ఆ రెండు పార్టీలూ.. ముసుగు తీసేశాయి: పేర్నినాని

ABN , First Publish Date - 2021-12-18T00:20:59+05:30 IST

జనసేన -టీడీపీ నేతలు ఇప్పటి వరకు రాత్రిళ్లే కలుసుకునేవారు...ఇప్పుడు ముసుగు తీసి పగలే కలుసుకుంటున్నారని రవాణాశాఖ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు.

ఆ రెండు పార్టీలూ.. ముసుగు తీసేశాయి: పేర్నినాని

అమరావతి: జనసేన -టీడీపీ నేతలు ఇప్పటి వరకు రాత్రిళ్లే కలుసుకునేవారు...ఇప్పుడు ముసుగు తీసి పగలే కలుసుకుంటున్నారని రవాణాశాఖ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఔటర్ రింగ్ రోడ్డు అనేది ఎక్కడుంది...? లేని ఔటర్ రింగ్ రోడ్డు మాకు వద్దని సీఎం జగన్ చెప్పారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 189 కిలో మీటర్ల ఓఆర్ఆర్‌ను 17760 కోట్లతో 8213 ఎకరాల భూమి సేకరించాలని 2016-17లో రిపోర్టు తయారు చేశారు. గుగూల్ మ్యాప్‌లో గీత గీస్తే ఔటర్ రింగ్ రోడ్డు అయిపోతుందా?. ఫ్యూజిబిలిటీ కోసం కేంద్రం ఓసంస్థను రిపోర్టు అడిగింది. 


 అమరావతిని సీఎం జగన్ అభివృద్ధి చేస్తారు.అమరావతి కూడా ఒక రాజధాని. రాజధాని భూసేకరణ కోసం 4 వేల కోట్లు కావాలని నివేదిక ఇచ్చారు. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు క్రమంగా  పెరిగాయి. పలు హైవేలు విజయవాడ మీదుగా వెళ్తుండటంతో ప్రయాణికులు ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు. చినఅవుటపల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు బైపాస్ హైవే కోసం సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. 2023 నాటికి విజయవాడ బైపాస్ రోడ్డు పూర్తి చేసేందుకు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. బెంజిసర్కిల్  రెండో వంతెనను సీఎం శరవేగంగా పూర్తి చేశారు.  బైపాస్ నిర్మాణం కోసం కేంద్రంపై  ఒత్తిడి తెచ్చి సీఎం జగన్ పూర్తి చేయిస్తున్నారు. 187కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఓఆర్ఆర్  ప్రాజెక్టును సీఎం వదలి వేయలేదు. చిన అవుట్‌పల్లి వయా గన్నవరం -కంకిపాడు మీదుగా  కాజా వెళ్లే ప్రాజెక్టుకు చేపట్టి పూర్తి చేస్తాం. డీపీఆర్ లేని ఔటర్ రింగ్‌ను సీఎం  జగన్ చేపట్టలేదని చెప్పడం దారుణం. 2017ఏప్రిల్‌లో ఫీజుబులిటీ రిపోర్టు ఇచ్చి భూ సేకరణ చేయొచ్చని కేంద్రం చెప్పింది.


న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రకు చేపట్టిన ఖర్చుతో రాజధానిలో రహదారులు అభివృద్ధి చేసి ఉండవచ్చు. చేనేత, టెక్ట్స్‌టైల్ రంగంపై కేంద్రం జీఎస్టీని 5-12శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం.చేనేత రంగానికి నష్టం చేకూర్చేలా కేంద్రం  నిర్ణయం ఉంది.జీఎస్టీ లేకుండా చేయాలని ఏపీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌లో డిమాండ్ చేస్తుంది.జీఎస్టీపై ఆందోళనకు వైసీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది.సినిమా టికెట్లపై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.’’ అని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T00:20:59+05:30 IST