పెట్రో పాపాలు

ABN , First Publish Date - 2022-04-28T09:48:50+05:30 IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ రాజకీయసభలాగా మార్చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి...

పెట్రో పాపాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ రాజకీయసభలాగా మార్చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం నాటి ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన కరోనా నియంత్రణకు సంబంధించిన చర్యలకంటే, పెట్రోల్ డీజిల్ పన్నుల గురించి ఎక్కువ మాట్లాడి, విపక్షపాలిత రాష్ట్రాలమీద నిందలేశారన్నది ఆరోపణ. సీఎంల స్థాయి సమావేశం జరుగుతున్నప్పుడు నిర్దేశించుకున్న అంశానికే కట్టుబడాలి కదా అని వాళ్ళు అంటున్నారు. ఎప్పుడో కానీ జరగని ఆ స్థాయి సమావేశాల్లో ప్రజాశ్రేయస్సుతో ముడిపడిన అన్ని అంశాలూ ప్రస్తావించవచ్చునని వీళ్ళు అంటున్నారు. 


కేంద్రప్రభుత్వం గత ఏడాది నవంబరులో పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజాశ్రేయస్సుకు ఎంతో పాటుపడితే, కొన్ని రాష్ట్రాలు దానిని ప్రజలకు చేరనివ్వకుండా చమురుధరలను భారంగా మార్చేశాయన్నది ప్రధాని ఆరోపణ. ఈ అన్యాయాన్ని తక్షణం సరిదిద్దండి, దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతగానో అవసరపడిన సంక్షుభితకాలం ఇది అంటూ ఉక్రెయిన్ యుద్ధాన్ని గుర్తుచేశారు ప్రధాని. తాము ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పాటు రాష్ట్రాలను కూడా ఆ మేరకు భారాన్ని తగ్గించమని విజ్ఞప్తి చేశామనీ, కొన్ని రాష్ట్రాలు ఆ పనిచేశాయనీ, మరికొన్ని ఆ లబ్ధిని ప్రజలకు చేర్చలేదని అన్నారాయన. బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రజలకు మేలు చేయడానికి ఎంతో ఆదాయాన్ని కోల్పోతే, విపక్షాల ఏలుబడిలో ఉన్న పొరుగురాష్ట్రాలు వ్యాట్ తగ్గించకుండా తమ ప్రజలతో పాటు ఈ రాష్ట్రాలకూ ద్రోహం చేశాయన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. నేను ఎవరినీ విమర్శించడం లేదు అంటూనే ఆయా రాష్ట్రాల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించడం, అక్కడ పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయో ప్రత్యేకంగా చదివి వినిపించడం ద్వారా బీజేపీయేతర పార్టీలను బోనులో నిలబెట్టే  ప్రయత్నం చేశారాయన. ఉత్తరాఖండ్ నూ మహారాష్ట్రనూ పోల్చారు. గత ఆర్నెల్లలో ఈ విపక్ష రాష్ట్రాలు ఎంత సంపాదించాయన్న చర్చలోకి తాను పోవడం లేదని అంటూనే, పన్నులు తగ్గించకుంటే ఈ ఆర్నెల్లలో కర్ణాటక ఐదువేలకోట్లు, గుజరాత్  నాలుగువేలకోట్లు సంపాదించుకోగలిగేవని ఉదాహరణగా వ్యాఖ్యానించడం ద్వారా ఎంతో తెలివిగా ప్రజలకు తాను చెప్పదల్చుకున్నది చేరవేయగలిగారు ఆయన. 


ఈ తరహా సమావేశాల్లో ఆయన చెప్పింది వినడమే తప్ప, మేం మాట్లాడటానికి ఉండదు అని గతంలో ఓ ముఖ్యమంత్రి ఆరోపించినట్టుగానే, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశం అనంతరం విలేకరుల భేటీ పెట్టిమరీ కడుపులో ఉన్న ఆగ్రహాన్నంతా కక్కేశారు. దాదాపు అన్ని విపక్ష పాలితరాష్ట్రాలూ తమకు వీలైన లెక్కలతో మోదీ మీద మండిపడ్డాయి. పెట్రోల్ డీజిల్ అధికధరలకు రాష్ట్రాల ధనదాహం కారణమన్నది శుద్ధ అబద్ధమంటూ ఎవరివాటా ఎంతో లెక్కలు విప్పాయి. మోదీ ఏలుబడిలో కేంద్రం పాతికలక్షకోట్లు చమురుమీద సంపాదించిందనీ, రాష్ట్రాలకు రూపాయి ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ అధికారంలోకి రాగానే రిటైల్ చమురు ధరను నేరుగా గ్లోబల్ రేట్లతో ముడిపెట్టి, అక్కడ పెరగ్గానే ఇక్కడా పెంచేస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గినప్పుడు మాత్రమే ఆ మేరకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఖజానా నింపుకోవడం తెలిసిందే. 


గత ఏడాది చివరినాటికి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి, ప్రజలు హాహాకారాలు చేస్తూ, విపక్షాలు ఆందోళనలకు దిగిన తరువాత దీపావళి కానుక అంటూ మోదీ ప్రభుత్వం ఓ ఐదూ, పదీ తగ్గింపు ప్రకటించింది. మీరూ ఇలాగే చేయండని రాష్ట్రాలకు ఎంతో తెలివిగా ఆయన చేసిన విజ్ఞప్తికి, ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినమాట నిజం. ఆయన కటాక్షించిన ఈ నామమాత్రపు తగ్గింపు తరువాత కూడా ఎక్సైజ్ సుంకం అత్యధికమే. ఇక, ఆ సంతోషం కూడా ఎక్కువకాలం నిలవలేదు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఉగ్గబట్టుకొని ఉన్న ఆయిల్ కంపెనీలు ఆ తరువాత రోజువారీ వాతలు ఆరంభించాయి. రష్యా చవుక చమురు ఉన్నా, ఉక్రెయిన్ యుద్ధం కారణం చూపుతూ పెట్రోధరలు గతాన్ని కూడా దాటిపోయాయి. తీవ్ర ద్రవ్యోల్బణం, అధికధరల నేపథ్యంలో నెపాన్ని రాష్ట్రాలమీదకు నెట్టేయడమే లక్ష్యంగా మోదీ ఈ పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయన్న వాదనకు ఇప్పటికైనా స్వస్తిచెప్పి, పెట్రోల్, డీజిల్, ఎల్ పీజీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి, దేశవ్యాప్తంగా ఒకేధర అమలయ్యేట్టు చేసినప్పుడు మాత్రమే మోదీ మాటలను ప్రజలు విశ్వసిస్తారు.

Updated Date - 2022-04-28T09:48:50+05:30 IST