Perni Nani vs Balasouri: తాడేపల్లి ప్యాలెస్‌కు బందరు వర్గపోరు.. ఎంపీ, ఎమ్మెల్యేకు వైసీపీ అధిష్టానం ఆర్డర్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-06-11T21:53:22+05:30 IST

వైసీపీలో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. వైసీపీ అధిష్టానం ఈ వివాదంపై..

Perni Nani vs Balasouri: తాడేపల్లి ప్యాలెస్‌కు బందరు వర్గపోరు.. ఎంపీ, ఎమ్మెల్యేకు వైసీపీ అధిష్టానం ఆర్డర్స్ ఇవే..

అమరావతి: వైసీపీలో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. వైసీపీ అధిష్టానం ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బందరు పంచాయితీ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. హైకమాండ్ నుంచి ఎంపీ బాలశౌరికి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి పిలుపు అందింది. ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడవద్దని వైసీపీ పెద్దలు ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అస్సలు పడటం లేదు. బందరులో ఎంపీ బాలశౌరి పర్యటనకు పేర్ని నాని వర్గీయులు అడ్డు తగలడం, ‘గో బ్యాక్ బాలశౌరి’ అంటూ బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేయడంతో రాజకీయంగా వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో బాహాటంగా చెప్పినట్టయింది. ‘మచిలీపట్నం ఎంపీకి, ఎమ్మెల్యేకు పడటం లేదహో’ అని కోడై కోసి వైసీపీ వర్గమే బయటపెట్టుకున్నట్టయింది. పేర్ని నాని వర్గం శుక్రవారం నాడు బాలశౌరిని బందరులో అడ్డుకోవడంతో బాలశౌరి వర్గం కూడా తిరగబడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి కారాలుమిరియాలు నూరారు.



‘బందరు ఎమ్మెల్యే పేర్ని నాని అగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. సొంత పార్టీ ఎంపీ మచిలీపట్నంలో తిరగకుండా అడ్టుకుంటున్నాడు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికి ఒకసారైనా మాట్లాడకపోతే ఆయనకు నిద్రపట్టదు. వేరే పార్టీ ఎంపీ(సుజనా చౌదరి)తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఆ ఎంపీ ముఖ్యమంత్రిని, పార్టీని, ప్రభుత్వాన్ని అవినీతిమయమని తిడితే స్పందించడు. కానీ సొంతపార్టీ ఎంపీ బందరు రాకూడదు. బందరు నీ అడ్డాకాదు.. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటా. నా ప్రొటోకాల్‌ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేను. మూడేళ్లలో ఒక్కసారైనా ఒక్క కార్యక్రమానికి సొంత పార్టీ ఎంపీని పిలిచావా.. ప్రొటోకాల్‌ గురించి నువ్వు, నీ పక్కనున్నవాళ్లు మాట్లాడడం సిగ్గుచేటు. బందరు అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించావా? నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడ్డావో బందరు ప్రజలందరికీ తెలుసు’ అని బాలశౌరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 


ఇదిలా ఉండగా.. పేర్ని నాని, బాలశౌరి ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. కాపులకు తానే పెద్ద అన్న రీతిలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని బాలశౌరి గుర్రుగా ఉన్నారు. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం మచిలీపట్నంలో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించాలన్న ఎంపీ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా పేర్ని అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా ఉంది.

Updated Date - 2022-06-11T21:53:22+05:30 IST