జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ?

ABN , First Publish Date - 2021-03-01T22:23:46+05:30 IST

ఆకాశాన్నంటుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు... జీఎస్టీ పరిధిలోకి వస్తే తగ్గుతాయని వ్యాపారవర్గాలు చెబుతోన్న విషయం తెలిసిందే. వాస్తవానికి... కేంద్ర ప్రభుత్వం వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నప్పటికీ పలు రాష్ట్రాలు సుముఖంగా లేవు.

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ?

న్యూఢిల్లీ : ఆకాశాన్నంటుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు... జీఎస్టీ పరిధిలోకి వస్తే తగ్గుతాయని వ్యాపారవర్గాలు చెబుతోన్న విషయం తెలిసిందే. వాస్తవానికి... కేంద్ర ప్రభుత్వం వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నప్పటికీ పలు రాష్ట్రాలు సుముఖంగా లేవు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశముందనే వాదనల నేపధ్యంలో కేవీ సుబ్రమణియన్ ఈ అంశంపై స్పందించారు. పెట్రో  ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రతిపాదనకు మద్ధతిస్తున్నట్లు వెల్లడించారు. కాగా... జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదనేనని, అయితే... ఇందుకు సంబంధించిన  నిర్ణయాధికారం మాత్రం జీఎస్టీ కౌన్సిల్‌దేనని ఫిక్కీ ఎఫ్ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికంగానే ఉన్నాయన్నారు.


కాగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూండడం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి... డీజిల్ ధరలు పెరిగినపక్షంలో... నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఇది ప్రజలకు భారం, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం.


పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం...

పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధర గత రెండు నెలల కాలంలో రూ. 200 కు పైగా పెరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఫిబ్రవరి నెలలోనే మూడుసార్లు పెరిగింది. ఒక్క నెలలోనే రూ. 100 పెరిగడం గమనార్హం. పెరిగిన డీజిల్ ధరల నేపధ్యంలో పాల ధరలు కూడా పలు ప్రాంతాల్లో పెరుగుతూ వస్తున్నాయి. 

Updated Date - 2021-03-01T22:23:46+05:30 IST