ఎర్ర టోపీల క్రిమినల్స్‌ను జనం క్షమించరు: కేపీ మౌర్య

ABN , First Publish Date - 2021-12-13T17:55:26+05:30 IST

ఎర్రటోపీ పార్టీ ఉత్తరప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా..

ఎర్ర టోపీల క్రిమినల్స్‌ను జనం క్షమించరు: కేపీ మౌర్య

ఘాజీపూర్: ఎర్రటోపీ పార్టీ ఉత్తరప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వాగ్బాణాలు గుప్పించారు. ఎర్ర టోపీలు లేదా 'మెస్ క్యాప్' ముసుగులోని క్రిమినల్ శక్తులను ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ వర్కర్లు, చాలా మంది ముస్లింలు ఈ టోపీలు ధరిస్తుంటారు. ఘాజీపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


కాగా, కేశవ్ ప్రసాద్ మౌర్య తాను చేసిన 'మెష్ క్యాప్' వ్యాఖ్యలు ముస్లిం కమ్యూనిటిలోని అందరికీ వర్తించవని, కేవలం నేరపూరిత శక్తులకే వర్తిస్తాయని మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. మరికొంత అదనపు శక్తియుక్తులతో అధికారంలోకి వస్తామని సమాజ్‌వాదీ పార్టీ తలపోస్తోందని, అయితే 2017లో వచ్చినన్ని సీట్లు ఆ పార్టీకి వచ్చినా అదృష్టమేనని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే బీఎస్‌పీ, కాంగ్రెస్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. బీజేపీ ఎన్నడూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడదని, భవిష్యత్తులో కూడా ఆ పని చేయదని అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘాజీపూర్‌లో ఎదుర్కొన్న అవరోధాలను అధిగమించి, ఏడు సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమన్నారు. ఎస్‌పీ, బీఎస్‌పీలు కేవలం ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లాగా కొందరికే లబ్ధి చేకూర్చేవని, బీజేపీ మాత్రం సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని చెప్పారు.

Updated Date - 2021-12-13T17:55:26+05:30 IST