పెట్రో మంటలు

ABN , First Publish Date - 2022-05-23T08:07:19+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి.

పెట్రో మంటలు

ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ మాటల యుద్ధం


మభ్యపెట్టొద్దు.. ధరలను కట్టడిచేయండి: రాహుల్‌ 

అభివృద్ధి, సంక్షేమంపై భారీగా ఖర్చుపెట్టాం

కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ, మే 22: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. పన్నుల తగ్గింపు పేరుతో ప్రజలను మభ్యపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. నిత్యావసరాల ధరలను తగ్గించి ప్రజలకు నిజమైన ఉపశమనం కల్పించాలన్నారు. కేంద్రం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం రాహుల్‌ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేయడం ఆపాలని వ్యాఖ్యానించారు. 2020 మే నెలలో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ప్రస్తుతం ఉన్న ధరలను కాంగ్రెస్‌ నేత పోల్చారు. ‘‘పెట్రోల్‌ ధర 2020 మే 1న రూ.69.50 ఉంటే... ప్రస్తుతం రూ.96.70గా ఉంది. ఇక నుంచి మళ్లీ రోజూ 80పైసలు, 30పైసలు చొప్పున ఇంధనం ధరలు పెరుగుతూ పోతాయి’’ అని వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మాట్లాడుతూ... కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం వల్ల ఆచరణలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ పన్ను 2014లో రూ.9.48 ఉండగా, ప్రస్తుతం రూ.19.9 ఉందన్నారు. ‘‘కేంద్ర నిర్ణయంతో ధరలు 2022 మార్చి  స్థాయికి చేరాయి. ఇంకా పన్నులు ఎక్కువగానే ఉన్నాయి. 2014 స్థాయికి చేరితేనే ప్రజలకు నిజంగా ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ధరల విషయంలో మూడడుగులు ముందుకేసి, రెండడుగులు వెనక్కి వేయడం వల్ల ప్రజల జీవితాలు మెరుగుపడవన్నారు. కాగా... కాంగ్రెస్‌ విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తిప్పికొట్టారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వం చాలా ఎక్కువ కేటాయింపులు చేసిందని వివరించారు. గడచిన ఎనిమిదేళ్లలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలపై రూ.90.9లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. యూపీఏ పాలించిన పదేళ్ల (2004-14) కాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.49.2లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ఇవన్నీ ఆర్‌బీఐ చెబుతున్న గణాంకాలేనని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ప్రస్తుత ధరలను పరోక్షంగా సమర్థించుకున్నారు. కాగా... ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాలో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్‌కు పన్నుల కోత వర్తిస్తుందన్నారు. ఈ సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కాబట్టి... ఆ మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.


వ్యాట్‌ను తగ్గిస్తున్న రాష్ట్రాలు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన పిలుపునకు రాష్ట్రాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు త్వరగా స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటున్నాయి. కొంతమేరకు వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. శనివారం కేంద్ర నిర్ణయం వెలువడిన వెంటనే... కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాజస్థాన్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 మేర వ్యాట్‌ను తగ్గిస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.10.48, డీజిల్‌ ధర రూ.7.16 తగ్గింది. అలాగే మహారాష్ట్రలో... పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు శివసేన నాయకత్వంలోని సర్కార్‌ ప్రకటించింది. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందిస్తూ... రాష్ట్ర పన్నుల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వ్యాట్‌ను తగ్గించబోమని గోవా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తమకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.97వేల కోట్ల బకాయిలను చెల్లిస్తే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ మాట్లాడుతూ... పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించకుండా, ఇప్పుడు మాత్రం రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలనడం సరికాదన్నారు. ఫెడరలిజం అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి 2021 వరకు కేంద్రం ఇంధన ధరలను విపరీతంగా పెంచిందన్నారు. కేంద్రం పెంచిన దాంట్లో 50శాతం మాత్రమే ఇప్పుడు తగ్గించిందని, ఇంకా పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, సర్‌చార్జీలను కేంద్రం పెంచి... వాటా ఇవ్వాల్సిన ఎక్సైజ్‌ సుంకాన్ని మాత్రం తగ్గించిందని త్యాగరాజన్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-23T08:07:19+05:30 IST