కరోనా టీకాలపై కొత్త అధ్యయనం.. రెండో డోసు తీసుకున్న 2 నెలల తరువాత..

ABN , First Publish Date - 2021-07-27T23:57:36+05:30 IST

ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల రెండో డోసు తీసుకున్న రెండు లేదా మూడు నెలల తరువాత శరీరంలో కరోనా యాంటీబాడీల స్థాయిలు సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.

కరోనా టీకాలపై కొత్త అధ్యయనం..  రెండో డోసు తీసుకున్న 2 నెలల తరువాత..

లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల రెండో డోసు తీసుకున్న రెండు లేదా మూడు నెలల తరువాత శరీరంలో యాంటీబాడీల స్థాయిలు సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. యాంటీబాడీల స్థాయి ఇదే రీతిలో పడిపోతే.. టీకా ఇచ్చే రక్షణ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. టీకా వేసుకున్న తొలి నాళ్లలో యాంటీబాడీల స్థాయిలు అత్యధికంగా ఉంటున్నాయని కూడా వారు తెలిపారు. బహుశా..ఈ కారణంగానే టీకా తీసుకున్నవారు కరోనా బారినపడ్డా కూడా వారిలో వ్యాధి ముదరడం లేదని తెలిపారు. మరోవైపు.. ఆస్ట్రాజెనెకా కంటే ఫైజర్ టీకా ద్వారా అధిక సంఖ్యలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని కూడా వారు గుర్తించారు. 


కరోనా నుంచి కోలుకున్న లేదా టీకా తీసుకున్న వారిలో వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయన్న విషయం తెలిసిందే. ఇవే మనల్ని మళ్లీ మళ్లీ కరోనా బారిన పడకుండా రక్షిస్తాయి. అయితే..కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు యాంటీబాడీల నుంచి తప్పించుకుని వ్యాధిని కలుగ జేసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేరియంట్లను అడ్డుకునేందుకు బూస్టర్ డోసులు అవసరమన్న ప్రతిపాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది.  

Updated Date - 2021-07-27T23:57:36+05:30 IST