పీఎఫ్‌ కోసం ప్రదక్షిణలు

Published: Fri, 12 Aug 2022 01:09:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పీఎఫ్‌ కోసం ప్రదక్షిణలు

గత ఏడాది ఆగస్టు నుంచి చెల్లింపులు నిలిపివేత

454 మంది వరకూ దరఖాస్తు

బకాయిలు రూ.45 కోట్ల పైమాటే...

కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమే లేదు

సీఎంఎఫ్‌ఎస్‌లో అప్‌లోడ్‌కు యత్నిస్తే ‘నో బడ్జెట్‌’ అని చూపుతున్న వైనం

తొమ్మిది నెలలుగా ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు కూడా లేవు

ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న ఉపాధ్యాయులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తమ అవసరాలకు ఉపయోగపడుతుందని ఏళ్ల తరబడి దాచుకున్న భవిష్య నిధి కోసం ఉపాధ్యాయులు ఇప్పుడు నెలలకు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఫైనల్‌ పేమెంట్‌, సర్వీస్‌లో వున్న వారికి పార్టు ఫైనల్‌/రుణాల విడుదలను ప్రభుత్వం గడచిన ఆగస్టు నుంచి నిలిపివేసింది. 

ఉపాధ్యాయుల జీతాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం జిల్లా పరిషత్‌ ద్వారా భవిష్య నిధి ఖాతాకు జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం ఏ సమయంలోనైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇక పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం మొత్తం పీఎఫ్‌ సొమ్ము విడుదల చేయాలి. దీనిని ఫైనల్‌ పేమెంట్‌ అని పిలుస్తారు. ఇంకా సర్వీస్‌లో ఉన్నవారు ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య అవసరాల కోసం అప్పటివరకు దాచుకున్న మొత్తంలో సగం లేదా 1/3 వంతు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిని పార్టు ఫైనల్‌ అని అంటారు. ఇంకా అవసరాల కోసం రుణానికి దరఖాస్తు చేస్తే గరిష్ఠంగా మూడు నెలల జీతం ఇవ్వాలి. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 454 మంది టీచర్లు/రిటైర్డు టీచర్లు పీఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రూ.37,30,76,956 విడుదల కావలసి ఉంది. ఈ దరఖాస్తులన్నీ సీఎంఎఫ్‌ఎస్‌కు అప్‌లోడ్‌ చేశారు. అయితే ఇంతవరకు ఒక్కరికి కూడా పైసా విడుదల కాలేదు. దీంతో వారంతా జడ్పీలోని పీఎఫ్‌ సెక్షన్‌కు వచ్చి ఆరా తీస్తున్నారు. కాగా జూలైతో పాటు ప్రస్తుత నెలలో ఇప్పటివరకు సుమారు 100 మంది పీఎఫ్‌ సొమ్ముల కోసం దరఖాస్తు చేశారు. వీరికి రూ.7.13 కోట్లు రావాలి. దరఖాస్తులను పరిశీలించిన జడ్పీ పీఎఫ్‌ సెక్షన్‌ అధికారులు, సీఎంఎఫ్‌ఎస్‌కు అప్‌లోడ్‌ చేయడానికి యత్నించినప్పుడు ‘నో బడ్జెట్‌’ అని ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. దీంతో టీచర్లంతా గగ్గోలు పెడుతున్నారు. పిల్లలు వివాహాలు, చదువులు, ఇతరత్రా అవసరాల కోసం దాచుకున్న సొమ్ములు సకాలంలో ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. 

కాగా ప్రభుత్వ సర్వీస్‌లో వున్న ఉద్యోగి/ఉపాధ్యాయుడు ప్రతి నెలా స్కేల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.రెండు వేలు ఏపీజీఎల్‌ఐ (ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌) చెల్లిస్తారు. కొందరు జీతంలో ఆరు శాతం చెల్లిస్తుంటారు. బాండ్‌ కాల పరిమితి ముగిసిన వెంటనే ఒక్కొక్కరికి ఏపీజీఎల్‌ఐ కింద రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వస్తాయి. అయితే ఆ చెల్లింపులు కూడా తొమ్మిది నెలల నుంచి నిలిచిపోయాయి. జీతం తప్ప పీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ, సరండర్‌ లీవ్‌, ఇతర అలవెన్సుల బకాయిలు ఏవీ రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇదిలావుండగా టీచర్లు, ఉద్యోగుల భవిష్య నిధి సొమ్ములను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందన్న ఆరోపణల్లో వాస్తవం వుందని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.