పీఏసీఎస్‌ల చేతికి పెట్రోలు బంక్‌లు!

ABN , First Publish Date - 2022-07-05T07:34:57+05:30 IST

దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎ్‌సల)కు వాటి విధులతోపాటు మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పీఏసీఎస్‌ల చేతికి పెట్రోలు బంక్‌లు!

రేషన్‌ షాపుల ఏర్పాటు, ఆస్పత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి

డెయిరీ, చేపల పెంపకంకూడా అప్పగించనున్న కేంద్రం

ముసాయిదా రూపకల్పన.. ఈ నెల 19న రాష్ట్రాల వద్దకు

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో సహకార వ్యవస్థ కీలకం: అమిత్‌షా


న్యూఢిల్లీ, జూలై 4: దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎ్‌సల)కు వాటి విధులతోపాటు మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోలు ఉత్పత్తుల డీలర్‌షిప్‌, రేషన్‌ దుకాణాల నిర్వహణతోపాటు ఆస్పత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి వంటి పనులను అప్పగించనుంది. ఈ మేరకు కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ‘పీఏసీఎ్‌సల మోడల్‌ బైలాస్‌’ ముసాయిదాను రూపొందించింది. సహకార వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున దీనిపై సలహాలు స్వీకరించేందుకు ముసాయిదాను ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనుంది.


కొత్త ముసాయిదా ప్రకారం పీఏసీఎ్‌సలు బ్యాంక్‌ మిత్రలుగా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎ్‌ససీ)లుగా పనిచేయడంతో పాటు కోల్డ్‌ స్టోరేజి, గోదాముల సౌకర్యం, రేషన్‌ దుకాణాల ఏర్పాటు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం వంటి కార్యకలాపాలను నిర్వహించే వీలుంటుంది. ఇందుకోసం పీఏసీఎ్‌సలు ఆయా సంఘాల్లోని సభ్యులకు రుణాలిచ్చే అధికారాన్ని ముసాయిదాలో పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ 100వ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో 8.5 లక్షల సహకార సంఘాలు ఉన్నాయని, 12 కోట్ల మందికి పైగా ఈ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రూ.2516 కోట్లతో దేశంలోని 63 వేల పీఏసీఎ్‌సల నిర్వహణను కంప్యూటరైజ్‌ చేస్తామన్నారు. 2025కల్లా పీఏసీఎ్‌సలను 3 లక్షలకు పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-05T07:34:57+05:30 IST