నత్తనడకన పీహెచ్‌సీ అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2021-07-27T05:53:45+05:30 IST

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా జరుగుతున్నాయి.

నత్తనడకన పీహెచ్‌సీ అభివృద్ధి పనులు
పీహెచ్‌సీ బయట విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బంది

ఏడు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే

జనవరిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేత

కరెంట్‌ లేక వైద్యారోగ్య సిబ్బంది ఇక్కట్లు


రావికమతం, జూలై 26: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా జరుగుతున్నాయి. నాడు-నేడు పథకం కింద జనవరిలో ప్రారంభించిన ఈ పనులు, ఇప్పటికీ ఏమాత్రం ముందుకు సాగలేదు. సరికదా! పనులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆరంభంలోనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో వైద్యారోగ్య సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

రావికమతం ఆసుపత్రి అభివృద్ధి కోసం నాడు-నేడు పథకంలో రూ.30 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కాంట్రాక్టరు జనవరిలో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆరోగ్య కేంద్రంలో గదులు, బాత్‌రూమ్‌లు, కిటికీల మరమ్మతులతో పాటు వైద్యాధికారి, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్లలో గచ్చుల స్థానంలో సిరామిక్‌ టైల్స్‌ అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనులకు ఆటంకం కలుగుతుందునే నేపంతో ఆరోగ్య కేంద్రానికి ఉన్న విద్యుత్‌ సరఫరాను జనవరిలోనే నిలిపి వేశారు. 

అభివృద్ధి పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. సరికదా! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉద్యోగుల పరిస్థితి తయారైంది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో చిమ్మ చీకటిలోనే ఇబ్బందులు పడుతూ వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే కరోనా, ర్యాబిస్‌, ఇతర టీకాలు శీతలీకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత్యంతరం లేక చోడవరం ఆసుపత్రిలో వీటిని ఉంచుతూ అవసరమైనప్పుడల్లా అక్కడి నుంచి తీసుకు రావాల్సి వస్తోంది. ఇక మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తిచేయకపోవడంతో మహిళా ఉద్యోగులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులు, రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-07-27T05:53:45+05:30 IST