బార్‌గా మారిన గుంటుపల్లి పీహెచ్‌సీ..!

ABN , First Publish Date - 2020-11-27T05:55:33+05:30 IST

గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బార్‌గా మారింది. పీహెచ్‌సీ సిబ్బంది రోగుల సేవలను పక్కనపెట్టి మద్యం సేవిస్తూ ఆరోగ్య కేంద్రాన్ని బార్‌గా మార్చారు. మధ్యాహ్నం 3గంటల సమయానికే వైద్యులతో పాటు ప లువురు సిబ్బంది అందుబాటులో లేరు. ఆసుపత్రి మూసి ఉంది.

బార్‌గా మారిన గుంటుపల్లి పీహెచ్‌సీ..!
మధ్యాహ్నం 3 గంటలకే మూసివున్న పీహెచ్‌సీ

రోగుల వార్డులో పడిఉన్న మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు, కాల్చి పడేసిన సిగరెట్లు 

మధ్యాహ్నం మూతపడిన ఆసుపత్రి

అడ్రస్‌ లేని వైద్యులు, మహిళా సిబ్బంది

తాగిన మత్తులో పడి ఉన్న ఎంపీహెచ్‌ఈవో

బల్లికురవ, నవంబరు 26: గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బార్‌గా మారింది.  పీహెచ్‌సీ సిబ్బంది రోగుల సేవలను పక్కనపెట్టి మద్యం సేవిస్తూ ఆరోగ్య కేంద్రాన్ని బార్‌గా మార్చారు. మధ్యాహ్నం 3గంటల సమయానికే వైద్యులతో పాటు ప లువురు సిబ్బంది అందుబాటులో లేరు. ఆసుపత్రి మూసి ఉంది. అదే సమయంలో రోగుల వార్డులో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్‌లు, సిగరెట్‌ పెట్టెలు పడి ఉన్నాయి. ఆసుపత్రిని మూసేసి మందుతాగి, బిర్యానీ తిని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం పూటుగా తాగిన ఎంపీహెచ్‌ఈవో మాత్రం కదలలేని స్థితిలో రోగుల బెడ్‌పై పడిపోయి ఉన్నాడు. మద్యం సేవించిన ప్రాంతంలో పరిస్థితి పరిశీలిస్తే నలుగురైదుగురు కలిసి పార్టీ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. పక్కనే అట్టపెట్టెలో మరికొన్ని మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. దీనిని బట్టి ముందస్తు ప్రణాళికతో అందరూ కలిసి మందు విందు చేసుకొని ఉంటారని తెలుస్తోంది. ఇద్దరు వైద్యులకుగాను ఒక్కరు కూడా ఆ సమయంలో డ్యూటీలో లేరు. స్టాప్‌ నర్సులు కూడా అక్కడ లేకపోవడం చూస్తే పార్టీ జరగడంతోనే వారు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. 

మహిళా ఏఎన్‌ఎంల ఫోన్‌లకు అసభ్య మెసేజ్‌లు 

గుంటుపల్లి పీహెచ్‌సీ పరిధిలో పనిచేసే కొంతమంది ఏఎన్‌ఎంల సెల్‌ఫోన్లకు పీహెచ్‌సీ అధికారుల ఫోన్ల నుంచి అసభ్యకర మెసేజ్‌లు వస్తుండటంతో ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఎదురు ప్రశ్నించలేక, విషయాన్ని బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో రత్నావళి దృష్టికి తీసుకువెళ్లగా.. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 





Updated Date - 2020-11-27T05:55:33+05:30 IST