పెట్రో దందా

ABN , First Publish Date - 2022-09-26T05:07:00+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ వ్యవహారాల్లో మాఫియా చెలరేగిపోతోంది. పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటికే లక్షల లీటర్లు తరలించినట్లు తెలిసింది

పెట్రో దందా
జిల్లా సరిహద్దులోని కర్ణాటక పెట్రోలు బంకు కళకళ

కర్ణాటక నుంచి అక్రమంగా పెట్రోలు, డీజిల్‌ రవాణా

లీటర్‌పై రూ.10 నుంచి రూ.12 తేడా

పెట్రోల్‌ అక్కడ.... బిల్లు ఇక్కడ

భారీగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా

నష్టాలతో సరిహద్దుల్లోని బంకుల మూసివేత

పన్నుల శాఖ నిఘా... సరిహద్దుల్లో తనిఖీలు 

రూ.అరకోటికి పైగా జరిమానా


 అనంతపురం క్రైం : పెట్రోల్‌, డీజిల్‌ వ్యవహారాల్లో మాఫియా చెలరేగిపోతోంది. పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటికే లక్షల లీటర్లు తరలించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గం, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాంతాల్లోనే ఈ తతంగం నడుస్తోంది. కర్ణాటకతో పోలిస్తే జిల్లాలో  పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రూ.10ల నుంచి రూ.12ల వరకు తేడా ఉంటోంది. (ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు రూ.110 నుంచి రూ.112ల వరకు ఉంటోంది. అదే కర్ణాటకలో రూ.101 నుంచి రూ.102లకే లభిస్తోంది.  రాష్ట్రంలో డీజిల్‌ 98లకు విక్రయిస్తుండగా... కర్ణాటకలో రూ.88లకే అందుబాటులో ఉంటోంది.) దీన్ని ఆసరా చేసుకుని కొందరు అక్రమార్కులు పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ను సరఫరా చేసుకుంటున్నారు. ఈ ప్రభావం సరిహద్దుల్లోని కొన్ని పెట్రోల్‌ బంకులపై తీవ్రంగా పడుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆయా ప్రాంతాల్లో కొన్ని పెట్రోల్‌ బంకులు మూతపడటం గమనార్హం. పక్క రాష్ట్రంలోని పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలతో  జిల్లాలో జీఎస్టీకి సైతం నష్టాలను చేకూర్చినట్లవుతోంది. దీంతో పన్నుల శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సరిహద్దులతో వరుస తనిఖీలు చేపట్టి ఇప్పటివరకు రూ.అరకోటి పైగా జరిమానా ఽవిధించారు.


పెట్రోలు బంకుల మూసివేత...

 జిల్లా సరిహద్దుల్లోని వాహనదారులు కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తక్కువ కావడంతో ఎక్కువగా అక్కడి బంకుల్లోనే వేయించుకుంటున్నారు. దీంతో జిల్లాలోని కొన్ని పెట్రోల్‌ బంకులు వ్యాపారం జరగక మూసివేసుకోవాల్సి వచ్చింది. మరికొన్ని పెట్రోలు బంకుల్లో కర్ణాటక పెట్రోల్‌, డీజిల్‌ అమ్ముకుంటూ లాభాలు గడిస్తు న్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో సరిహద్దుల్లోని పెట్రోల్‌ బంకులు 15 నుంచి 20వరకు మూసివేసినట్లు పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. 


అడ్డంగా దొరికిపోయారు..

కర్ణాటక నుంచి పెట్రోల్‌, డీజిల్‌ను అక్రమంగా జిల్లాలోకి తరలిస్తూ కొన్ని వాహనాలు దొరికిపోయాయి. అందులో డ్రమ్ముల నుంచి ట్యాంకర్ల వరకు ఉన్నాయి. ఈనెల 1వతేదీ కొడికొండ చెక్‌పోస్టులో రెండు వాహనాలు పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. వాటిలోని డ్రమ్ముల్లో కర్ణాటకు నుంచి డీజిల్‌, పెట్రోల్‌ను తరలిస్తున్నట్లు నిర్ధారించారు. 2వతేదీ అదే చెక్‌పోస్టులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న రెండు వాహనాలు పట్టుబడ్డాయి. ఈనెల 5వతేదీ అదే చెక్‌పోస్టులో రెండు పెద్ద ట్యాంకర్లు పట్టుబడ్డాయి. ఈనెల 9వతేదీ గుంతకల్లులో రెండు వాహనాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీజ్‌ చేశారు. మరో రెండు సందర్భాల్లో హిందూపురం, చిలమత్తూరులో పెట్రోల్‌, డీజిల్‌ తరలిస్తూ దొరికిపోయారు. 


ట్యాంకర్లు, డ్రమ్ముల ద్వారా తరలింపు

ఒక్కో లీటర్‌పై రూ.10లపైగా ఆదాయం ఉంటుండ టంతో కొందరి కన్ను పెట్రోల్‌, డీజిల్‌పై పడినట్లు తెలుస్తోంది. ఇందుకు కొందరు పెట్రోల్‌ బంకుల యజ మానులే పూనుకున్నట్లు సమాచారం. పెద్ద ఆయిల్‌ ట్యాంకర్లలో ఒక్కో వాహనంలో 12 వేల నుంచి 13వేల లీటర్లు పడుతుంది. కేవలం కొన్ని కిలోమీటర్ల ప్రయాణం జరిపి రూ.లక్షల్లో అక్రమంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పెట్రోల్‌ బంకు నిర్వాహకులందరూ ఇదే తరహాలో వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. ఇక అదే తరహాలోనే దారి పక్కనే దుకాణాలు పెట్టుకుని పెట్రోల్‌, డీజిల్‌ అమ్మేవారు ఈ అక్రమ రవాణాకు పాల్పడుతు న్నట్లు తెలిసింది. అందులో వీరు పెట్రోల్‌కు అదనంగా రసాయనాలు కలిపి సాధారణ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. వీరంతా డ్రమ్ముల్లో పెట్రోల్‌, డీజిల్‌ను నిల్వ ఉంచుకుని అమ్ముతున్నారు.  


పెట్రోల్‌ అక్కడ... బిల్లు ఇక్కడ

పన్నుల శాఖ అధికారులు డీజిల్‌, పెట్రోల్‌ అక్రమ రవాణాపై నిఘా ఉంచే పనిలో పడ్డారు. కర్ణాటక పరిధిలోని పెట్రోల్‌ బంకుల్లో నుంచి తరలించిన వాటికి రాష్ట్ర పరిధిలోని పెట్రోల్‌ బంకుల నుంచి బిల్లులు వేయించుకుంటున్నట్లు సమాచారం. అధికారుల తనిఖీల్లో ఆ విషయం స్పష్టంగా తేలిపోయింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేయడంతో వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధించారు. డ్రమ్ముల్లో పెట్రోల్‌, డీజిల్‌ తరలిస్తుండగా రూ.60వేలు జరిమానా విధించారు. ఎక్కువ లీటర్లలో తరలిస్తున్న వాహనాలకు రూ.3లక్షలు జరిమానా వేశారు. రెండు ఆయిల్‌ ట్యాంకర్లకు రూ.32లక్షలు జరిమానా విధించారు. మరికొన్నింటికి జరిమానా విధించాల్సి ఉందని అధికారవర్గాల లెక్కలు చెబుతున్నాయి. గత మూడు వారాల నుంచి రూ.65లక్షల జరిమానా విధించగా... వారి నుంచి రూ.43లక్షలు వసూలు చేశారు. రూ.22లక్షలు చెల్లించాల్సి ఉంది. 

Updated Date - 2022-09-26T05:07:00+05:30 IST