పెట్రోల్‌ ఎట్‌ రూ. 100.66

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

పెట్రోల్‌ ఎట్‌ రూ. 100.66

పెట్రోల్‌ ఎట్‌ రూ. 100.66

వాహనదారులపై నెలకు రూ.7.14 కోట్ల ఆర్థికభారం

పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం

డీజిల్‌ ధరలు పెరగడంతో వ్యవసాయంపై భారం


మహబూబాబాద్‌ టౌన్‌,  జూన్‌ 16 : జిల్లా పెట్రోల్‌ ధర సెంచరీకి చేరుకుంది. తాజాగా బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.66 ధర పలికింది. పెట్రోల్‌ ధరల చరిత్రలో ఇదే ప్రప్రథమని చెప్పవచ్చు. పెట్రోల్‌ ధరల పెరుగుదలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈనెల 13న పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100.16 పైసలుండగా, మంగళవారం 24 పైసలు పెరిగి రూ.100.40కు చేరుకుంది. డీజిల్‌ ధర రూ.95.08 పైసలుండగా 23 పైసలు పెరిగి రూ.95.31 పైసలకు చేరుకుంది. 


తాజాగా బుధవారం లీటర్‌ పెట్రోల్‌ 26 పైసలు పెరగడంతో రూ.100.66, డిజీల్‌ ధర 14 పైసలు పెరగడంతో రూ.95.45కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పెరగడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని బంక్‌ వ్యాపారులు చెబుతున్నారు. పెట్రోల్‌, డిజీల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆటోలు, కార్లు నడిపే వారు పెరిగిన ధరలతో తాము ఎలా ట్యాక్సీలు నడిపేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై గ్రామాలకు వెళ్లి వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు పెట్రోల్‌ ధరల పెంపుతో తమపై ఆర్థికభారం పడుతోందని వాపోతున్నారు. 


వాహనదారులపై నెలకు రూ.7.14 కోట్ల భారం...

జిల్లాలో వాహనదారులపై నెల రోజుల్లో  రూ.7.14 కోట్ల భారం పడుతోంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాల పరిధిలో 57 పెట్రోల్‌ బంక్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు అన్ని బంక్‌ల్లో కలిపి దాదాపుగా పెట్రోల్‌ 70 వేల లీటర్లు, లక్ష లీటర్ల డీజిల్‌ వరకు విక్రయిస్తున్నారు. నెలలో అనేక మార్లు పెరిగిన ధరలతో సరాసరిగా పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు వాహనదారులపై  యావరేజ్‌గా రూ.14 అదనంగా ఆర్థిక భారం పడుతోం ది. అంటే ఒక్క రోజులో పెట్రోల్‌ కొనుగోలు చేసిన వాహనదారులపై రూ.9.80 లక్షలు పడుతోంది. నెలకు రూ.2.94 కోట్లు, అదే విధంగా డీజిల్‌ కొనుగోళ్లతో వాహనదారులపై రోజుకు 14 లక్షల భారం పడగా నెలకు రూ. 4.20 కోట్లు భారం పడుతోంది. వెరసీ నెలకు పెట్రోల్‌, డీజిల్‌ వాహనదారులపై రూ.7.14 కోట్ల భారం పడుతోంది. దీంతో వాహనదారుల జేబుకు చిల్లిపడుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపనుంది. దీంతో పరోక్షంగా పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. 


ధరల పెరుగుదలపై వాహనదారుల ఆగ్రహం..

పెట్రోల్‌ ధరల పెంపు తారస్థాయికి చేరుకుని లీటర్‌ రూ.100 దాటడంతో మహబూబాబాద్‌ జిల్లాలో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.100కు లీటర్‌ పెట్రోల్‌ పోస్తే 50 నుంచి 60 కిలో మీటర్లు మాత్రమే వస్తుందని అంటే  కిలోమీటరుకు రూ.2 పడుతుందని ఇలా అయితే మధ్యతరగతి  ప్రజలు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు వాహనాలు నడిపేదేలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క కరోనాతో పనులు లేక ఆర్థిక వనరులు దెబ్బతింటూంటే మరో పక్క పెట్రో ల్‌ ధరలు పెరిగి భారం పడడడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా ఉందని వాపోతున్నారు. ఇక డీజిల్‌ ధరలు పెరగడంతో పరోక్షంగా వ్యవసాయంపై భారం పడనుందని రైతులు చెబుతున్నారు. డీజిల్‌ ధర సైతం పెరగడంతో వ్యవసాయ సాగు, పండిన పంటలను ఇంటికి, మార్కెట్లకు చేర్చేందుకు ఉపయోగించే ట్రాక్టర్‌ రవాణా చార్జీలు పెరిగి ఆర్థిక ప్రభావం చూపనుంది.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించి తమను ఆర్థిక భారం నుంచి గట్టెక్కించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


పెట్రోల్‌ ధరల పెంపుతో భారం : రత్నం అశోక్‌, వాహానదారుడు, అమనగల్‌ 

పెట్రోల్‌ ధరలు రోజురోజుకు పెరగడంతో వాహానదారులపై ఆర్థికభారం పడుతోంది. లీటర్‌ ధర రూ.100కు పైగా పలకడంతో లీటర్‌ కేవలం 50 నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రానికి వాహనంపై వస్తే బస్సు చార్జీల కంటే అధిక మోత పడనుంది. తక్షణమే పెట్రోల్‌ ధరలు తగ్గించి ఆదుకోవాలి.


కిరాయిలు రావడం లేదు.. : బూర్ల రమేష్‌గౌడ్‌, ట్యాక్సీ యాజమాని, అనంతారం 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తారస్థాయికి చేర డంతో కారు కిరాయిలు నడపలేకపోతున్నాం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పటికి కారు ట్యాక్సి ధరలు మాత్రం అంతే ఉన్నాయి. అస లే కరోనాతో కిరాయిలు దొరకడం లేదు. మరో పక్క పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో కిరాయిలు దొరికిన ఫలితం ఉండడం లేదు. దీంతో కుటుంబాల పోషణ కూడా ఇబ్బందిగా ఉంది. ఫైనాన్స్‌ వారికి కిస్తీలు కట్టలేకపోతున్నాం. 

Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST