ప్రాంతీయ ఆస్పత్రిలో శతశాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T06:10:50+05:30 IST

పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తొలిరోజు శతశాతం విజయవంతమైంది.

ప్రాంతీయ ఆస్పత్రిలో శతశాతం వ్యాక్సినేషన్‌
నర్సీపట్నంలో టీకా వేయించుకుంటున్న ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి

     నర్సీపట్నం, జనవరి 16 : పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తొలిరోజు శతశాతం విజయవంతమైంది. ప్రాంతీయ ఆస్పత్రి, అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌ సిబ్బంది వంద మంది పేర్లు నమోదు చేసుకోగా అందరూ టీకా వేయించుకున్నారు. వీరికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తెలెత్తలేదు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తొలుత ఈ ప్రక్రియను ప్రారంభించారు.  ఐటీసీటీ కేంద్రం కౌన్సిలర్లు చంద్రశేఖర్‌కు, జి.పద్మజలకు టీకాలు వేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి కూడా టీకా వేయించుకున్నారు. ఇదిలావుంటే, ఆస్పత్రి ఓపీ విభాగం పక్కన టీకా కేంద్రం ఏర్పాటు చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాంగణం ఇరుగ్గా ఉండడంతో టీకా కోసం వచ్చేవారు కుర్చొవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదీకాక అబ్జరేషన్‌ గదిలో కేవలం రెండు మంచాలు మాత్రమే వేశారు. డాక్టర్‌ ప్రశాంతి  ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య అసహనం వ్యక్తం చేశారు. 

నాతవరంలో..

నాతవరం: ఇక్కడి పీహెచ్‌సీలో వైద్యాధికారి డాక్టర్‌ రాజేశ్‌నాయుడు తొలి టీకా వేయించుకున్నారు. ముందుగా ప్రధాని మోదీ సందేశాన్ని ఎంపీడీవో యాదగిరేశ్వరరావు, తహసీల్దార్‌ కె.జానకమ్మ తదితరులు విన్న అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరువాత  పీహెచ్‌సీల వైద్యులు సరేశ్‌, పద్మప్రియ,  ప్రసన్న, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది టీకా వేయించుకున్నారు.   మొత్తం 474 మందికి ఇక్కడ టీకా వేయనున్నట్టు వైద్యులు తెలిపారు.   మధ్యాహ్నం సబ్‌కలెక్టర్‌ ఎన్‌.మౌర్య వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సందర్శించారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు, పేరెంట్స్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రెడ్డి వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లిలో..

 నక్కపల్లి : మండల కేంద్రమైన నక్కపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించారు. తొలి టీకాను గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎ.జయలక్ష్మి వేయించుకున్నారు.  అనంతరం గొడిచెర్ల పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌  కిశోర్‌కుమార్‌, సీహెచ్‌సీ డెంటల్‌ సర్జన్‌ వరప్రసాద్‌,  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరప్రసాద్‌లకు టీకాలు వేశారు. తదుపరి ఆస్పత్రి సిబ్బందికి టీకాలు వేశారు.  ప్రత్యేకాధికారి డాక్టర్‌ సత్యవాణి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగింది. తొలిరోజు వంద మందికి 98 మంది టీకా వేయించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాబూరావు విలేఖరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే ఏపీలో కరోనా మరణాలు తగ్గాయన్నారు.  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జనార్దనం, తహసీల్దార్‌ వీవీ రమణ, ఎంపీడీవో రమేశ్‌రామన్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T06:10:50+05:30 IST