‘పేట వైసీపీలో లుకలుకలు!

ABN , First Publish Date - 2022-09-24T06:45:07+05:30 IST

పాయకరావుపేట నియోజకవర్గం అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

‘పేట వైసీపీలో లుకలుకలు!

ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు

బాబూరావు తీరుతో మనస్తాపం చెందినట్టు ఎస్‌.రాయవరం ఎంపీపీ ఆరోపణ

పదవికి రాజీనామా చేస్తూ ఎంపీడీవోకు లేఖ అందజేత

సొంతపార్టీ ప్రజాప్రతినిధులనే వేధిస్తున్నారని పార్టీ జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు ఆవేదన

ఇతర మండలాల్లోనూ పలువురు నాయకులు అసంతృప్తి

అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సీనియర్‌ నేతలు


అనకాపల్లి, సెప్టెంబరు 23: పాయకరావుపేట నియోజకవర్గం అధికార పార్టీలో లుకలుకలు  మొదలయ్యాయి. ఇప్పటి వరకు చాపకింద నీరులా సాగుతున్న వర్గపోరు ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి రాజీనామాతో బహిర్గతమైంది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను  కూడా ఇబ్బందుకు గురిచేస్తున్నారని, ఆయన తీరుతో మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఎంపీపీ భర్త, వైసీపీ జిల్లా కోశాధికారి అయిన బొలిశెట్టి గోవిందరావు మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాబూరావు గెలుపుకోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి, ఇతర పార్టీల వారికి మేలు చేస్తున్నారని విమర్శించారు. బదిలీలు, కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవంగా ఒక్క ఎస్‌.రాయవరం మండలంలోనే కాదు.. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఎమ్మెల్యే బాబూరావు తీరు కొంతమంది సీనియర్‌ నేతలకు సైతం మింగుడుపడడంలేదు. తమ కృషి కారణంగానే బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారని, కానీ తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ నాలుగు మండలాలకు చెందిన పలువురు ముఖ్యనాయకులు ఎమ్మెల్యేకి దూరంగా వుంటున్నారు. ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు, సమావేశాలకు వీరు గైర్హాజరయ్యేవారు. ఎస్‌.రాయవరం మండలానికి చెందిన బొలిశెట్టి గోవిందరావు సుమారు ఏడాది నుంచి ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి రావడంతో దిద్దుబాబు చర్యలు చేపట్టడానికి ఎమ్మెల్యేని,  ఆయనను వ్యతిరేకిస్తున్న వారిని తాడేపల్లికి పిలిపించుకుని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఎస్‌.రాయవరం మండల నాయకుడు బొలిశెట్టి గోవిందరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిమరీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాక తన మద్దతుదారులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు ప్రతిగా మరుసటి రోజు ఎమ్మెల్యే వర్గీయులు కూడా గోవిందరావుకు ఆందోళనలు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ముఖ్యనాయకులను మంత్రి అమర్‌నాథ్‌ పిలిపించుకుని సయోధ్య కుదిర్చారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కానీ పాయకరావుపేటకు చెందిన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు మినహా ఇతర నాయకులు ఎవరూ ఎమ్మెల్యేతో కలివిడిగా వుండడంలేదు.  కోటవురట్ల మండలంలో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, సీతబాబు (దత్తుడు),  నక్కపల్లి మండలంలో వీసం రామకృష్ణ, ఎస్‌.రాయవరం మండలంలో బొలిశెట్టి గోవిందరావుతోపాటు ఆయా నాయకుల అనుచరులు కూడా ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో ఎంపీపీ, అత్యధిక మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్‌ల పర్సన్‌ఇన్‌చార్జిలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి తన పదవికి రాజీనామా చేయడం, అనంతరం తన భర్త గోవిందరావుతో కలిసి విలేఖరుల సవవేశం ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యే బాబూరావుపై తీవ్ర ఆరోపణలు చేయడం వైసీపీలో కలకలం సృష్టించింది.


Updated Date - 2022-09-24T06:45:07+05:30 IST