భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్!

ABN , First Publish Date - 2022-01-21T23:59:17+05:30 IST

దాదాపు 20 వేల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం

భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్!

న్యూఢిల్లీ : దాదాపు 20 వేల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం ఓ ప్రభుత్వ సర్వర్ నుంచి అక్రమంగా బయటకు పొక్కింది. వ్యక్తుల పేర్లు, చిరునామాలు, మొబైల్ ఫోన్ నంబర్లు, కోవిడ్ పరీక్షల ఫలితాలు బయటకొచ్చాయి. ఆన్‌లైన్ సెర్చ్ చేసి ఈ వివరాలను చూసేందుకు వీలుగా ఉన్నాయి. Raid Forums వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. 


Raid Forums వెబ్‌సైట్‌లో ఓ సైబర్ క్రిమినల్ ఈ సమాచారాన్ని ఉంచినట్లు మీడియా పేర్కొంది. దాదాపు 20 వేల మందికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు ఆ క్రిమినల్ పేర్కొన్నట్లు తెలిపింది. వ్యక్తి పేరు, వయసు, చిరునామా, స్త్రీ లేదా పురుషుడు, మొబైల్ నంబర్, కోవిడ్ పరీక్షల తేదీ, ఫలితాలు వంటి వివరాలతో ఈ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు వివరించింది. 


సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా ఇచ్చిన ట్వీట్‌లో, వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పీఐఐ)ని ప్రభుత్వ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ ద్వారా బయటపెట్టినట్లు తెలిపారు. మోసపూరితమైన ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. కోవిడ్-19కు సంబంధించి ఆఫర్లు ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చినపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. 


ఈ నేపథ్యంలో ఈ-మెయిల్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని జాతీయ మీడియా తెలిపింది. కోవిడ్ సంబంధిత సేవలు, సమాచారం కోసం అత్యధికంగా డిజిటల్ టెక్నాలజీస్‌పైన ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. టీకాకరణ కోసం కూడా కోవిన్ పోర్టల్‌ను వినియోగించుకుంటున్నారు. 


Updated Date - 2022-01-21T23:59:17+05:30 IST