'ఫైజర్‌'తో అమెరికా కొత్త డీల్..!

ABN , First Publish Date - 2020-12-24T01:34:25+05:30 IST

కరోనాతో సతమతమవుతున్న అమెరికాకు ఫైజర్ టీకా రూపంలో భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే.

'ఫైజర్‌'తో అమెరికా కొత్త డీల్..!

వాషింగ్టన్: కరోనాతో సతమతమవుతున్న అమెరికాకు ఫైజర్ టీకా రూపంలో భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. అమెరికన్ ఫైజర్ సంస్థ, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పటికే ఫైజర్‌తో అమెరికా 100 మిలియన్ డోసుల సరఫరాకు ఒప్పందం చేసుకుంది. తాజాగా అదనపు డోసుల కోసం 'ఫైజర్‌'తో అమెరికా కొత్త డీల్ చేసుకుందని సమాచారం. మరో 100 మిలియన్ డోసుల పంపిణీకి ఫైజర్‌తో యూఎస్ డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య ఈ అదనపు డోసులను అమెరికాకు ఫైజర్ సరఫరా చేయనుందట. త్వరలోనే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన రానుందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. అమెరికన్లందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ రెండు డోసులను అందించాలనే ఉద్దేశంతోనే అగ్రరాజ్యం ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. 


ఇక యూఎస్ డిసెంబర్ 21న ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల చివరి నాటికి 40 మిలియన్ డోసులను పంపిణీ చేసే దిశగా 'ఆపరేషన్ వార్ప్' కొనసాగుతోంది. అటు మోడెర్నా టీకాకు కూడా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సినేషన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. కాగా, ఈ రెండు వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న తర్వాతే ప్రభావవంతంగా పని చేస్తాయనేది తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి ఇప్పటివరకు కోటి 80 లక్షలకు పైగా మందికి ప్రబలింది. 3.30 లక్షల మందిని కబళించింది.



Updated Date - 2020-12-24T01:34:25+05:30 IST