తెలుగు ప్రతిష్ఠకు తెగులు!

Published: Sun, 28 Mar 2021 02:58:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలుగు ప్రతిష్ఠకు తెగులు!

‘విద్యావంతులు అప్రయోజకులయ్యారు. శుంఠలు సభా పూజ్యులయ్యారు. సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదు. వదరుబోతుల మాటే చెల్లుబాటు అవుతోంది. దుష్ట మానవులు వర్ధిల్లుతున్నారు’ ... ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురికి చెందిన శేషప్ప కవి 18వ శతాబ్దంలోనే తాను రచించిన నారసింహ శతకంలో ఈ ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఏ సమాజంలోనైతే నీతి తప్పినవారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు రావాల్సిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తారో అక్కడ వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్షకు సమయం ఆసన్నమైనట్టే’ ..అని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ క్లిట్‌ గార్డ్‌ అభిప్రాయపడ్డారు. శేషప్ప కవి ఆవేదన, క్లిట్‌ గార్డ్‌ అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని ఎవరైనా భావిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. వదరుబోతుల మాటే అక్కడ ఇప్పుడు చెల్లుబాటవుతోంది. సంక్షేమం మాటున ప్రజాధనాన్ని పంచిపెడుతున్నందున పాలకుల దుశ్చర్యలు ప్రజలకు పట్టడం లేదు. దీంతో పాలకులతో పాటు పాలనా యంత్రాంగంలోని ముఖ్యులు కూడా నీతి తప్పి వ్యవహరిస్తున్నారు. కంపెనీలను కబ్జా చేస్తున్నప్పటికీ ప్రజలకు పట్టడం లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థల నిర్ణయాల వల్ల అన్యాయం జరిగిందని భావించేవారికి ఏకైక దిక్కుగా ఉన్న న్యాయ వ్యవస్థపై ముష్కర దాడి జరిగినా, జరుగుతున్నా సమాజానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులను నేరస్తులుగా మార్చివేస్తున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలోకి వచ్చేవారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఆరోగ్య వైద్య విద్యాలయం ఉపకులపతి వంటివారు అవినీతి లేనిదెక్కడ అని కొట్టిపారేస్తున్నప్పటికీ అదేమిటని నిలదీయలేని నిస్సహాయతలో పౌర సమాజం ఉంది. ఒకవైపు భయం, మరోవైపు స్వార్థం అవిభాజ్య కవలలుగా అంటిపెట్టుకొని ఉండటంతో విద్యావంతులకు నోళ్లు పెగలడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతున్నందున పలువురు న్యాయమూర్తులపై స్వయంగా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. అవినీతికి సంబంధించిన కేసులలో సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమంత్రికి ఈ విధంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించిన వ్యవస్థను తప్పుబట్టాలో, సదుద్దేశంతో కల్పించిన అవకాశం దురుపయోగం అవుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఫిర్యాదులో పస లేదన్న అభిప్రాయానికి వచ్చిన సుప్రీంకోర్టు ఆ ఫిర్యాదును కొట్టివేసింది. తప్పుడు ఫిర్యాదు చేసిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేయడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు.


కనుక మనం ఊపిరి పీల్చుకోవచ్చు. రాజధాని అమరావతి ఉసురు తీయడానికే ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ గగ్గోలు పెట్టిన వాళ్లు, ఇప్పుడు దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సరికొత్త వాదనను తెర మీదకు తెచ్చారు. ఫిర్యాదు చేశారని జాబితాలో పేర్కొన్న వ్యక్తులే తమ భూములను ఎవరూ అన్యాయంగా కొనుగోలు చేయలేదని స్పష్టంచేస్తున్నప్పటికీ.. లేదు లేదు ఏదో జరిగిపోయిందంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు. రిటైల్‌గా జరుగుతున్న అవినీతిని టోకు వ్యాపారంగా మార్చివేశారు. మద్యం, ఇసుకే ఇందుకు నిదర్శనం. మద్యం షాపులను ఇదివరకు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి అవినీతిని కేంద్రీకరించారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ పేదలను దోచుకుంటున్నారు. ఇసుక అనేది రాజకీయ నాయకులకు కామధేనువుగా ఉంటోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకరికో ఇద్దరికో కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి తమ కడుపు కొట్టారని ఇప్పటిదాకా దోచుకోవడానికి అలవాటుపడిన వారు గగ్గోలుపెడుతుండగా, కాంట్రాక్టు పొందుతున్న కంపెనీలు మాత్రం తాము టోకుగా చెల్లించవలసిన కప్పం ఎంత? అని ఆరా తీస్తున్నాయి. అంటే ప్రభుత్వ పెద్దలకు ఇసుక టోకు వ్యాపారం పాడి ఆవుగా మారుతోందన్న మాట. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇసుక నుంచి తైలం పిండుకోవడానికి ప్రయత్నించలేదు. తమ దళపతులకే ఆ అవకాశం ఇస్తూ వచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైరవుతున్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను అర్ధంతరంగా తొలగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంలో పనిచేసిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించరు కనుక పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులనే ఆ పదవిలో నియమించాలని నిన్నటిదాకా వాదించిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్్శిగా పనిచేసి హైకోర్టు చేత అక్షింతలు కూడా వేయించుకున్న నీలం సాహ్నికి ఆ పదవి కట్టబెట్టారు. మధ్యలో వచ్చిన జస్టిస్‌ కనగరాజ్‌ ఆటలో అరటిపండుగా మిగిలిపోయారు. ఇలాంటి ప్రభుత్వ లీలలు చూస్తుంటే చెప్పేటందుకే నీతులు అన్న కవి మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ప్రత్యేక హోదా అంటూ కలవరించిన వాళ్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసు ఎత్తడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినా పాలకుల నోళ్లు మాత్రం పెగలడం లేదు. సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదని శేషప్ప కవి చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రాదు– ప్రత్యేక ప్యాకేజీ అయినా తీసుకోండని చెప్పినా ‘‘అట్టెట్టా కుదురుతుందీ మా జగనన్న అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తారు. మా జీవితాల్లో వెలుగులు నింపుతారు. కొలువులే కొలువులు’’ అని మారాం చేసిన ప్రజలు ఇప్పుడు ప్రశ్నించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సొంత పత్రికలో ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చినా ఆ వార్తకు ప్రాధాన్యం లభించలేదంటే హోదా గురించి జగన్‌రెడ్డి మర్చిపోయారన్న సత్యాన్ని ప్రజలు గ్రహించినట్టున్నారు. అందుకే గొంతెత్తడం లేదు. ఇక కంపెనీల కబ్జా విషయానికి వస్తే, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కాకినాడ సెజ్‌తో పాటు పోర్టును కూడా తమ ఆప్తులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు గంగవరం పోర్టును సైతం గుజరాత్‌కు చెందిన గౌతం అదానీ పరం చేశారు. మంచి లాభాలతో నడుస్తున్న గంగవరం పోర్టును అమ్ముకోవలసిన అవసరం పోర్టు యజమాని రాజుగారికి లేకపోయినా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో తలవొంచక తప్పలేదు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అదానీ వంటి వారిని కోరాల్సింది పోయి తెలుగువారు కష్టపడి నిర్మించుకున్న పోర్టులు, కంపెనీలను ఆయనకు అప్పగించడంలో ప్రభుత్వ పెద్దలు కీలక పాత్ర పోషించడం విషాదం కాదా! ముంబై ఎయిర్‌పోర్టుపై కన్నేసిన అదానీ అందులో వాటా కోసం ప్రయత్నించి, దాన్ని నిర్మించి నిర్వహిస్తున్న మన తెలుగువాడైన జి.వి.కృష్ణారెడ్డిపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. చివరకు సీబీఐ, ఈడీ కేసులను తట్టుకొనే ఓపిక లేక ముంబై ఎయిర్‌పోర్టును కృష్ణారెడ్డి వదులుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం పెద్దల సహకారంతో కృష్ణపట్నం పోర్టును అదానీ తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు గంగవరం వంతు. ఇదే ధోరణి కొనసాగితే మన తెలుగువాళ్లకు చెందిన కంపెనీలన్నీ అదానీ వంటివారి పరం కాకుండా ఉంటాయా? కంపెనీల దురాక్రమణకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతున్నారు. ఇక రాష్ట్రంలో పోలీసు శాఖను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగంగా మార్చిపడేశారు. అధికార పార్టీ నాయకులు అర్హత, అధికారం లేకపోయినా పోలీసు అధికారులను పిలిపించుకొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. కిందిస్థాయి పోలీసు అధికారులు ఇప్పుడు తమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. తమ శాఖకు చెందిన కిందిస్థాయి అధికారులు తాము పోలీసు అధికారులమన్న విషయం మర్చిపోయి నేరుస్తుల మాదిరి వ్యవహరిస్తున్నారని సీనియర్‌ పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మీ డీజీపీకి దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించగా, సంపాదించుకుంటే వచ్చే అటువంటి అవార్డులకు విలువ ఏపాటిదో మాకు తెలుసు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. పోలీసు శాఖను నేర వ్యవస్థగా మారిస్తే జరిగే అనర్థాలకు ప్రస్తుత పాలకులే బాధ్యత వహించవలసి ఉంటుందని మరో అధికారి తలపట్టుకున్నారు.


పెద్దల్నీ కొనేస్తే పోలా..!

తమ దుశ్చర్యలకు కేంద్ర పెద్దల అండదండలు ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులు గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర మంత్రులు, అధికారులకు డబ్బు ఆశజూపి లొంగదీసుకొనే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యక్తిగత వ్యవహారాల్లో మేలు చేయాలని డబ్బు ఆశ చూపడం మనకు తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా అనుకూల నిర్ణయాలు తీసుకోవడం కోసం కేంద్ర మంత్రులకు, అధికారులకు డబ్బు ఇవ్వజూపడం ఇప్పుడు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ విధంగా డబ్బు ఇవ్వజూపారట! దీంతో కంగుతిన్న ఆ మంత్రులు ‘‘ఈ నాలుగైదు కోట్ల గోలేమిటి? రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు ఇవ్వాలనుకోవడం కనీవినీ ఎరుగనిది’’ అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులో దాఖలవుతున్న కేసుల్లో ప్రతివాదులకు ప్రముఖ న్యాయవాదులు లభించకూడదన్న ఉద్దేశంతో.. ‘‘మీరు ఫలానా వారి కేసు వాదించకుండా ఉండటానికి ఎంత కావాలో చెప్పండి ఇస్తాం!’’ అని అధికార పార్టీకి చెందిన కొందరు ఢిల్లీలో సూట్‌ కేసులతో తిరుగుతున్నారని సుప్రీంకోర్టు న్యాయవాద వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి తెలిసే, ఆయన ప్రోద్బలంతోనే ఇటువంటివి జరుగుతుంటే తెలుగు జాతికే అప్రతిష్ఠ. ఇలాంటి నీతిమాలిన చర్యలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడితే ఆంధ్రప్రదేశ్‌ పరువు గంగలో కలిసినట్టే కదా! అయినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మనలాగా సున్నితంగా ఆలోచిస్తారని అనుకోలేం. ఎందుకంటే ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు విన్నవారికి ఇంత కాలానికి మనకు ఒక ఆదర్శ ముఖ్యమంత్రి లభించాడన్న భావన కలిగింది. రెండేళ్లు గడవక ముందే చాలా మందికి తత్వం బోధపడింది. అధికార దుర్వినియోగం అన్నది చాలా చిన్న పదంగా కనిపిస్తోంది. సొంత పత్రిక, చానల్‌కు వందల కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో దోచిపెట్టినట్టు సమాచార హక్కు చట్టం పుణ్యమా అని బయటపడింది. ఒకప్పుడు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాజీనామా చేయవలసి వచ్చేది. వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వడంలో అనుచితంగా వ్యవహరించారని హైకోర్టు తప్పుబట్టినందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసిందిగా నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఆదేశించారు. అంతకుముందు బస్సు రూట్ల ప్రైవేటీకరణ విషయంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకున్న నీలం సంజీవరెడ్డి కూడా నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒకప్పుడు సిమెంటు విక్రయాలపై నియంత్రణ ఉండేది. అప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఎం.బాగారెడ్డి తనకు తెలిసిన ఒకరికి పదిహేను బస్తాల సిమెంటును అనుచితంగా కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మునిసిపల్‌ మంత్రిగా పనిచేసిన కోనేరు రంగారావు హైదరాబాద్‌లో ఒక భవనానికి నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్‌ ఆమోదించారని ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నాటి కాంగ్రెస్‌ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ హైకోర్టులో కేసు వేశారు. దీన్ని విచారించిన విస్తృత ధర్మాసనం చివరకు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ తన నివాసంలో కొన్ని లీటర్ల పాలు ఎక్కువగా వాడారని తేల్చింది. ఇలాంటి సిల్లీ ఆరోపణలు మరికొన్నింటిని కూడా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయినా ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నాయకులు పట్టుబట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇదే జగన్మోహన్‌ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు అప్పనంగా రూ.700 కోట్లు దోచిపెట్టారని దుష్ప్రచారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రజ్యోతి’కి అదనంగా ఒక్క రూపాయి ఇచ్చి ఉంటే జగన్‌ రెడ్డి ఇంతకాలం మౌనంగా ఉండేవారా? ఆనాడు రూ.700 కోట్లు అని గాలి ప్రచారం చేసినవాళ్లు అది నిజమని ఇప్పుడు నిరూపించినా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను వదులుకోవడానికి నేను సిద్థం. వైసీపీ నాయకులు గానీ, వారితో గొంతు కలిపినవారు గానీ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత పత్రిక, చానల్‌కు అనుచితంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఈ 20 నెలల్లోనే దోచిపెట్టినందుకు ఏం సమాధానం చెబుతారు? ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజీనామా చేస్తారా? సర్క్యులేషన్‌ను పరిగణనలోకి తీసుకుని ‘ఆంధ్రజ్యోతి’కి ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి, అతి తక్కువ సర్క్యులేషన్‌తో నడుస్తున్న పత్రికలకు కోట్లాది రూపాయలు పంచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? తన ప్రభుత్వం న్యాయబద్ధంగా పనిచేస్తోందని జగన్‌రెడ్డి చెప్పగలరా? భారీ స్థాయిలో జరిగిన ఈ అధికార దుర్వినియోగానికి ఇవాళ కాకపోయినా రేపయినా న్యాయస్థానంలో సంజాయిషీ ఇవ్వక తప్పదు. ‘‘నేనేం చేసినా ప్రజలు నాతోనే ఉన్నారు’’ అని జగన్‌ రెడ్డి విర్రవీగుతూ ఉండవచ్చు. అందుకే 18వ శతాబ్దంలోనే శేషప్ప కవి ఇలాంటి పరిస్థితులను ఊహించి ఉంటారు. రాబర్ట్‌ క్లింట్‌ గార్డ్‌ అభిప్రాయపడినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ విషయం అలా ఉంచితే, కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణ జరిపించాలని కేరళలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించడం సంచలనమైంది. ఈ చర్యను చాలా మంది తప్పుబట్టవచ్చు గానీ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఉన్న నేపథ్యం ఏమిటో కూడా చూడాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి విచ్చలవిడిగా వాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అభిప్రాయం దేశ ప్రజల్లో ఉంది. ఇటువంటి అభిప్రాయాలు ప్రజల్లో మరింతగా బలపడకముందే నరేంద్ర మోదీ ప్రభుత్వం సందేహ నివృత్తి చేయాలి. లేని పక్షంలో దేశ ఫెడరల్‌ వ్యవస్థకే పెనుముప్పు సంభవించే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగి కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్టాలకు నమ్మకం సడలితే ఎన్టీఆర్‌ ఆ రోజుల్లో అన్నట్టుగా కేంద్రం మిథ్యగా మిగిలిపోయే ప్రమాదం రాదా?

ఆర్కే

తెలుగు ప్రతిష్ఠకు తెగులు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.