5-11 ఏళ్లలోపు పిల్లలకు Pfizer టీకా.. అమెరికాలో ఇదే తొలిసారి

ABN , First Publish Date - 2021-10-31T13:04:06+05:30 IST

అన్ని వయసుల పిల్లలకు కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రయోగ పరీక్షలు చేస్తున్న ఫైజర్‌ కంపెనీ మరో ముందడుగు వేసింది.

5-11 ఏళ్లలోపు పిల్లలకు Pfizer టీకా.. అమెరికాలో ఇదే తొలిసారి

5-11 ఏళ్లలోపు వారికీ అందుబాటులోకి 

అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ పచ్చజెండా

అతి పిన్న వయస్కులకు అమెరికాలో ఇదే తొలిసారి

ఆరు రోజుల క్రితమే 3-11 ఏళ్లవారికీ

వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన చైనా

నవంబరులో భారత్‌లోనూ ప్రారంభం?

వాషింగ్టన్‌, అక్టోబరు 30: అన్ని వయసుల పిల్లలకు కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రయోగ పరీక్షలు చేస్తున్న ఫైజర్‌ కంపెనీ మరో ముందడుగు వేసింది. 5-11 ఏళ్లలోపు పిల్లల కోసం ఆ కంపెనీ తయారుచేసిన టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈనేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్స్‌ (సీడీసీ)కు చెందిన వ్యాక్సినేషన్‌ విధానాల సలహా కమిటీ నవంబరు 2న సమావేశం కానుంది. 5-11 ఏళ్లలోపు పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య స్థితిగతులు ఉన్న వారికి టీకా ఇవ్వాలనే దానిపై కమిటీ కీలక సిఫారసులు చేయనుంది. అనంతరం వీటిపై సీడీసీ డైరెక్టర్‌ రాచెల్‌ వాలెన్‌స్కీ సమీక్షించి, టీకా అనుమతులపై అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. ఈ లెక్కన నవంబరు మొదటివారంలోగా అమెరికాలో ఫైజర్‌ టీకాల పంపిణీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. టీనేజీ వారికి, వయోజనులకు ఇస్తున్న ఫైజర్‌ టీకా డోసులో మూడో వంతు మోతాదును మాత్రమే 5-11 ఏళ్లలోపు పిల్లలకు ఇస్తారు. 3 వారాల విరామంతో వ్యాక్సిన్‌ రెండు డోసులను పిల్లలకు అందిస్తారు.


అమెరికావ్యాప్తంగా 2.8 కోట్ల మంది పిల్లలు ఈ టీకా తీసుకునేందుకు అర్హులని అంచనా వేస్తున్నారు. ఫైజర్‌ కంపెనీకి చెందిన మరో ప్రత్యేక వ్యాక్సిన్‌ను 12-15 ఏళ్లలోపు పిల్లలకు ఈ ఏడాది మే నెల నుంచే అందిస్తున్నారు. ఫైజర్‌ కంపెనీ తదుపరి లక్ష్యం 2 - 5 ఏళ్లలోపు వారికి, 6 నెలల  నుంచి 2 ఏళ్లలోపు వారికి టీకాను అందుబాటులోకి తీసుకురావడమే. కాగా, 12-17 ఏళ్ల వారి కోసం మోడెర్నా కంపెనీ అభివృద్ధిచేసిన పిల్లల టీకాకు నవంబరు నెలాఖరులోగా ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతులిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 6-11 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చే టీకాకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని మోడెర్నా కంపెనీ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌ ఇటీవల వెల్లడించారు. 

Updated Date - 2021-10-31T13:04:06+05:30 IST