వరవర రావుకు శాశ్వత బెయిల్‌

ABN , First Publish Date - 2022-08-11T09:22:48+05:30 IST

భీమా కొరేగావ్‌- ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ విప్లవకవి వరవర రావుకు సుప్రీంకోర్టు శాశ్వత మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

వరవర రావుకు శాశ్వత బెయిల్‌

అనారోగ్య కారణాల దృష్ట్యా మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ముంబయి వదలివెళ్లవద్దని షరతు


న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భీమా కొరేగావ్‌- ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  ప్రముఖ విప్లవకవి వరవర రావుకు సుప్రీంకోర్టు శాశ్వత మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా దీన్ని మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు గడువు ముగిసిన తరువాత లొంగిపోవాలని ఆదేశించడంతో దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇక్కడ ఆయనకు ఊరట లభించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాన్షు ధూలియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో మూడు నెలల్లో సరెండర్‌ కావాలన్న అంశాన్ని పక్కనబెట్టింది. ఈ కేసులో అభియోగాలు ఇంకా నమోదు కాలేదని, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆరోగ్యం కూడా మెరుగుపడలేదని, ఈ కారణాల రీత్యా వరవర రావు బెయిల్‌ పొందడానికి అర్హుడని స్పష్టం చేసింది.


ఈ మేరకు శాశ్వత మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కేసు విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా ముంబయి విడిచి వెళ్లరాదని షరతు విధించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేసుకోకూడదని తెలిపింది. సాక్షులను కలుసుకోవడం, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయకూడదని పేర్కొంది. కేవలం అనారోగ్య కారణాల దృష్ట్యానే బెయిల్‌ ఇస్తున్నామని, ప్రత్యర్థులు ఇతర అభియోగాలు,   వాదనలు చేసినప్పుడు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

 

తొలుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. విచారణ ప్రారంభం కాగానే   ధర్మాసనం స్పందిస్తూ ‘‘వరవర రావు వయస్సు ఎంత? ఎప్పుడు అరెస్టు అయ్యారు? ఎంత కాలం జైలులో ఉన్నారు? ప్రస్తుత ట్రయల్‌ స్థితి ఏమిటి? అభియోగాలను నమోదు చేశారా? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? తాత్కాలిక బెయిల్‌ పొందాక వరవర రావు ఎక్కడ ఉన్నారు?’’ వంటి ప్రశ్నలను సంధించింది. ఆ ప్రశ్నలకు ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ సమాధానమిచ్చారు. ‘‘ 82 ఏళ్ల వరవర రావు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2018లో అరెస్టయి దాదాపు రెండున్నరేళ్ల పాటు జైలు ఉన్నారు. ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ ఇంకా ట్రయల్‌ ప్రారంభం కాలేదు. అభియోగాల నమోదు ప్రక్రియ కూడా మొదలుకాలేదు. ఈ కేసులో అన్ని ఎలకా్ట్రనిక్‌ అధారాలే ఉన్నాయని ఎన్‌ఐఏ అంటోంది. కానీ  అవన్నీ కావాలని సృష్టించిన కాపీలే. అనారోగ్య సమస్యలపై వివాదమేమీ లేదు. చాలా సార్లు ఆస్పత్రిపాలయ్యారు. సుదీర్ఘకాలంపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ముంబయిలో జీవిస్తున్నారు. ఆయనకు వచ్చే పెన్షన్‌ వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు.


హైదరాబాద్‌కు వెళ్లడానికి ఆయనకు అనుమతించాలి. గతంలో ఆయనపై నమోదైన 24 కేసుల్లో చాలా వరకు నిర్దోషిగా తేలారు. కొన్ని కేసులను ప్రభుత్వాలే ఉపసంహరించుకున్నాయి’’ అని వివరించారు.  ఎన్‌ఐఏ చెబుతున్న పత్రాలను ఆ దర్యాప్తు సంస్థే కంప్యూటర్లలో చొరబాటుకు పాల్పడి పెట్టినట్లు నాలుగు అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు పరిశోధన చేసి తేల్చాయని గ్రోవర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వరవరరావు జైలులో మరణిస్తే అందుకు ఎవరు బాధ్యులని గ్రోవర్‌ ప్రశ్నించారు. వెంటనే స్పందింంచిన ధర్మాసనం... ‘‘అలా అనవద్దు. దేశంలోని ప్రతి పౌరుడు మంచి ఆరోగ్యంతో బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. గ్రోవర్‌ వాదనలు కొనసాగిస్తూ ‘‘వరవరరావు ఇంకెంతకాలం జైలులో ఉండాలి? మరణించే వరకు జైలులో ఉండాలా? స్టాన్‌ స్వామిలా జైలులో మరణించాలని చూస్తున్నారా? ఆయనను తిరిగి తలోజా జైలుకు పంపిస్తే ఆయన అక్కడే మరణిస్తారు’’ అని తీవ్ర ఆవేదనతో చెప్పారు.  


ఏం శిక్ష పడుతుంది?

ఈ కేసులో వరవర రావు దోషిగా తేలితే ఏం శిక్ష పడుతుందని ధర్మాసనం జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజును ప్రశ్నించగా.. మరణ శిక్ష పడే అవకాశముందని ఆయన బదులిచ్చారు. ‘‘ట్రయల్‌ ఎప్పుడు మొదలవుతుంది..? ఎప్పటికల్లా పూర్తవుతుంది’’ అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. ఏడాదిన్నర కాలంలో ట్రయల్‌ పూర్తవుతుంది’’ అని రాజు సమాధానమిచ్చారు.  ఽధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘‘82 ఏళ్ల వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటే అవి అలాగే కొనసాగుతాయి. ఆయన ఆరోగ్యం మెరుగుపడబోదు’’ అని వ్యాఖ్యానించింది. ‘‘హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులను ఉల్లంఘించలేదు కదా?’’ అని ఇంకో ప్రశ్న వేసింది. ఇందుకు ఏఎ్‌సజీ రాజు స్పందిస్తూ ‘‘ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సీరియ్‌సగా ఏమీ లేదు. అనారోగ్యంగా ఉంటే బెయిల్‌పై ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా అలా చేయలేదు. ఆయన చేస్తున్న పనులు చాలా తీవ్రమైనవి. అవి దేశానికి ప్రమాదకరమైనవి’’ అని వివరించారు. ఆయన వల్ల ఎంతమంది మరణించారని ధర్మాసనం ప్రశ్నించగా.. అనేక మంది పోలీసు సిబ్బంది మరణించారని, ఆయనకు మరణ శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సీనియర్‌ న్యాయవాది గ్రోవర్‌... ‘‘వరవర రావు వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇదంతా ఒక కుట్ర. ఆయన ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదు’’ అని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - 2022-08-11T09:22:48+05:30 IST