పేరరివాలన్‌ విడుదల వ్యవహారం...

ABN , First Publish Date - 2022-05-21T13:38:08+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు డీఎంకే సహా అన్ని పార్టీల నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ

పేరరివాలన్‌ విడుదల వ్యవహారం...

                  - ‘డీఎంకే’ తీరుపై కాంగ్రెస్‌ శ్రేణుల ఆగ్రహం


చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు డీఎంకే సహా అన్ని పార్టీల నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి వ్యాఖ్యానిస్తూ పేరరివాలన్‌ విడుదలైనా ముద్దాయిగానే పరిగణించాలని, నిర్దోషిగా భావించకూడదన్నారు. అన్నింటికి మించి తమ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే నేతలు పేరరివాలన్‌ విడుదలపై ప్రవర్తిస్తున్న తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కూటమికి గుడ్‌బై చెప్పాలంటూ పార్టీ అధిష్టానవర్గంపై ఒత్తిడి చేస్తున్నారు. గత రెండు రోజులుగా పేరరివాలన్‌, ఆయన తల్లి అర్పుదమ్మాళ్‌ అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి, ఎండీఎంకే నేత వైగో సీపీఐ, సీపీఎం నాయకులు, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌, నామ్‌ తమిళర్‌ కట్చి నాయకుడు సీమాన్‌ తదితరులను కలుసుకుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ తతంగమంతా చూస్తుంటే పేరరివాలన్‌ను డీఎంకే దాని మిత్రపక్షాలు నిర్దోషిగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని కాంగ్రెస్‌లో కొందరు నేతలు భావిస్తున్నారు. హత్యకేసు ముద్దాయిగానే విడుదలైన పేరరివాలన్‌ను అదే పనిగా అభినందించడం తగదని సీఎల్పీనేత సెల్వపెరుంతగై అన్నారు. మాజీ ప్రధాని హత్యకేసులో 31 యేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి సులువుగా విడుదల అవుతున్నప్పుడు ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు.  

కాగా సుప్రీం కోర్టు తీర్పును ససేమిరా అంగీకరించబోమని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోకపోయినా పార్టీ సాధారణ కార్యకర్తలు సహించరన్నారు. టీఎన్‌సీసీ ఉపాధ్యక్షుడు పొన్‌ కృష్ణమూర్తి కూడా పేరరివాలన్‌ విడుదలను పండుగ చేసుకుంటున్న పార్టీలు తమ సన్నిహితులో, బంధువులో హతమై, ఆ కేసు ముద్దాయి విడుదలైతే ఇలాగే వేడుకలు చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ముద్దాయి విడుదల కోసం పోరాడి విడుదలయ్యాక అతడిని ఆలింగానులు చేసుకుని శాలువలతో సత్కరించడం భావ్యమేనా అని ఏఐసీసీ సభ్యుడు వీఆర్‌ శివరామన్‌ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పేరరివాలన్‌ విడుదలపై డీఎంకే, ఆ పార్టీ కూటమిలోని ఇతర పార్టీల నాయకులు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ కూటమి నుంచి కాంగ్రెస్‌ వైదొలగాలని కోరుతూ ధర్మపరి జిల్లా కాంగ్రెస్‌ నాయ కుడు సిట్రరసు తన పదవికి రాజీనామా చేశారు. సిట్రరసు లాగే ఆ జిల్లాకు చెందిన 15 మంది స్థానిక  నాయకులు కూడా రాజీనామా చేశారు.



Updated Date - 2022-05-21T13:38:08+05:30 IST