JagdeepDhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్.. ఆయన స్వగ్రామంలో రియాక్షన్ ఇది..

ABN , First Publish Date - 2022-07-17T05:28:23+05:30 IST

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన స్వగ్రామంలో గ్రామస్తులు మిఠాయి పంచిపెట్టుకుని..

JagdeepDhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్.. ఆయన స్వగ్రామంలో రియాక్షన్ ఇది..

ఝుంఝును: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన స్వగ్రామంలో గ్రామస్తులు మిఠాయి పంచిపెట్టుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగదీప్ ధన్‌కర్ స్వగ్రామం రాజస్థాన్‌లోకి కిథానా గ్రామం. 2019 జులై 30న ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1951, మే 18న రాజస్థాన్‌లోని ఝంఝును జిల్లాలోని కిథానా గ్రామంలో ఆయన జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకూ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆరవ తరగతి చదువుకునేందుకు ఊరిలోని పాఠశాలలో అవకాశం లేకపోవడంతో 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ఆయన చదువుకున్నారు. చిత్తోర్‌ఘర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి 1962లో సైనిక్ స్కూల్‌కు అర్హత సాధించారు.



టెన్త్, ఇంటర్ పూర్తి చేశాక.. బీఎస్సీ ఫిజిక్స్ కోర్సు చదివి పాసయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో ఎల్‌ఎల్‌బీ కోర్సు చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ రాజస్థాన్‌లో 10.11.1979 నుంచి అడ్వకెట్‌గా కొనసాగారు. కొన్నేళ్లకు రాజకీయ రంగ ప్రవేశం చేసి 1989లో ఝుంఝును పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 1990లో కేంద్ర మంత్రి పదవి ఆయనను వరించింది. 1993 నుంచి 98 మధ్య కిషన్‌గర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇలా అంచెలంచెలుగా జీవితంలో ఎదిగిన జగదీప్ ధన్‌కర్ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

Updated Date - 2022-07-17T05:28:23+05:30 IST