వ్యవస్థల నిర్మాణంతోనే ప్రజాభ్యుదయం

ABN , First Publish Date - 2022-09-14T07:21:00+05:30 IST

ప్రపంచంలో అతి కొద్ది దేశాలు ఫెడరల్ వ్యవస్థ నిర్మాణంలో విజయం సాధించాయి. అందులో భారత్ ఒకటి. స్వాతంత్ర్యానంతరం పాలనా పగ్గాలు చేపట్టిన జాతీయోద్యమ...

వ్యవస్థల నిర్మాణంతోనే ప్రజాభ్యుదయం

ప్రపంచంలో అతి కొద్ది దేశాలు ఫెడరల్ వ్యవస్థ నిర్మాణంలో విజయం సాధించాయి. అందులో భారత్ ఒకటి. స్వాతంత్ర్యానంతరం పాలనా పగ్గాలు చేపట్టిన జాతీయోద్యమ సారథులు భారతీయ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు నడుం కట్టారు. నాటి నేతల ప్రయత్నాల ఫలితంగా దేశం ఆహార రంగంలో స్వయంపోషకం కావడంతో పాటు, నేడు ప్రపంచంలోనే ఆహార ఎగుమతిదారుగా కీలకస్థానం పొందింది. యువ జనాభా అధికంగా ఉన్న కారణంగా అపార వృద్ధి అవకాశాలు కల దేశంగా ఆవిర్భవించింది. సేవారంగంలో దేశం అతి పెద్ద ముందంజను సాధిస్తోంది. దేశంలో సగటు ఆయు ప్రమాణం, అక్షరాస్యత పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. జీవన ప్రమాణాలు పెంపొందించడానికి అవసరమైన విద్య, వైద్యం, ఆహార భద్రత, ఉపాధి కల్పనా, నైపుణ్యాల మెరుగుదల వంటి వాటిపై ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నాయి.


స్వాతంత్ర్యానంతరం వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఓ చక్కని పీఠిక, ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి – ఈ అంశాల్ని మినహాయిస్తే రాజ్యవ్యవస్థ మన నూతన రాజ్యంగంలో కూడా యథాతథంగా, కేంద్రీకృతంగానే కొనసాగుతోంది. 1946లో తొలుత వికేంద్రీకరించిన అధికారంతో, ఫెడరల్ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకోవాలని అంగీకరించిన నాయకులు దేశ విభజన కారణంగా మనసు మార్చుకుని కేంద్రీకృత పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అందుకే రాష్ట్రాలను ఏర్పరిచినా, వాటికి పరిమితమయిన అధికారాలను ఇచ్చి వాటి మీద యూనియన్ ప్రభుత్వానికి పెత్తనం ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ కాలంలో చట్టసభలలో అధికారంలో ఉన్నవారికి కేంద్రీకృత అధికారంలో ఉన్న మజా ఏమిటో తెలిసింది. ఎన్నికలలో విపరీతమయిన ఖర్చు పెట్టి గెలవటం, అంతకు ఎన్నో రెట్లు ప్రతిఫలంగా రాబట్టడం ఆనవాయితీ అయ్యాయి. వీటికి తగ్గట్టు ప్రభుత్వ మనుగడ చట్టసభ సభ్యుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. వీటన్నిటి వల్ల ఒకవేళ అధికార వికేంద్రీకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు మక్కువ ఉన్నా దాన్ని ఆచరణలోకి తేవడం అసాధ్యమయింది.


నిరంతర అభద్రతాభావంతో అధికార పోరాటంలో మునిగి తేలే నాయకుల పరిస్థితి అలా ఉండగా, అపరిమితమైన అధికారానికి, విశృంఖలత్వానికి అలవాటు పడ్డ పాలనా యంత్రాంగం, ఉన్నతాధికార వర్గం తొలి నుంచీ స్థానిక ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కేంద్రీకృత అధికార వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడంతో అత్యధికులైన ఉద్యోగులకు అదే సుఖంగా ఉంది. పాలన వైఫల్యాల వల్ల నష్టపోతున్న సామాన్య జనాన్ని గురించి పట్టించుకువారే లేకపోయారు. మన రాజ్యాంగంలో 73, 74 సవరణల ద్వారా వేల పదాలను ఉపయోగించి చాలా నిస్సారమైన స్థానిక ప్రభుత్వాలకు రూపకల్పన చేశారు. స్థానిక ప్రభుత్వాల నిర్మాణం విషయంలో చాలా వివరంగా, నిక్కచ్చిగా, ఎలాంటి మార్పులు, మంచి ప్రయోగాలు, మెరుగుదలలకు తావులేకుండా కఠినమైన నిబంధనలు పెట్టారు. వాటి అధికారాల విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో స్థానిక ప్రభుత్వాలు ఏర్పడినా వాటికి తగిన అధికారాలు, వనరులు, సిబ్బంది మీద అజమాయిషీ లేక అవి ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వడం కేవలం గాంధీజీ కన్న కలలు సాఫల్యం కోసమే కాదు, అది జాతి మనుగడకు, ప్రజాస్వామ్య పరిపుష్ఠికి, మన ఆర్థిక సౌష్ఠవానికి అవసరం అన్న స్పృహ మన పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఇదే సమయంలో అన్ని రంగాలలో పెరుగుతున్న అవినీతి జాడ్యం ప్రజాస్వామ్యానికి పెనుసవాలుగా మారింది. నేర రాజకీయం, హింసా సంస్కృతి, అవినీతి, మాఫియారీతి నేర సామ్రాజ్యాలు, ఎన్నికల అక్రమాలు, కులం పేరుతో ముఠాలు, ప్రైవేటు సైన్యాల ద్వారా తగాదాల పరిష్కారాలు, అధికారుల బదిలీలు, ప్రభుత్వ సిబ్బందిని సొంత సేవకులుగా వినియోగించుకోవడం, ప్రభుత్వ పనులపైన పూర్తి ఆధిపత్యం – ఇవన్నీ మన వ్యవస్థలో కలగాపులగమైపోయాయి.


అదేవిధంగా గవర్నర్ల నియామకాలు, వారి పక్షపాత ధోరణులు, అఖిల భారత సర్వీసులు, దేశ ఐక్యతకు సంబంధించిన విషయాలలో సమాఖ్యస్ఫూర్తి కొరవడింది. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలు జాతి భవిష్యత్తు పట్ల ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రాథమిక విద్య, కనీస నైపుణ్యాన్ని అందించే శిక్షణల విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. అత్యధిక సంఖ్యాకులకు కనీసం అక్షర జ్ఞానం, సంపద సృష్టించే నైపుణ్యం లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఏ పెద్ద దేశం అభివృద్ధిని సాధించలేదు. విద్యాభివృద్ధికి కృషి చేయడం పోయి అంకెల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టడం ప్రభుత్వాలకి అలవాటయిపోయింది. ఇదే సందర్భంలో వైద్యం పేదలకు అందని ద్రాక్ష పండు అయింది. డాక్టర్లు లేక, కనీస సదుపాయాలు లేక లక్షలాది సామాన్యులు ఎన్నో వెతలకు గురవుతున్నారు. కోట్లాది సామాన్యులు కనీసం రోగనిరోధక టీకాలు అందక అంటువ్యాధులకు గురవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కావాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కరోనా అనుభవాలు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. కానీ మన పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం విచారకరం.


అయితే ప్రతి సమస్యకు పరిష్కారాలున్నాయి. ఆ పరిష్కారాలకు కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, సంకల్పబలం, మంచి పాలన, నిజాయితీతో కూడిన రాజకీయం. ఆచరణాత్మకంగా మానవ వనరుల అభివృద్ధికి అను వైన పాలనా వ్యవస్థను ఏర్పరచకుండా, దేశమంతటా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాల్ని కల్పించకుండా, ప్రజాస్వామ్యంలో గాని, నిరంకుశ రాజ్యంలో గాని అభివృద్ధి అసాధ్యమని మన పాలకులు గ్రహించాలి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసి పాలనా సంస్కరణలను చేపట్టకుండా ఒక్క ఆర్థిక సంస్కరణల మీదే ఆధారపడితే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల మధ్య తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నాయి. ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను ఇవ్వాలంటే, పాఠశాల విద్యకు, ప్రాథమిక ఆరోగ్యానికి పెద్దపీట వేసి జనసామాన్యానికి వాటి నిర్వహణలో భాగస్వామ్యాన్ని, అధికారాన్ని కల్పించి, మానవ వనరుల అభివృద్ధి సమగ్రంగా జరిగే ఏర్పాట్లు చేయడం అత్యంత ఆవశ్యకం. గ్రామ ప్రాంతాల్లో మౌలిక రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించి, వ్యవసాయానుబంధ రంగాలలో, ఇతర గ్రామీణ రంగాలలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేయాలి. మౌలిక అవసరాలు, విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, శాంతిభద్రతలు, శీఘ్రగతిన న్యాయం... ఇవన్నీ నేడు సమాజానికి అత్యవసరం. అవి లేనిదే వేగంగా ఆర్థికాభివృద్ధి అసాధ్యం. ప్రజలు ఒక క్రమపద్ధతి ప్రకారం సమష్టిగా పనిచేయగలిగేలా, మంచిని ప్రోత్సహించి, చెడును నిరుత్సాహపరిచేలా వ్యవస్థలను నిర్మిస్తే మన దేశంలో అద్భుతాలు జరుగుతాయి. నేరస్తులు పదవులు పొందుతూ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు. చేసిన నేరాలకు జైళ్లలో శిక్ష అనుభవించవలసిన వాళ్ళు చట్టాలు చేసే మారాజులయితే ఇక ప్రగతి అసాధ్యం. ఈ దుస్థితి పోవాలన్నా, ప్రజలకు నిజమైన ఫలాలు అందాలన్నా దుష్పరిపాలనకు బదులు మంచి పాలన లభించాలి. ఈ విషయం ప్రజలకు అర్థమయిననాడే; రాజకీయానికి, పాలనకు, ఆర్థిక ప్రగతికి విడదీయలేని సంబంధం ఉందని బోధపడిననాడే; మనం ఎన్నుకున్న వాళ్ళు మన సేవకులని తెలిసిననాడే... మనదేశంలో ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సాధ్యపడుతుంది. స్వాతంత్ర్య శతవార్షికోత్సవం దిశగా దేశం సగర్వంగా నడవగలుగుతుంది.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - 2022-09-14T07:21:00+05:30 IST