరకూ తాతగారి పోషణలో పెరిగిన మహమ్మద్‌... పిన్న వయసులోనే బాబాయితో కలిసి వ్యాపారం నిమిత్తం సిరియా వెళ్ళారు. అక్కడ తెగల మధ్య దౌర్జన్యాలను నివారించే ‘హిల్‌ఫుల్‌ జూల్‌’ అనే ఒప్పందంలో ఆయన పాల్గొన్నారు. తిరిగి సిరియా వచ్చాక... తన ఇరవై అయిదో ఏట... తనకన్నా వయసులో పదిహేనేళ్ళు పెద్ద అయిన హజ్రత్‌ ఖదీజా అనే వితంతువును వివాహం చేసుకున్నారు. ఆ విధంగా స్త్రీ జనోద్ధరణకు ఆయన శ్రీకారం చుట్టారు. 


మహమ్మద్‌ సత్యసంధతకు మారుపేరుగా నిలిచారు. ఆయన ప్రవక్తగా ప్రకటితులు కావడానికి ముందే ప్రజలు ‘సాధిఖ్‌ - అమీన్‌’ అనే బిరుదులతో సత్కరించారు. తనను ప్రవక్తగా ఆయన ప్రకటించుకున్నప్పుడు... ‘మహమ్మద్‌ అసత్యవాది’ అని ఆరోపణను ఆయన బద్ధ శత్రువులు సైతం చేయలేకపోయారు. ఆయనను ద్వేషించే అబూజహల్‌ సైతం ‘‘ఓ మహమ్మద్‌! మేము మిమ్మల్ని సత్యవాది అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అన్నాడు.,


స్నేహానికి మహమ్మద్‌ ఎంతో విలువనిచ్చేవారు. తన సహచరుల, మిత్రుల యోగ క్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన స్వభావం గురించి దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ప్రస్తుతిస్తూ ‘‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడివి అయ్యావు. నీవే కనుక కర్కశుడివి, కఠిన హృదయుడివి అయినట్టయితే, వారందరూ నీ చుట్టుపక్కల నుంచి దూరంగా పారిపోయేవారు’’ అని పేర్కొన్నారు. 

నిస్వార్థపరుడైన మహమ్మద్‌కు ధనాపేక్ష ఉండేది కాదు. దైవ ప్రవక్త కావడానికి ముందు ఆయన అంతర్జాతీయ వాణిజ్యం చేసేవారు. ఆయన భార్య సంపన్నురాలు, స్వయంగా పెద్ద వ్యాపారి. మహమ్మద్‌ దైవ ప్రవక్త అయిన తరువాత... ఆమె తన సంపద అంతటినీ ఇస్లాం ప్రచారం కోసం ఖర్చు చేశారు. చివరకు ఆయనకు వాహనం కూడా లేకపోవడంతో.. తాయెఫ్‌ నగరానికి కాలి నడకన వెళ్ళవలసి వచ్చింది. మదీనాకు వలస వెళ్ళే సమయంలో... మహమ్మద్‌ ఖర్చులన్నిటినీ ఆయన సన్నిహితుడైన హజ్రత్‌ అబూబక్ర్‌ భరించారు. దైవ ప్రవక్తకు ఎప్పుడైనా ధనం లభిస్తే, ఖర్చులకు సరిపడా తీసుకొని, మిగిలిన మొత్తాన్ని పేదలకు పంచిపెట్టేవారు. తల్లి తండ్రులను ఆదరంగా చూసుకోవాలనీ, సేవ చేయాలనీ ఎల్లప్పుడూ ఆయన బోధించేవారు. బాల్యంలో తనకు పాలు పట్టిన దాయీ హలీమాను చివరి వరకూ సొంత తల్లిలా ఆయన చూసుకున్నారు.


ప్రవక్త కావడానికి ముందు నుంచీ సృష్టి కర్త ఉనికిని మహమ్మద్‌ అన్వేషిస్తూ ఉండేవారు. ఆ చింతనలోనే హిరా గృహంలో రేయింబవళ్ళు గడిపేవారు. అల్లాహ్‌ అనుగ్రహం పొందిన తరువాత... నిరంతరం ఆ సృష్టికర్త స్మరణలోనే ఉండేవారు. విధిగా నిర్దేశితమైన నమాజులతో పాటు అదనపు నమాజులు కూడా చేసేవారు. నిరాడంబరతకు మారుపేరైన ఆయన అతుకులు వేసిన దుస్తులు ధరించడం చిన్నతనంగా భావించేవారు కాదు. ధర్మసమ్మతమైన ఆహారాన్ని... అందరితో కలిసి భుజించడాన్ని ఇష్టపడేవారు. అందరితోనూ మృదువుగా, శాంతంగా, చిరునవ్వుతో వ్యవహరించేవారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు. అయితే ఎవరినీ నొప్పించేవారు కాదు. ప్రగల్భాలు పలకడం, గొప్పలు చెప్పుకోవడం ఆయనకు నచ్చేది కాదు. అలాగే తనను ప్రజలు అతిగా గౌరవించడాన్నీ, ప్రత్యేక బిరుదులతో పిలవడాన్నీ సమ్మతించేవారు కాదు. తల్లితండ్రులుగా, గృహస్థులుగా, అతిథులుగా, పొరుగువారుగా ఎలా మెలగాలో, అనాథలను ఎలా ఆదరించాలో వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు... లోకులందరికీ, సర్వకాలాల్లోనూ మార్గదర్శకాలు. 


పాలకునిగా కూడా మహమ్మద్‌ ప్రవక్త ఆదర్శప్రాయుడు. మానవులదరూ సమానులేనని చాటుతూ, పౌరులందరి ధన, మాన, ప్రాణ రక్షణకు, వయోధికుల సంరక్షణకు భరోసా కలిగించారు. ప్రజల ధార్మిక, సాంస్కృతిక హక్కులను కాపాడారు. వ్యాపారాల్లో మోసాలకు అడ్డుకట్ట వేశారు. జూదం, మద్యపానం, వ్యభిచారం లేని సమాజ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. బావులు, రహదారులు, వైద్య శాలలు, పాఠశాలలు, అతిథి గృహాలు నిర్మించారు. జకాత్‌, ఫిత్రా, సదఖా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా కేవలం ముప్ఫై ఏళ్ళ కాలంలో పేదరికాన్ని రూపుమాపారు. కిరీటం లేని చక్రవర్తిగా, సంపద లేని మహరాజుగా, రాజమహలు ఎరుగని పాలకునిగా జీవనం గడిపారు. మహమ్మద్‌ మరణించిన రోజున... ఆయన ఇంట్లోని దీపంలో సరిపడేంత నూనె కూడా కనీసం లేదు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంక్షేమ రాజ్య స్థాపకునిగా, బోధకునిగా ప్రపంచానికి ఆయన ఆదర్శప్రాయుడైన మహమ్మద్‌... జన హృదయ విజేతగా చరిత్రలో నిలిచిపోయారు. 

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-10-07T09:54:27+05:30 IST