కొవిడ్‌ టీకా కోసం పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2021-05-09T07:11:55+05:30 IST

కొవిడ్‌ టీకా వేసుకు నేందుకు మదనపల్లె పట్టణంలోని రామారావుకాలనీలో ఉన్న అర్బన్‌ హెల్త్‌సెంటర్‌కు జనం పోటెత్తారు. తోపు లాటకు పాల్పడుతూ వైద్యసిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కొవిడ్‌ టీకా కోసం పోటెత్తిన జనం
వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రికి వస్తున్న ప్రజలు

అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో తోపులాట 


కొవాగ్జిన్‌ కోసం బారులుతీరిన ప్రజలు


 కొవిషీల్డ్‌ కోసం ముందుకురాని వైనం


మదనపల్లె క్రైం, మే 8: కొవిడ్‌ టీకా వేసుకు నేందుకు మదనపల్లె పట్టణంలోని రామారావుకాలనీలో ఉన్న అర్బన్‌ హెల్త్‌సెంటర్‌కు జనం పోటెత్తారు.  తోపు లాటకు పాల్పడుతూ వైద్యసిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామారావుకాలనీలోని అర్బన్‌ హెల్త్‌సెంటర్‌కు రెండురోజుల కిందట కొవాగ్జిన్‌ 200 డోస్‌లు, కొవిషీల్డ్‌ 200 డోస్‌లు వచ్చాయి. ఈక్రమంలో శనివారం సెకండ్‌ డోస్‌ వేసుకునే వారికి మాత్రమే టీకా వేస్తామంటూ ముందురోజే వైద్యాధికారి ప్రియ దర్శిని ప్రకటించారు. దీంతో ప్రజలు ఉదయం 7 గం టలకే పెద్దసంఖ్యలో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌కు చేరుకున్నారు. వైద్యసిబ్బంది 8.30 గంటలకు కొవాగ్జిన్‌ టీకా వేయడం ప్రారంభించి 10.30 గంటలకే అన్ని డోస్‌లు పూర్తి చేశారు. ఆ తరువాత స్టాకు లేదని చెప్పడంతో జనం ఆగ్రహావేశాలతో సెంటర్‌లోకి దూరి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది బిత్తర పోయారు.  వెంటనే వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరు కునేలోపు జనం గొడవకు దిగారు. దీంతో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ రచ్చ రచ్చగా మారింది. వన్‌టౌన్‌ సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ లోకేష్‌ సిబ్బందితో లోపలికి వెళ్లి ప్రజలకు సర్ది చెప్పినా వారు వినలేదు. అక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయగా పోలీసులపై తిరగబడ్డారు. గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని పోలీ సులు హెచ్చరించడంతో ఒక్కొక్క రు గా సెంటర్‌ నుంచి వెళ్లిపోయారు. కాగా కొవాగ్జిన్‌ స్టా కు లేదని, ఉన్న 200 డోస్‌లు వేసేశామంటూ వైద్యాధికారి ప్రియదర్శిని అనడంతో... ఒకరికి వేసి ఇంకొకరికి వేయకుంటే ఎలా గంటూ వాగ్వాదానికి దిగారు. ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా.. ప్రభుత్వా నికి, వైద్యాధికారులకు ఏ మాత్రం చలనం లేదంటూ ధ్వజమెత్తారు. కేసులు, మరణాలు పెరుగుతున్నా.. వ్యాక్సిన్‌ సరఫరాలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు మండి పడ్డారు. ఎండ తీవ్రంగా ఉన్నా గంటల తరబడి క్యూలో నిలబడినా టీకాకు నోచుకోలేక పోతున్నామంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసర మైన డోస్‌లు తెప్పిం చుకుని సన్నిహితులకు, బంధువులకు వేసుకోండంటూ ఆవేశంతో వెనుదిరిగారు.కొవీషీల్డ్‌ టీకా అందుబాటులో ఉందని, వచ్చిన వారికి వేస్తామని సిబ్బంది అనడంతో ఆ టీకా మాకొద్దంటూ నిరాకరించారు. ఇదిలా వుండగా గతంలో ఇదే సెంటర్‌లో ఫస్ట్‌డోస్‌ కొవాగ్జిన్‌ టీకా వేయించు కున్న ప్రజలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫస్ట్‌డోస్‌ వేసు కున్న వారంతా పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఆస్పత్రి తిరుణాళను తలపించింది. సుమారు 200 మీటర్ల దూరం  క్యూ వ్యాపించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కాగా కొవిషీల్డ్‌ టీకా డోస్‌లు మిగిలిపోయాయి.  





ఇలాగైతే ప్రాణాలు బాగానే కాపాడతారు..


అరకొర సరఫరా, స్టాకుతో ప్రజల ప్రాణాలను బాగానే కాపాడతారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి, వైద్యాధికారులకు లెక్కాపక్కా లేకుండా పోతోంది. టీకా వేయడానికే గతి లేదు... ఇక ప్రాణాలెలా కాపాడుతారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నది కరోనా కాదు... మీరు... మీ నిర్లక్ష్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. బుద్ధి చెప్పేరోజులు వస్తాయి. ఆ విషయం మరిచిపోకండి.

      - ప్రసాద్‌రెడ్డి, బుక్‌స్టాల్‌ నిర్వాహకుడు, మదనపల్లె


హెచ్‌ఎం అయినా... నాకే దిక్కులేదు


నా భార్య, నేను ఉదయం ఏడుగంటలకే టీకా కోసం ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ జరిగిన గొడవలు, తోపులాటలో నా భార్య స్పృహకోల్పోయింది. నాకు వేయకపోయినా ఫర్వాలేదు.. నా భార్యకు వేయాలని ప్రాధేయపడినా పట్టించుకునే దిక్కులేదు. ప్రభుత్వ ఉద్యోగి, జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం అయిన నాకే టీకా వేయడం లేదు. ఇక సామాన్య జనాలకు ఏం న్యాయం చేస్తారు.

 -   రెడ్డెన్నశెట్టి, హెచ్‌ఎం జడ్పీహైస్కూల్‌, మదనపల్లె


టీకాల్లోనూ... రాజకీయమేనా


కరోనా ప్రజల ప్రాణాలను కబళిస్తుంటే... ఉచితంగా వేసే టీకా కోసం రాజకీయం చేయడం సరికాదు. బాగా తెలిసిన వారికి, రెకమండేషన్‌ వ్యక్తులకే టీకా వేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి. సామాన్య ప్రజలకు ఎవరు రెకమండ్‌ చేయాలి. ప్రభుత్వానికి, అధికారులకు కనీస బాధ్యత లేదా. ప్రజల ఇబ్బందులు పట్టవా. అయిన వారికి కంచాల్లో కానివారికి ఆకుల్లో వడ్డించడం తగదు. అందరికీ సమాన న్యాయం చేయాలి. 

- సోమశేఖర్‌, రామారావుకాలనీ, మదనపల్లె

Updated Date - 2021-05-09T07:11:55+05:30 IST