రాజకీయ మనుగడకే జగన్‌పై వ్యక్తిగత విమర్శలు

ABN , First Publish Date - 2022-06-30T06:16:26+05:30 IST

రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దీంతో రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన మనుషులతో సీఎం జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఆరోపించారు.

రాజకీయ మనుగడకే  జగన్‌పై వ్యక్తిగత విమర్శలు
ప్లీనరీలో మాట్లాడుతున్న వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి

వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి ఆరోపణ

అయ్యన్న నోరుపారేసుకుంటే నాలుక చీరేస్తామని మంత్రి అమర్‌ హెచ్చరిక

వేపగంటలో వైసీసీ అనకాపల్లి జిల్లా ప్లీనరీ

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని 97వ వార్డు నేత నిరసన 


వేపగుంట, జూన్‌ 29: రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నామని, దీంతో రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన మనుషులతో సీఎం జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఆరోపించారు. బుధవారం వేపగుంట సమీపంలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పార్టీ అనకాపల్లి జిల్లా ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలులో ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడమేకాకుండా, ఇళ్లు కూడా మంజూరు చేశామని ఆయన తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమరనాథ్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని, ఇకపై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అయ్యన్నప్రాత్రుడిని ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు నిలదీయాలని, అవసరమైతే కార్యకర్తలకు తాను అండగా వుంటానని అన్నారు. చంద్రబాబు వయసు 72 కాదు.. 27 అని టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు అంటున్నారని, చంద్రబాబు వయసు రహస్యం ఈమెకు ఎలా తెలుసని ప్రశ్నించారు.  అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడే వారికి తగిన సమయంలో పదవులు లభిస్తాయని, ఇందుకోసం సహనం, ఓపికతో వేచివుండాలని సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ధర్మశ్రీ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించి, జగన్‌ను రెండోసారి సీఎంను చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమావేశంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి ఆదీప్‌రాజ్‌, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, తదితరులు ప్రసంగించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, జీవీఎంసీ మేయర్‌ హరి వెంకట కుమారి, నాయకులు డీవీ సూర్యనారాయణరాజు, యు.సుకుమారవర్మ, చొక్కాకుల వెంకటరావు, ముమ్మన దేముడు, జి.సాంబ, గుంటూరు వెంకట నరసింహారావు, దాసరి రాజు, మురళి, చందు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం ఏది?

ప్లీనరీలో మంత్రి గుడివాడ అమర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కొద్దిసేపు గలాటా నెలకొంది.  97వ వార్డుకు చెందిన సన్నీ అనే వైసీపీ నాయకుడు లేచి... పార్టీ కోసం పనిచేసేవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోపించారు. దీంతోఇతర నాయకులు అతని ప్రసంగానికి అడ్డుతగిలి, సభ నుంచి బయటకు పంపించేశారు.


Updated Date - 2022-06-30T06:16:26+05:30 IST