పీహెచ్‌సీ ఊసేది?

Sep 26 2021 @ 23:29PM
శంకుస్థాపన నాటి శిలాఫలకం

  • ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.1.24 కోట్లు మంజూరు
  • శంకుస్థాపన చేసి మూడు నెలలైనా ప్రారంభం కాని పనులు

మోతుగూడెం, సెప్టెంబరు 26: ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చింతూరు మండలం మోతుగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం 2019లో మంజూరు చేసింది. ఈ ప్రాంతంలో ప్రజలు తమకు ఆసుపత్రికి వస్తే ఉన్నత వైద్యం అందుతుందని భావించినా అది కార్యరూపం దాల్చడం లేదు. పీహెచ్‌సీ మంజూరు కావడంతో ఆసుపత్రి భవనం నిర్మించేందుకు రూ.1.24 కోట్లను మంజూరు చేస్తూ ఓ కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించింది. శంకుస్థాపన చేసి మూడు నెలలు అయినా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. మంజూరైనా పీహెచ్‌సీ ఊసేలేదు. మోతుగూడెం పరిధిలో చాలా గిరిజన గ్రామాలతోపాటు ఏపీ జెన్‌కో పవర్‌ప్లాంట్‌ ఉంది. మోతుగూడెంలో జలపాతం ఉంది. పర్యాటక రంగం ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందింది. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో మోతుగూడెం పీహెచ్‌సీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రజలు వైద్య సేవల కోసం రావాలంటే ఒడియా క్యాంప్‌ నుంచి గొడ్లగూడెం ఆస్పత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతూరు 41 కిలోమీటర్లు ఉంది. మోతుగూడెంలో ప్రాథమిక ఆస్పత్రి నిర్మిస్తే వారికి 15 కిలోమీటర్లు కలిసి వస్తుంది. ఇప్పటికైనా చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ చొరవ తీసుకుని మోతుగూడెం పీహెచ్‌సీ భవనం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.