శారదాదేవిని షోడశీమాతగా రామకృష్ణ పరమహంస పూజించడానికి కారణం ఏమిటి?

Jun 9 2021 @ 19:15PM

హైదరాబాద్: రామకృష్ణ మఠ సంప్రదాయంలో షోడశీమాత పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసం అమావాస్య రోజున షోడశి పూజను నిర్వహిస్తుంటారు. కోల్‌కతాలో ఉన్న దక్షిణేశ్వరంలోని భవతారిణి కాళికాలయంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాలు, మిషన్‌లు, ఆలయాల్లో ఫలహారిణి కాళీ పూజను అత్యంత వైభవంగా జరుపుతుంటారు. అయితే అదే రోజు రామకృష్ణ మఠ కేంద్రాలలో షోడశి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇంతకూ షోడశి పూజ అంటే ఏమిటి? షోడశి పూజ వెనక ఆంతర్యం ఏమిటి? శారదాదేవిని షోడశీమాత రూపంలో రామకృష్ణులు పూజించడానికి కారణం ఏమిటి?


శాక్తేయ తంత్రశాస్త్రంలో దశమహా శక్తులు ఉన్నాయి. ఈ శక్తులలో మూడో శక్తి షోడశీ దేవి. పరమశివుడిని నిరంతరం అంటిపెట్టుకుని ఉండే షోడశీ మాతను 'లలితా త్రిపుర సుందరి'గా పూజలు చేస్తుంటారు. అద్భుతమైన సౌందర్యవతిగా నీరాజనాలు అందుకొనే తల్లి.. అటువంటి మాతగా శారదామాతను చూశారు రామకృష్ణులు. తనలోని జాగృత శక్తిని ఆమెకు ఇవ్వడానికే... శారదామాతలో షోడశీ దేవిని రామకృష్ణులు పాదుకొల్పారు. తనలో ఉన్న మహోన్నతమైన ఆధ్యాత్మిక దివ్యశక్తిని... శారదమ్మ పాదాల దగ్గర సమర్పించి.. జగజ్జననిగా భావించి.. ఆమెను పూజించారు. రామకృష్ణ సంప్రదాయానికి దేవిగా.. ఆధ్యాత్మిక సామ్రాజ్ఞిగా శారదమ్మను నిలిపారు. తన తర్వాత రామకృష్ణ మఠాన్ని నిర్వహించడానికి తగిన శక్తులను అందజేశారని చెబుతుంటారు. ఈ పూజ 1873 మే 25న జరిగింది. రామకృష్ణుల నిర్యాణం అనంతరం 34 ఏళ్ల పాటు రామకృష్ణ మఠాల ఆలనాపాలనను శారదా మాత చూసుకున్నారు. శిష్యులకు దిక్సూచిగా నిలిచారు. ఇన్నేళ్లుగా సనాతన సంప్రదాయ రక్షణకు నిర్విరామంగా రామకృష్ణమఠం కేంద్రాలు పని చేస్తున్నాయంటే అది అమ్మ చూపిన బాటే.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.