సమర్థవంతంగా విధులు నిర్వహించండి

ABN , First Publish Date - 2022-06-28T04:48:42+05:30 IST

ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో మహిళా పోలీసులు సోమవారం ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌కు మిఠాయిలు అందజేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

సమర్థవంతంగా విధులు నిర్వహించండి
ఎస్పీకి మిఠాయిలు అందజేస్తున్న మహిళా పోలీసులు

కడప(క్రైం), జూన్‌ 27 : ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో మహిళా పోలీసులు  సోమవారం ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌కు మిఠాయిలు అందజేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌తో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. మహిళలపై నేరాలు జరగకుండా చూడడం, ఒక వేళ జరిగినట్లు తెలిసిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. చట్ట విరుద్దమైన కార్యకలాపాలపై స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. 

ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి 

  ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బాధితులతో ముఖాముఖి మాట్లాడారు.   వారి సమస్యలు తెలుసుకున్నారు. స్పందన ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికారులను ఆదేశించారు. 

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం 

విధి నిర్వహణలో కరోనా బారినపడి మరణించిన కడప కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ హోంగార్డు ఎం.నాగరాజు సతీమణి ఎం.లక్ష్మీదేవికి పోలీసు శాఖ కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వర్తించే హోంగార్డు కరోనా మహమ్మారితో మరణించడం బాధాకరమన్నారు. కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సోమశేఖర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T04:48:42+05:30 IST