ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఉద్యోగుల షాక్

ABN , First Publish Date - 2022-07-04T22:57:57+05:30 IST

ఎయిర్ ఇండియాలో పని చేసేందుకు ఇతర కంపెనీల ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఉద్యోగుల షాక్

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాలో పని చేసేందుకు ఇతర కంపెనీల ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అనారోగ్యం కారణంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది  సెలవుపై వెళ్లడంతో విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన 55 శాతం దేశీయ విమానాలు శనివారం ఆలస్యమైన విషయం తెలిసిందే. ఇంత తీవ్రంగా కాకపోయినా... ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చేరేందుకు సిబ్బంది సెలవుపై వెళ్లారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA(Director General of Civil Aviation) చీఫ్ అరుణ్ కుమార్ స్పందించారు. ఇందుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కాగా... ఎయిర్ ఇండియా రెండో దశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను శనివారం నిర్వహించిందని, సిక్ లీవ్ తీసుకున్న ఇండిగో సిబ్బంది దానికి వెళ్లారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,600 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం... ఇండిగో దేశీయ విమానాలలో 45.2 శాతం శనివారం సమయానికి నడిచాయి. 


శనివారం ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్‌ఏషియా ఇండియా విమానాలలో వరుసగా 77.1 శాతం, 80.4 శాతం, 86.3 శాతం, 88 శాతం, 92.3 శాతం విమానాలు సకాలంలో నడిచాయి. గతేడాది అక్టోబరు 8న ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బిడ్‌ను విజయవంతంగా గెలుపొందిన తర్వాత జనవరి 27న ప్ ఎయిర్ ఇండియా నియంత్రణను టాటా గ్రూప్ చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా... కొత్త విమానాలను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ ఇండియా తన సేవలను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సిబ్బంది భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో... ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎయిర్ ఇండియా వైపు చూస్తున్నారు. ప్రత్యేకించి ఇండిగో ఉద్యోగులే ఎక్కువ సంఖ్యలో... ఎయిర్ ఇండియా వేపు చూస్తున్నట్లుగా  వినవస్తోంది. 

Updated Date - 2022-07-04T22:57:57+05:30 IST