దివ్యాంగులకు మనోవికాసమేదీ?

ABN , First Publish Date - 2020-12-03T04:44:59+05:30 IST

దివ్యాంగులకు మనోవికాసమేదీ?

దివ్యాంగులకు మనోవికాసమేదీ?
ఎదులాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న మనోవికాస భవనం

సొంత భవనానికి మోక్షమేప్పుడో? 

2004 నుంచి అసంపూర్తిగా ఉన్న పనులు 

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి చొరవతో సగం పనులు పూర్తి  

ఘట్‌కేసర్‌రూరల్‌ : ప్రభుత్వాలు మారుతున్నాయి.. ఎమ్మెల్యేలు మారుతున్నారు.. కానీ దివ్యాంగుల మనోవికాసానికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు. 2004 నుంచి ఇప్పటి వరకూ దివ్యాంగుల మనోవికాస భవన నిర్మాణం పూర్తికాకపోవడమే దానికి నిదర్శనంగా నిలుస్తుంది. సొంత భవనం లేక అన్నిరకాల దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. ఘట్‌కేసర్‌ మండలంలో సుమారు 1,000 మంది దివ్యాంగులున్నారు. 58 దివ్యాంగుల సంఘాలు పనిచేస్తున్నాయి. అత్యఽధికంగా ఎదులాబాదు గ్రామంలో 200 మంది మానసిక దివ్వాంగులు ఉండగా, 8 సంఘాలు క్రీయశీలకంగా పనిచేసున్నాయి. బ్యాంకు నుంచి రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్నారు. వారికంటూ సొంతభవనం లేక గ్రామంలోని మహిళా డ్వాక్రా భవనంలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తమకు కమ్యూనిటీ భవనం కావాలని ఎన్నో ఏళ్లుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయుందని పలువురు దివ్యాంగులు వాపోతున్నారు. 

2004లో దేవేందర్‌గౌడ్‌ శంకుస్థాపన

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌ పంచాయతీరాజ్‌శాఖ నిధులతో ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో విభిన్న ప్రతిభావంతుల కమ్యూనిటీ భవనం నిర్మాణానికి 2004 ఫిబ్రవరి 2న శంకుస్థాపన చేశారు. ఆతర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 2014 ఫిబ్రవరి 24న మళ్లీ అదే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. కానీ ప్రభుత్వాలు మారుతున్న దివ్యాంగుల మనోవికాస కేంద్ర భవన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. 

గత కలెక్టర్‌ ఎంవీ రెడ్డి చొరవ

రెండేళ్ల కిత్రం ఎదులాబాదు గ్రామంలో పర్యటించిన నాటి కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి దివ్యాంగులు అసంపూర్తి భవన నిర్మాణం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో ఫిజియోథెరపీ కార్యక్రమాలు జరుగుతున్నాయని, భవనాన్ని త్వరగా పూర్తిచేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌నుకోరారు. దీంతో కలెక్టర్‌ స్పందించి, ఆయన మంజూరు చేసిన నిధులతో ప్రహరీ నిర్మించారు. మట్టిపోయించి తెల్లనిరంగు వేసి వదిలిపెట్టారు.   అయితే డ్వాక్రా భవనంలోనే ప్రతినెలా 6వ, 23వ తేదీల్లో మానసిక దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు.  మధ్యమధ్యలో దివ్వాంగులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాము ఇంకా ఎంతకాలం డ్వాక్రా భవనంలో ఉంటూ తరుచూ ఇబ్బందులుకు గురికావాలని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్న దివ్యాంగుల భవనాన్ని ఇకనైనా పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ నిధులతో సగం పనుయ్యాయి

నాటి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి చొరవతో ప్రహరీ నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు అలాగే ఉన్నాయి. ప్లోరింగ్‌, నీటి సౌకర్యం, బండలు వేయాలి. మరుగుదొడ్డికి తలుపులు బిగించలేదు. అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి.

- బట్టె రవి, దివ్యాంగుల మనోవికాస కేంద్ర అధ్యక్షుడు


త్వరలో వినియోగంలోకి తెస్తాం

దివ్యాంగుల మనోవికాస కేంద్ర భవనం పనులు త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తాం. మరుగుదొడ్డితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అందుబాటులోకి తెస్తాం. అన్ని విధాలుగా దివ్యాంగులను ఆదుకుంటాం. 

- తౌర్యానాయక్‌, ఏపీఎం, ఘట్‌కేసర్‌

Updated Date - 2020-12-03T04:44:59+05:30 IST