జిల్లాలో పీఎఫ్‌ఐ నీడలు

ABN , First Publish Date - 2022-07-07T07:39:15+05:30 IST

జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ (పీఎఫ్‌ఐ) నీడలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల పీఎఫ్‌ఐ శిక్షణ ఇన్‌చార్జి అబ్దుల్‌ ఖాదర్‌ పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం మరో ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు.

జిల్లాలో పీఎఫ్‌ఐ నీడలు

నగరంలో కొంతకాలంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో యువకులకు శిక్షణ

శిక్షణ ఇన్‌చార్జి పట్టుబడడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు

కేసులో మరో ముగ్గురి అరెస్టు

శిక్షణ పొందిన వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు

రంగంలోకి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు

ఆరా తీస్తున్న కేంద్ర నిఘా వర్గాలు 

నిజామాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ (పీఎఫ్‌ఐ) నీడలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల పీఎఫ్‌ఐ శిక్షణ ఇన్‌చార్జి అబ్దుల్‌ ఖాదర్‌ పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం మరో ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. నిజామాబాద్‌ కేంద్రంగా రెండు నెలలుగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేల్చారు. ‘సిమీ’ మూలాలు ఉన్న ఈ సంస్థకు చెందిన వారు కరాటే ముసుగులో షరియత్‌ చట్ట లక్ష్య సాధనలో భాగంగా పలువురు యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరో 26 మంది వరకు ఉన్నారని వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు.

జిల్లా కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తీసుకువచ్చి యువకులకు శిక్షణ ఇచ్చి పంపిస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. శిక్షణ పొందిన వారందరినీ పట్టుకునేవిధంగా ఆయా జిల్లాల పరిధిలోని పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు సహకరించిన వారితో పాటు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి!? ఏ సంస్థలు సహాయం చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు.పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సుమారు 200 మందికి పైగా శిక్షణ 

జిల్లా కేంద్రంలో తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 200 పైగా మందికి పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో దాడులకు కుట్ర పన్నుతున్నారని పోలీసులు నిఘాపెట్టి శిక్షణ ఇచ్చే అబ్దుల్‌ ఖాదర్‌ను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరించారు. నగరంలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటూ ఓ ఇంట్లో పీఎఫ్‌ఐ పేరిట బ్యానర్‌లు ఏర్పాటు చేసి కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను మూడు భాగాలుగా కొనసాగిస్తూ దాడిచేసే సమయంలో మనిషిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకుపోవాలనే కోణంలో వీరికి శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు సేకరించారు. కర్రలు, నాన్‌చాక్‌లతో పాటు ఇతరాయుధాలతో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిషేధిత సిమీలో పనిచేసి బయటకి వచ్చిన వారు ఈ పీఎఫ్‌ఐని ఏర్పాటు చేసి నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లా బైంసా, జగిత్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌, నెల్లూరు, కడప, కర్నూల్‌తో పాటు పలు జిల్లాలకు చెందిన యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఇంటెలిజెన్స్‌ అధికారులతో వివరాల సేకరణ

ఈ కేసులో మరింత దర్యాప్తు చేపట్టిన పోలీసులు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఇతర ప్రాంతాల్లో శిక్షణ పొందినవారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల ముసుగులో మత ఘర్షణలు చోటుచేసుకునే విధంగా యువతను రెచ్చగొడుతూ ఈ శిక్షణ ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. ఈ సంస్థకు ఎక్కడెక్కడివారు సహకరించారు? జిల్లాలో వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎక్కడ నుంచి నిధులు వచ్చాయి. ఏయే ప్రాంతాల నుంచి శిక్షణకు యువత వచ్చారు? వారిని పంపించినవారు ఎవరు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే సమయంలో మతపరమైన అంశాలతో పాటు ఇంకా ఏ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఒక మనిషిని ఎదుర్కోవడంతో పాటు అవసరమైతే మట్టు పెట్టేవిధంగా శిక్షణ ఇచ్చినట్లు గమనించిన పోలీసులు శిక్షణ పొందిన 200 మందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలకు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చి సహకారం కోరుతున్నారు. శిక్షణ పొందినవారు ఆయా జిల్లాల్లో ఉన్నారా? వేరే ప్రాంతాలకు వెళ్లారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మరికొంతమందిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టు అయిన ఖాదర్‌ డైరీలో కీలకమైన అంశాలు ఉండడం, వివిధ అంశాలు పుస్తకాల్లో నోట్‌చేసి ఉండడం, మత ఘర్షణలకు సంబంధించిన అంశాలు ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మరింత మందిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రాలతో పాటు ఇతర  ప్రాంతాల్లో భారీగా మత ఘర్షణలకు పాల్పడే విధంగా శిక్షణ ఇవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోవడంతో పాటు శిక్షణ పొందిన వారందరినీ పట్టుకునే విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దర్యాప్తును కొనసాగిస్తూనే పూర్తిస్థాయిలో అందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని సీపీ నాగరాజు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరింత మందిని పట్టుకుని పూర్తిస్థాయిలో కేసును కొలిక్కితెస్తామని ఆయన తెలిపారు.

కేంద్ర నిఘా వర్గాల ఆరా

నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా శిక్షణపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలో బోధన్‌ కేంద్రంగా ఒకే ఇంటి నుంచి 70 పాస్‌పోర్టులు ఇతర ప్రాంతాల వారికి ఇచ్చిన కేసు సంచలనంగా మారడం తో ఈ కేసుపై కూడా వారు నజర్‌పెట్టారు. ఈ సంస్థకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఏవైనా సంబంధాలు ఉన్నా యా అన్న కోణంలో కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నివేదికను కేం ద్ర నిఘా వర్గాలు సేకరించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల అధికారులు కూడా ఈ కేసుపై నజర్‌పెట్టినట్లు సమాచారం.

Updated Date - 2022-07-07T07:39:15+05:30 IST