పెట్రో.. చార్జ్‌!

Published: Mon, 28 Mar 2022 01:01:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెట్రో.. చార్జ్‌!

ప్రతిరోజూ ధరల వడ్డన

ఎన్నికలు ముగియటంతో మళ్లీ బాదుడు 

పెట్రోల్‌ పై రూ.4.05, డీజిల్‌పై రూ.3.92 వడ్డన

బల్క్‌ వినియోగదారులకూ భారాలే

ఐదు రోజులుగా పెరుగుతున్న ధరలు 

ఆయిల్‌ కంపెనీల లాభాల కోసమే


పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు కళ్లెం వేసినట్టు కొద్దిరోజులు ప్రజలను నమ్మించిందికేంద్ర ప్రభుత్వం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. మళ్లీ భారాలు యథాతథంగా మొదలయ్యాయి. ఐదు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నాయి. నిన్నటి ధర రేపటికి కొనసాగటం లేదు. పైపైకి దూసుకుపోతున్న ధరలను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఆల్‌టైమ్‌ ధరాఘాతాన్ని చూస్తామేమోనన్న ఆందోళన వాహన యజమానుల్లో కనిపిస్తోంది. 


(ఆంద్రజ్యోతి, విజయవాడ) : ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరల విషయంలో ప్రజలను మభ్యపెట్టిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ జూలు విదిల్చింది. ఇప్పట్లో దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు కాబట్టి ధరలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గేట్లు ఎత్తివేసింది. ఈ నెల 22వ తేదీన పెట్రోల్‌, 23న డీజిల్‌ ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై భారాలు వేయడం మళ్లీ మొదలయింది. బల్క్‌ వినియోగదారులకు రాయితీ ఎత్తివేయటంతో పాటు అదనపు భారాలు మోపడంతో పెట్రోల్‌, డీజిల్‌ చార్జీల వడ్డన తప్పదని స్పష్టమయింది. జిల్లాలో ఆర్టీసీ, రైల్వే బల్క్‌ వినియోగదారులుగా ఉన్నాయి. ఈ రెండు సంస్థలపై అదనపు వడ్డన వేయటంతో.. బల్క్‌గా కొనటం మానేసి సాధారణ పెట్రోల్‌ బంకుల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. గడిచిన ఐదు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.4.05 పెరగ్గా, డీజిల్‌ ధర రూ.3.92 పెరిగింది.


నష్టాన్ని భర్తీ చేసుకునే దిశగా ..

ప్రస్తుతం ఆయిల్‌ కంపెనీలు లీటర్‌ ఆయిల్‌కు రూ.25 మేర నష్టాల్లో ఉన్నాయని తెలుస్తోంది. కంపెనీలు ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే వరకూ ధరలు పెరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. బ్రేక్‌ ఈవెన్స్‌ సాధించటమే కాకుండా లాభాల కోసం అవసరమైన మార్జిన్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని మరింతగా డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. డీజిల్‌ రూ.150, పెట్రోల్‌ రూ.200 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదని పెట్రోల్‌, డీజిల్‌ బంకుల నిర్వాహకులే అంటున్నారు. 


బంకులకు క్రెడిట్‌ సేల్స్‌ నిలిపివేత

ఆయిల్‌ కంపెనీలు నష్టాల భర్తీ పేరుతో జిల్లావ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ బంకులకు ఝలక్‌ ఇచ్చాయి. కొండపల్లిలోని ఆయిల్‌ కంపెనీలు ఇంతకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ బంకులకు క్రెడిట్‌ ప్రాతిపదికన ఆయిల్‌ను సరఫరా చేసేవి. ప్రస్తుతం ఆ విధానాన్ని ఎత్తివేశాయి. నష్ట నివారణ కోసమే క్రెడిట్‌ విధానాన్ని ఎత్తివేసినట్టు చెబుతున్నారు. 


మధ్యతరగతి వర్గం విలవిల  

ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న మధ్య తరగతి వర్గానికి పెట్రోల్‌ ధరల పెంపుతో నడ్డి విరిగినంత పనవుతోంది. ద్వి చక్ర వాహనం దైనందిన అవసరమైంది. దీంతో పెట్రోల్‌ ధరల భారాన్ని భరించక తప్పని పరిస్థితి వచ్చేసింది. డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం కూడా పరోక్షంగా ప్రజలపై పడుతోంది. రవాణా రంగం ఈ భారాల నుంచి బయటపడేందుకు చార్జీలు పెంచుతుంది. దీని ప్రభావం ప్రజలపై పడుతుంది. దీనికి తోడు అన్ని రకాల ఉత్పత్తులూ ప్రియమవుతాయి. 

పెట్రో.. చార్జ్‌!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.