పెట్రోల్‌ కోసం చక్కర్లు!

ABN , First Publish Date - 2022-05-28T09:24:10+05:30 IST

హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): మీకు దగ్గర్లోనే పెట్రోల్‌ బంక్‌ ఉంది కదా? అని ఆనందిచొద్దు.. దారిలోనే బంక్‌ ఉంది కదా? అని సంబర పడొద్దు..! బండిలో కాస్తకూస్తో

పెట్రోల్‌ కోసం చక్కర్లు!

-రాష్ట్రంలోని 15 శాతం బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు..

-ఎక్కడ.. ఎప్పుడు.. నిల్వలు ఉంటాయో తెలియదు

-ఆయిల్‌ కంపెనీలు ఉద్దెర బంద్‌ చేయడంతోనే ఈ పరిస్థితి!

-ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో రూ.100 కోట్లు నష్టం!

-మొత్తాన్ని కేంద్రం తిరిగివ్వాల్సిందే

-స్పందించకుంటే బందే: డీలర్లు

హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): మీకు దగ్గర్లోనే పెట్రోల్‌ బంక్‌ ఉంది కదా? అని ఆనందిచొద్దు.. దారిలోనే బంక్‌ ఉంది కదా? అని సంబర పడొద్దు..! బండిలో కాస్తకూస్తో ఇంధనం ఉంది కదా ఇబ్బంది లేదు అని అనుకోవద్దు...! ఏ రోజు ఏ బంకులో పెట్రోల్‌/డీజిల్‌ అయిపోతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు ‘నో స్టాక్‌’ బోర్డు పెడతారో చెప్పలేం. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. చోదకులను అంతలా ‘నో స్టాక్‌’ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. వెరసి వారు బంకుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఇంధన కంపెనీలు.. బంకుల డీలర్లకు ఉద్దెర (క్రెడిట్‌) పద్ధతి నిలిపివేయడంతో ఈ పరిస్థితి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో.. ముందస్తుగా చెల్లింపులు చేయలేని డీలర్లు పంపులకు నో స్టాక్‌ బోర్డులు తగిలించేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,400 పెట్రోల్‌/డీజిల్‌ బంకులున్నాయి. మొత్తమ్మీద 15 శాతం (510) బంకులు నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నాయి. అయితే, ఇది రోజూ కాదు. డబ్బు కట్టి నిల్వ తెచ్చుకున్నపుడు అమ్మకాలు సాగిస్తున్నాయి. వీలుకానప్పుడు మూసేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో రూ.100 కోట్లు నష్టపోయామని డీలర్లు వాపోతున్నారు. దీనిని పూడ్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న డిపోల నుంచి ఇంధనం కొనబోమని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌ (టీపీడీఏ) ప్రకటించింది. కేంద్రం దిగిరాకపోతే బంకులనూ బంద్‌ చేస్తామని చెబుతోంది.

ధర తగ్గిందన్న ఆనందం దక్కడం లేదు..

పెట్టుబడి పెట్టి సరుకు కొనుగోలు చేయలేక కొందరు, ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో రాష్ట్రంలోని అందరు డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇంధన కంపెనీలు.. మార్చి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుకు ముందస్తు చెల్లింపును అమలు చేస్తున్నాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌.. ఉద్దెరను నిలిపివేయగా ఐవోసీ 5 రోజుల గడువిస్తోంది. కాగా, ఉద్దెర సమయంలో డీలర్ల నుంచి కంపెనీలు 18 శాతం వడ్డీ వసూలు చేశాయి. అయితే అసలు, వడ్డీ పేరుకుపోవడంతో దానికి స్వస్తి చెప్పాయి. బకాయిలను వసూలు చేశాయి. దీంతో డీలర్లు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. బంకుల నిర్వహణ గాడి తప్పింది. ఆ ప్రభావం వినియోగదారులపై పడి.. రూ.10 ధర తగ్గిందన్న ఆనందం దక్కడం లేదు. కాగా, మార్చిలో 30 నుంచి 40 శాతం బంకులు నో స్టాక్‌ బోర్డులు పెట్టాయని, ఇప్పుడు 15 శాతానికి తగ్గిందని టీపీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

డీలర్లకు పుండు మీద కారంలా..

ముందస్తు చెల్లింపులు చేయలేక తిప్పలు పడుతున్న డీలర్లకు.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడం పుండు మీద కారంలా మారింది. కంపెనీల నుంచి తాము పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసినప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లించామని, రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం డ్యూటీ తగ్గించటంతో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని డీలర్లు వాపోతున్నారు. ఎక్సైజ్‌ డ్యూటీ లీటరుకు రూ.10 తగ్గించే సమయానికి ఒక బంకులో 20 వేల లీటర్ల డీజిల్‌, 20 వేల లీటర్ల పెట్రోల్‌ నిల్వ ఉంటే.. ఆ 40 వేల లీటర్లను తగ్గింపు ధరకే అమ్మాలి. దీంతో డీలరుకు రూ.4 లక్షల నష్టం వచ్చింది. పైగా వారాంతంలో నిల్వలు అధికంగా ఉన్న సమయంలో డ్యూటీ తగ్గించటంతో భారీగా నష్టపోయారు. పైగా పెట్రోల్‌కు లీటరుకు రూ.3, డీజిల్‌కు రూ.2 చొప్పున ఇస్తున్న కమీషన్‌ను ఐదేళ్ల నుంచి పెంచలేదు. ఇలాకాకుండా పర్సంటేజీ రూపంలో చెల్లించాలని కోరుతున్నారు. 

ప్రజల ఇబ్బందులు పట్టని ఇంధన కంపెనీలు

ప్రభుత్వ రంగంలోని ఇంధన కంపెనీలు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ ప్రజల ఇబ్బందులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు నెలన్నరగా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటినుంచి స్పందన కొరవడింది. మార్కెట్‌ ఏకఛత్రాధిపత్యాన్ని చూసుకుని.. తమకుఎదురేలేదనట్లు వ్యవహరిస్తున్నాయి. మార్కెట్‌ను గుప్పిట పెట్టుకొని.. వినియోగదారుల ఇక్క ట్లను పట్టించుకోని కంపెనీల తీరుపై తీవ్ర చర్చ సాగుతోంది.

నష్టాన్ని కేంద్రం భరించాల్సిందే

కేంద్ర ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలకు డబ్బులు చెల్లించే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేశాం. ఒక్కసారిగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో డీలర్లు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలు భరించాలి. ఆ డిమాండ్‌తోనే ఈ నెల 31న కొనుగోళ్లు నిలిపివేస్తున్నాం.  ప్రభుత్వం దిగిరాకపోతే పెట్రోల్‌ బంకులు కూడా బంద్‌ చేసి ఆందోళనలు చేపడతాం. డీజిల్‌, పెట్రోలు అమ్మకాలను జీఎస్టీలోకి తేవాలి.

-ఎల్‌వీ కుమార్‌, టీపీడీఏ కోశాధికారి

Updated Date - 2022-05-28T09:24:10+05:30 IST