ఇటీవల రెండురోజుల పాటు గౌహతిలో సమావేశమైన ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్ఓ), సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్, 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును 8.5శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 45 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి ఈపీఎఫ్‌పై వడ్డీరేటు కుదించబడటం వలన ఉద్యోగ, కార్మికుల భవిష్యత్ ప్రయోజనాలకి తీవ్ర భంగం వాటిల్లింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న ఈ నిర్ణయం సుమారు ఆరు కోట్ల ఈపీఎఫ్ చందాదారుల మీద ప్రతికూల ప్రభావం చూపనున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన వెంటనే ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో, ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ ఏర్పాటు పూర్వాపరాలను, లక్ష్యాలను, వడ్డీ చెల్లింపు విధాన ప్రక్రియను, సంస్కరణల నేపథ్యంలో ఈపీఎఫ్ నిధులను మార్కెట్లో పెట్టుబడిగా ఉంచే పద్ధతులలో వచ్చిన విధానపరమైన మార్పులను విశ్లేషించుకోవడం ఆవశ్యకం.
ఈపీఎఫ్ఓలో జమచేసిన చందా మొత్తాలను వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి, వాటిపై వచ్చే లాభాల నుంచి చందాదారులకు వడ్డీని చెల్లించడం జరుగుతుంది. 85 శాతం ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు తదితర రుణ సాధనలోను, 15 శాతం స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడులుగా ఉంచుతారు. వీటిలో 45 శాతం నుంచి 65 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలుగానూ, 20 శాతం నుంచి 50 శాతం కార్పొరేట్ సంస్థలు జారీ చేసిన రుణ పత్రాలలోనూ, స్టాక్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)లో నమోదు అయిన ఎ1 రేటింగ్‌తో ఉన్న రుణ పత్రాలలో 5 శాతం మేరకు నిధులు పెట్టే విధంగా కాలానుగుణంగా మార్పులు చేసారు. ఈక్విటీ పెట్టుబడుల అంశానికి సంబంధించి సెన్సెక్స్, నిఫ్టీలను అనుసరించే, సెబీలో నమోదు అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్, ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లలో, అధిక పెట్టుబడులున్న కంపెనీ షేర్లలోనూ ఈక్విటీల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది.
2015 నుంచి మార్చి 2021 వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈక్విటీ లింక్డ్ ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో 1,37,895.95 కోట్ల నిధులను పెట్టుబడులుగా పెట్టింది. ఈ మొత్తంలో కేవలం 2021 ఆర్థిక సంవత్సరంలోనే 32,070 కోట్లు ఈ విధమైన ఫండ్స్ నందు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. పెట్టుబడులమీద వడ్డీ రూపంలో 2021 ఆర్థిక సంవత్సరంలో 72,811 కోట్లు వడ్డీని సముపార్జించింది. 2020–21 డిసెంబరు నాటికి అడ్వాన్స్ సౌకర్యం క్రింద చందాదారులకు 14,310.21 కోట్లు మంజూరుచేయడంతో పాటు 56.79 లక్షల క్లెయిములను పరిష్కరించింది. ఈపీఎఫ్ వద్ద మొత్తం కార్పస్ ఫండ్ 9.42 లక్షల కోట్లుగా ఉంది.
2015 నుంచి ఈపీఎఫ్ నిధులను 15 శాతం మేరకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లోనే జాతీయ కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర ఫెడరేషన్లు, యూనియన్లు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈపీఎఫ్ పొదుపుపై చందాదారులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ అందించటానికే పీఎఫ్ నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుమతించామని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నది.
ఈపీఎఫ్ఓలో 450 కోట్లు మిగులు నిధులు ఉన్నప్పటికీ, వడ్డీరేటును 8.1 శాతానికి కుదించటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరచటంతో పాటు, ఈ మేరకు ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వామపక్ష ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించి, ఆర్థిక మంత్రికి ఈ మేరకు లేఖను రాసారు. వడ్డీరేటు తగ్గింపు చర్యను పునఃసమీక్షించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. రిటైర్మెంట్ అనంతరం ప్రయోజనాల కోసం భవిష్యనిధి సంస్థలో చేసే పొదుపును ఒక సామాజిక బాధ్యతతో కూడిన కర్తవ్యంగా భావించవలసిన ప్రభుత్వం, ఉద్యోగుల కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో అనుసంధానం చేయడం ఆమోదయోగ్యం కాని చర్య. సంస్కరణల పేరుతో పీఎఫ్, పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లోనికి మళ్ళించాలనే ప్రభుత్వ విధానాలని పునఃసమీక్షించుకోవలసిన సమయం ఆసన్నమైనది.
‘సబ్కా సాత్ – సబ్కా వికాస్’ అనే నినాదాన్ని ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, విధానాల అమలులో కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ, ఉద్యోగుల, కార్మికుల కష్టార్జితాన్ని ఆవిరిచేసే విధానాలు అమలుపరచటాన్ని దేశ కార్మికవర్గం ఉపేక్షించజాలదు. 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ను ఆర్థిక సంస్కరణల బారినుండి, కార్పొరేట్ కనుసన్నలలో అమలు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాల నుండి కాపాడుకోవడం ఉద్యోగుల, కార్మికుల తక్షణ కర్తవ్యం.
– జి. కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ, SCZIEF
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల ఎల్ఐసి ఉద్యోగ సంఘం