ఓ కొడుకు అమెరికాలో.. మరో కొడుకు కెనడాలో.. ఆ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే పెంపుడు కుక్క ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-09-03T14:24:32+05:30 IST

మూడేళ్లుగా తనను ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న యజమాని మరణాన్ని తట్టుకోలేక.. ఆయన అంత్యక్రియలు పూర్తయిన 24 గంటల్లోపే చనిపోయిందో కుక్క! సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన.

ఓ కొడుకు అమెరికాలో.. మరో కొడుకు కెనడాలో.. ఆ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే పెంపుడు కుక్క ఏం చేసిందంటే..

ఐదేళ్ల క్రితం భార్య మృతితో ఒంటరైన వృద్ధుడు

మూడేళ్ల క్రితం కుక్కపిల్లను ఇచ్చిన స్నేహితుడు 

నిరంతరం ఆ కుక్కపిల్లతోనే ఆయన కాలక్షేపం

గుండెపోటుతో నిద్రలోనే మరణించిన వృద్ధుడు

అంత్యక్రియలైన 24 గంటల్లో చనిపోయిన కుక్క

సూర్యాపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లుగా తనను ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న యజమాని మరణాన్ని తట్టుకోలేక.. ఆయన అంత్యక్రియలు పూర్తయిన 24 గంటల్లోపే చనిపోయిందో కుక్క! సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన. సూర్యాపేటకు చెందిన కృష్ణమూర్తి(పేరు మార్చాం)(65) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు అరవై ఏళ్ల వయసులో.. అనారోగ్యంతో ఆయన భార్య కాలం చేశారు. ఆయన పిల్లల్లో ఒకరు అమెరికాలో, మరొకరు కెనడాలో స్థిరపడ్డారు. ఫోన్‌లో అప్పుడప్పుడూ మాట్లాడడం తప్ప.. ఆయన యోగక్షేమాల గురించి వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు! భార్య చనిపోయాక వారి వద్దకు రెండుసార్లు వెళ్లొచ్చారు. ‘‘ఒక్కడివే ఏం చేస్తావు నాన్నా.. మాతో ఉండిపో’’ అని ఇద్దరిలో ఒక్కరైనా అంటారనుకున్న ఆయన ఆశ అడియాశే అయింది. దీంతో ఆ తండ్రి మనసు గాయపడి ఒంటరి జీవనానికి సిద్ధపడింది. మనవలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఆ ఒంటరి జీవితం ఆయనకు భారంగా మారింది.

ఒకప్పుడు భార్య కుమారులతో కళకళలాడిన ఇల్లు కళ తప్పడంతో మనోవేదనకు గురయ్యేవారు. అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చే స్నేహితులతో ఈ విషయాలన్నీ చెప్పి బాధపడేవారు. ఆయన ఆవేదనను గమనించిన ఒక స్నేహితుడు.. ఒక కుక్కపిల్లను కృష్ణమూర్తికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో కృష్ణమూర్తి జీవితం మలుపుతిరిగింది. ఏ తోడూ లేని ఆ పెద్దాయనకు ఆ కుక్క పిల్లే సర్వస్వం అయింది.


దానితోడిదే జీవితం..

రోజులో అధికభాగం ఆ కుక్కపిల్లతోనే ఆయనకు కాలక్షేపం అయ్యేది. క్రమక్రమంగా ఆ మూగజీవితో అనుబంధం పెరిగింది. ఆ కుక్కపిల్ల కూడా.. కృష్ణమూర్తి కనపడకుంటే బెంగపెట్టుకునేది. ఒకసారి ఆయన బంధువుల పెళ్లికి ఊరెళ్తూ.. తన కుక్కపిల్లను పక్కింటిలో ఉంచాడు. కానీ, కృష్ణమూర్తి కనపడకపోవడంతో వారు పెట్టిన అన్నం కూడా తినలేదా మూగజీవి. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణమూర్తి గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందారు. రోజూ ఉదయాన్నే నిద్రలేచే తన యజమాని లేవకపోవడంతో కుక్కపిల్ల అరవడం మొదలుపెట్టింది. ఉదయం ఆరు గంటల సమయంలో కుక్క అలా ఆపకుండా అరుస్తుండడంతో పక్కింటివారు వచ్చి చూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని కుమారులకు తెలియజేశారు. వారు వచ్చేదాకా (రెండు రోజులపాటు) ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచారు. ఆ రెండు రోజులూ కుక్కపిల్ల.. అచేతనంగా పడి ఉన్న కృష్ణమూర్తిని చూసి దిగాలుగా అరుస్తూనే ఉంది. కళ్లల్లో నీళ్లతో ఫ్రీజర్‌ చుట్టూ తచ్చాడుతూనే ఉంది.


కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. రెండురోజుల తర్వాత వచ్చిన కుమారులు ఆయనకు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆ సమయంలో శ్మశానం వరకూ వెళ్లిన కుక్క.. ఇక యజమాని తిరిగి రాడని అర్థం చేసుకుందో ఏమో ఆ తర్వాత 24 గంటల్లోపే చనిపోయింది. దాని కళేబరాన్ని కృష్ణమూర్తి కుమారులు మునిసిపాలిటీకి అప్పగించారు. కడుపున పుట్టిన కొడుకుల కన్నా.. జీవిత చరమాంకంలో ఆయన్ను నడిపించిన కుక్క ప్రేమ ఎంతో గోప్పదని.. ఇది కదా నిజమైన విశ్వాసం అని స్థానికులు దాని గురించి పదేపదే చెప్పుకొంటున్నారు.

Updated Date - 2022-09-03T14:24:32+05:30 IST