పేరరివాలన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-19T13:59:33+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ముద్దాయిల్లో ఒకరైన పేరరివాలన్‌కు స్వేచ్ఛ లభించింది. తన మూడు దశాబ్దాల జైలు జీవితం నుంచి ఆయన బయటపడ్డారు. అతడిని

పేరరివాలన్‌ విడుదల

- సుప్రీం సంచలన తీర్పు 

- శుభాకాంక్షలు తెలిపిన సీఎం

- స్టాలిన్‌కు పేరరివాలన్‌, అర్బుదమ్మాళ్‌ కృతజ్ఞతలు 

- నిరసనగా నేడు కాంగ్రెస్‌ ధర్నాలు


చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ముద్దాయిల్లో ఒకరైన పేరరివాలన్‌కు స్వేచ్ఛ లభించింది. తన మూడు దశాబ్దాల జైలు జీవితం నుంచి ఆయన బయటపడ్డారు. అతడిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నాతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం 29 పేజీలతో కూడిన తీర్పు వెలువరించింది. పేరరివాలన్‌ విడుదల విషయంలో గవర్నర్‌ జాప్యం ప్రదర్శించడం తీవ్ర తప్పిదమని, రాజ్యంగ ధర్మాసనంలోని 161 సెక్షన్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సెక్షన్‌ 142 ప్రకారం తమకున్న ప్రత్యేక అధికారాన్ని బట్టి పేరరివాలను విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీం తీర్పు వెలువడగానే తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలోని తన స్వగృహంలో వున్న పేరరివాలన్‌ డప్పు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. తన కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి మిఠాయిలు పంచుతూ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయన తన తల్లి అర్బుదమ్మాళ్‌తో చెన్నై విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. అయితే టీఎన్‌సీసీ మాత్రం పేరరివాలన్‌ విడుదలను తీవ్రం గా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు తీర్పును తాము తప్పుబట్టడం లేదని చెబుతూనే పేరరివాలన్‌ విడుదలను నిరశిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ప్రకటించింది. కాగా సుప్రీంకోర్టు పట్ల పేరరివాలన్‌, అతని మాతృమూర్తి అర్బుదమ్మాళ్‌ సహా పలు పార్టీలకు చెందిన నేతలు స్పందించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... 


చారిత్రకమైన తీర్పు: ముఖ్యమంత్రి స్టాలిన్‌

రాజీవ్‌హత్యకేసు ముద్దాయి పేరరివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పును వెలువరించింది. 32 యేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న అతడిని ఎట్టకేలకు సుప్రీంకోర్టు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలతో ఏకీభవించి సుప్రీం ఈ తీర్పునిచ్చింది. శాసనసభ ఎన్నికల సమయంలో డీఎంకే మేనిఫెస్టోలో రాజీవ్‌ హత్యకేసు ముద్దాయిల విడుదలకు చర్యలు చేపడుతుందని హామీగా ప్రకటించాం. అది ఇప్పుడు నేరవేరింది.. మానవతా దృక్పథంతో, మానవహక్కులను కాపాడే విధంగా పేరిరివాలన్‌ను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాను. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాష్ట్రానికి ఉన్న హక్కులు మరోమారు ధ్రువీకరించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.  గవర్నర్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించనప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అనవసరమని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గవర్నర్‌ జోక్యం చేసుకునే వీలులేదని కూడా ఈ తీర్పు స్పష్టం చేసింది. 31 ఏళ్ల తరువాత స్వేచ్ఛవాయువులు పీలుస్తున్న పేరరివాలన్‌కు శుభాకాంక్షలు. ఈ విషయంలో పేరరివాళన్‌ తల్లి అర్బుదమ్మాళ్‌ తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ సుదీర్ఘ న్యాయపోరాటం జరిపి మాతృత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆలస్యమైనా ఈ తీర్పు చారిత్రకమైన తీర్పు. మానవ హక్కులే కాకుండా రాష్ట్ర హక్కులు కూడా ధ్రువీకరించేలా ఈ తీర్పు వెలువడటం హర్షణీయం.


ఈ విజయం మాదే: ఈపీఎస్‌, ఓపీఎస్‌

పేరరివాలన్‌ విడుదల విజయం మాదే. ఈ కేసులో దోషులుగా ఉన్న ఏడుగురినీ విడుదల చేయాలని తొలిగా మంత్రి వర్గ ఆమోదం చేసి, శాసనసభలో తీర్మాణం చేసింది తమ అధినేత్రి జయలలితే. ఆ తరువాత 2018లో అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్లీ శాసనసభలో తీర్మాణం చేసింది. ఆ తీర్మాణం ఆధారంగానే సుప్రీం కోర్టు ఇప్పుడు తీర్పు చెప్పింది.  మానవతా దృక్పథంతో 30 ఏళ్ల పాటు జైలుజీవితం అనుభవించినవారి బాధను మేం అర్ధం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.


సత్యం, న్యాయం గెలిచాయి: పేరరివాలన్‌

సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పుతో సత్యం, న్యాయం గెలిచాయి. మంచివారు జీవించాలన్నదే ప్రకృతి ధర్మం, ఇది నా వ్యక్తిగతమైన పోరాటం కాదు. జైలుజీవితం గడుపుతున్నప్పుడు తమిళులంతా నాపైౖ ఆదరాభిమానాలు ప్రదర్శించారు, తమ ఇంటి బిడ్డగానే భావించారు. మూడు దశాబ్దాలకు పైగా నాకు అండగా నిలిచిన తమిళులందరికీ ధన్యవాదాలు. ఈ తీర్పు నా మాతృమూర్తి అర్బుదమ్మాళ్‌ జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటానికి, నా కుటుంబీకులు చేసిన త్యాగాలకు లభించిన విజయంగానే పరిగణిస్తాను. తొలి రోజుల్లో నా మాతృమూర్తి ఎన్నో అవమానాలకు గురైంది. ఆ వేదనతోనే ఆమె 31 యేళ్లపాటు పోరాడింది. ఆమె జీవితాన్ని నా కోసమే అంకితం చేసింది. సోదరి సెంగొడి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయంలో ఆందోళనలు, ఉద్యమాలు జరిపినవారిని త్వరలో స్యయంగా కలుసుకుని ధన్యవాదాలు  తెలుపుకుంటాను. 


అందరికీ ధన్యవాదాలు: అర్బుదమ్మాళ్‌

సుప్రీంకోర్టు తీర్పు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. ఏం మాట్లాడాలో కూడా తెలియనంతగా వున్నాను. ఏళ్లతరబడి సాగించిన నా పోరాటానికి లభించిన గెలుపు ఇది. నా కుమారుడి విడుదల కోసం పాటుపడిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు.


దోషిగా ప్రకటించిన కోర్టే విడుదల చేస్తే ఎలా?

 టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగరి

రాజీవ్‌హత్యకేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలను మేం వ్యతిరేకిస్తున్నాం. రాజీవ్‌ను హత్య చేసిన ఏడుగురిని దోషులుగా ప్రకటించి శిక్ష విధించిన కోర్టే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పేరరివాలన్‌ విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పును మేము విమర్శించటం లేదు. అదే సమయంలో రాజీవ్‌హత్యకేసు ముద్దాయిలు విడుదలైనంత మాత్రాన, వారిని నిర్దోషులుగా పరిగణించలేం. ఎన్నటికీ వారు ముద్దాయిలే. తమిళులనే కారణంగా రాజీవ్‌హంతకులను విడుదల చేయాలనే వాదన ఆమోదయోగ్యం కాదు. ఇక పేరరివాలన్‌ విడుదలను వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించనున్నాం. 


తీర్పును స్వాగతించిన నేతలు

పేరరివాళన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మానవహక్కులను ఉద్ఘాటించేలా అత్యంత కీలకమైనదని, అతడిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు నాయ కులు సుప్రీం కోర్టును తీర్పును స్వాగతించారు. పేరరివాళన్‌ విడుదల కోసం అతని తల్లి అర్పుదమ్మాళ్‌ సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేసి విజయం సాధించిందని వారు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా 31 యేళ్లుగా జైలుజీవితం గడుపుతున్న నళిని, మురుగన్‌, రవిచంద్రన్‌, శాంతన్‌, జయకుమార్‌, రాబర్ట్‌ ఫయాజ్‌కు కూడా ఈ తీర్పు వర్తిస్తుంది. ఈ తీర్పును ఉటంకిస్తూ ఆరుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాస్‌, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సీపీఐ నేత ముత్తరసన్‌,ద్రవిడకళగం నేత వీరమణి, ఎంఎన్‌ఎం నేత కమల్‌హాసన్‌, ఏఎమ్‌ఎమ్‌కే నేత దినకరన్‌.ఎన్‌టీకే నేత సీమాన్‌, డీఎండీకే నేత విజయకాంత్‌, సమత్తువమక్కల్‌ కట్చి నేత శరత్‌కుమార్‌ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ అభిప్రాయాలు వెల్లడించారు.


దోషులు, హంతకులు ఎన్నటికీ నిర్దోషులు కాలేరు. సుప్రీంకోర్టు ద్వారా శిక్షింపబడిన వ్యక్తి నేడు విడుదలయ్యాడు. అప్పుడు గోపాల్‌ గాడ్సే, ఇప్పుడు పేరరివాలన్‌ అంతే!.

- కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం టాగూర్‌ 



Updated Date - 2022-05-19T13:59:33+05:30 IST