త్వరలో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు

ABN , First Publish Date - 2022-05-29T06:24:52+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు, రహదారుల విస్తరణకు సంబంధించి త్వరలో అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయనున్నట్టు నర్సీపట్నం డీఎఫ్‌ఓ సీహెచ్‌ సూర్యనారాయణపడాల్‌ తెలిపారు.

త్వరలో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు
సూర్యనారాయణపడాల్‌


నాలుగు రూరల్‌ కనెక్ట్ట్‌విటీ రోడ్లకు గ్రీన్‌సిగ్నల్‌

నర్సీపట్నం డీఎఫ్‌ఓ సూర్యనారాయణపడాల్‌

సీలేరు, మే 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు, రహదారుల విస్తరణకు సంబంధించి త్వరలో అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయనున్నట్టు నర్సీపట్నం డీఎఫ్‌ఓ సీహెచ్‌ సూర్యనారాయణపడాల్‌ తెలిపారు. శనివారం ఆయనిక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌బీ ఎంపిక చేసిన వై.రామవరం-పోతవరం రహదారి, కృష్ణాదేవిపేట పరిధిలో పెండింగ్‌లో ఉన్న మూడు కిలోమీటర్ల రహదారికి కూడా త్వరలో అటవీ అనుమతులు మంజూరు కానున్నాయన్నారు. ఆర్వీనగర్‌ నుంచి పాలగెడ్డ రహదారి విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికార్లు సీఏ ల్యాండ్‌ మంజూరు చేయాల్సి ఉందన్నారు. పంచాయతీరాజ్‌లో 15 రోడ్లు (పీఎంజేవైసీ), రూరల్‌ కనెక్ట్ట్‌విటీ రోడ్లు 12కు అటవీ అనుమతులు రావాల్సి ఉండగా, నాలుగు రోడ్లుకు అనుమతులు మంజూరయ్యా యన్నారు. త్వరలోనే మిగతా వాటికి మంజూరు చేస్తామన్నారు. వీటికి సీఏ ఏరియా చూపకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. ఐటీడీఏ  తాజాగా మరో 27 రోడ్లకు అనుమతులు కోరిందన్నారు. కృష్ణాదేవిపేట, ఆర్వీనగర్‌, లోతుగెడ్డ, చింతపల్లి పరిధిలోని డోలీమోత గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం కోసం అటవీ అనుమతులు కోరిందన్నారు. వీటికి మరో వారం పది రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 

ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అత్యధికంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు

రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అత్యధికంగా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసినట్టు డీఎఫ్‌ఓ సీహెచ్‌ సూర్యనారాయణపడాల్‌ తెలిపారు. ఈ ఏడాది డివిజన్‌ పరిధిలో 50 హెక్టార్ల ప్లాంటేషన్‌ చేస్తున్నామని, ఇందులో చింతపల్లి, లోతుగెడ్డ, సీలేరు, కృష్ణాదేవిపేట, నర్సీపట్నంల్లో 10 హెక్టార్ల చొప్పును ప్లాంటేషన్‌ వేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి అడవులను అగ్ని నుంచి రక్షించే చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నంలో 80 శాతం పైగా పొల్యూషన్‌ నమోదవుతుందని, ఏజెన్సీ ప్రాంతంలో పచ్చటి అడవుల వలన ఎటువంటి పొల్యూషన్‌ లేదన్నారు. మన అటవీప్రాంతంలో నెమళ్లు, జింకలు, తదితర వన్యప్రాణులు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాలన్నారు. రాజస్థాన్‌లో నెమళ్లు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయని, అలాగే మన ప్రాంతంలో కూడా వన్య ప్రాణులు బహిరంగంగా సంచరిస్తే పర్యాటకులు వాటిని చూసి ఎంతో అనుభూతిని పొందుతారని డీఎఫ్‌వో సూర్యనారాయణపడాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సీలేరు రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు, ఆర్వీనగర్‌ రేంజ్‌ అధికారి తవిటినాయుడు, డీఆర్వో గోపీ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:24:52+05:30 IST