కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాలకు లైన్ క్లియర్!

ABN , First Publish Date - 2021-06-02T21:34:08+05:30 IST

ఇండెమ్నిటీ.. కరోనా టీకాలు వికటించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యల నుంచి టీకా కంపెనీలకు రక్షణ కల్పించే నిబంధన..! ఇటువంటి రక్షణ కల్పించాలనేది ఫైజర్, మోడర్నా వంటి విదేశీ టీకా కంపెనీల ప్రధాన డిమాండ్! భారత్‌లో టీకాలు సరఫరా చేసేందుకు తమకు ఈ రక్షణ కావాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో సదరు కంపెనీలు కోరుతున్నాయి. కాగా.. భారత్ ప్రభుత్వం తాజాగా దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాలకు లైన్ క్లియర్!

న్యూఢిల్లీ: ఇండెమ్నిటీ.. కరోనా టీకాలు వికటించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యల నుంచి టీకా కంపెనీలకు రక్షణ కల్పించే నిబంధన..! ప్రభుత్వాలు తమకు ఇటువంటి రక్షణ కల్పించాలనేది ఫైజర్, మోడర్నా వంటి విదేశీ టీకా కంపెనీల ప్రధాన డిమాండ్! భారత్‌లో టీకాలు సరఫరా చేసేందుకు తమకు ఈ రక్షణ కావాలని కేేంద్రాన్ని ఎప్పటినుంచో సదరు కంపెనీలు కోరుతున్నాయి. కాగా.. భారత్ ప్రభుత్వం తాజాగా దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. 


 ‘‘భారత్‌లో అత్యవసర టీకా వినియోగానికి ఈ కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే..వాటికీ ఇండెమ్నిటీ రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. మరోవైపు..విదేశీ టీకా కంపెనీలు భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలన్న నిబంధన నుంచి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, కొన్ని దేశాల నుంచి తగు అనుమతులు పొందిన పక్షంలో వాటిని పరిగణలోకి తీసుకుని విదేశీ కంపెనీలకు క్లినికల్ ట్రయల్స్ నిబంధన నుంచి మినహాయింపును ఇస్తామని డీసీజీఐ ప్రకటించింది. 


ఇక జులై, అక్టోబర్‌ మధ్యలో భారత్‌కు ఐదు కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని ఫైజర్ ఇప్పటికే ప్రకటించింది. కానీ..భారత ప్రభుత్వం ముందుగా తమకు ఇండెమ్నిటీ కల్పించాలని పట్టుబట్టింది. అమెరికా ప్రభుత్వం ఫైజర్‌కు ఇప్పటికే ఈ రకమైన రక్షణ కల్పించింది. దీంతో..టీకా వల్ల ప్రతికూల ఫలితాలు తలెత్తిన సందర్భాల్లో ప్రజలకు ఫైజర్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం, పరిహారం కోరడం వంటి ప్రత్యామ్నాయ మార్గలు అందుబాటులో ఉండవు. ‘‘ఈ కంపెనీలు అన్ని దేశాల ప్రభుత్వాల నుంచి ఇటువంటి రక్షణ కోరుతున్నాయి. దీన్ని మేము పరిశీలిస్తున్నాం. విస్తృత ప్రజాప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తాం’’ అని ప్రభుత్వ సలహాదారు వీకే పాల్ గతనెలలోనే ప్రకటించారు. 


అయితే..విదేశీ కంపెనీల డిమాండ్లు నెరవేరబోతున్నప్పటికీ ఆ టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా విదేశీ టీకాలు భారత్‌కు చేరుకునేందుకు కొంత ఆలస్యం కావచ్చనేది ప్రస్తుతమున్న అంచనా.   


టీకాల కొరత, దేశ జనాభా అంతటికీ టీకా వేయాల్సిన ఆవశ్యకత దృష్ట్యా విదేశీ టీకా కంపెనీలకు ఇండెమ్నిటీ రక్షణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇతర దేశాలు ఇప్పటికే టీకా కంపెనీలకు ఈ రక్షణ కల్పించాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి..ఇండెమ్నిటీ ఇచ్చయేందుకు ప్రభుత్వానికి ఎటువంటి సమస్య ఉండదని వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో..వీదేశీ టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని సమాచారం.

Updated Date - 2021-06-02T21:34:08+05:30 IST