ఫోన్‌ నెంబర్ల మార్పుతో అంతా అయోమయం

ABN , First Publish Date - 2021-05-07T16:07:56+05:30 IST

వీరిలో కొందరు మాత్రం కొత్త సిమ్‌లను ఆక్టివేట్‌ చేసుకోకుండా...

ఫోన్‌ నెంబర్ల మార్పుతో అంతా అయోమయం

  • నెల రోజుల క్రితమే కొత్త నెంబర్ల కేటాయింపు 
  • పని చేయడం లేదంటూ పక్కన పెట్టారు 
  • కాప్రా  సర్కిల్‌లో కొందరు పాతవే వినియోగిస్తున్న వైనం

హైదరాబాద్/కాప్రా : జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారుల ఫోన్‌ నెంబర్లు మారడంతో అయోమయం నెలకొంది. పాత నెంబర్ల స్థానంలో నెల రోజుల క్రితమే కొత్త నెంబర్లు కేటాయించారు. అయితే నెట్‌ వర్క్‌ సమస్యలతో అవి సక్రమంగా పని చేయడం లేదంటూ వాటిని పక్కన పెట్టారు.


కొందరు మళ్లీ పాత నెంబర్లనే వినియోగిస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. సర్కిల్‌ కార్యాలయంలోని ఇంజనీరింగ్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌, ప్రాజెక్టు, ఎంటమాలజీ, ఎలక్ర్టికల్‌ విభాగాల అధికారులకు ఓ నెట్‌ వర్క్‌కు సంబంధించిన ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. అయితే నెల రోజుల క్రితం మరో నెట్‌ వర్క్‌కు సంబంధించిన కొత్త నెంబర్లను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా కేటాయించారు. డిప్యూటీ కమిషనర్‌తోపాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ , వాల్యుయేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌, ప్రాజెక్టు అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, టాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, టీపీఎస్‌లు, బిల్‌ కలెక్టర్లు, సూపరింటెండెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్లకు పాత వాటి స్థానంలో కొత్త నెంబర్లను కేటాయించారు.


వీరిలో కొందరు మాత్రం కొత్త సిమ్‌లను ఆక్టివేట్‌ చేసుకోకుండా పాత వాటినే కొనసాగిస్తున్నారు. కొత్త నెంబర్లకు సంబంధించి నెట్‌ వర్క్‌ సమస్యలున్నాయని, అవి సక్రమంగా పని చేయడం లేదంటూ కొందరు ఆ సిమ్‌లను తొలగించారు. మొన్నటి వరకు కొత్త నెంబర్‌ను వినియోగించిన డిప్యూటీ కమిషనర్‌ ఫోన్‌ ఇప్పుడు స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. మరికొందరు అధికారుల ఫోన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా కొందరు కొత్త నెంబర్లను వాడటం, మరికొందరు పాత నెంబర్లనే వినియోగిస్తుండటంతో ఎవరిని ఏ నెంబర్లలో సంప్రదించాలో తెలియక పలువురు అయోమాయనికి గురవుతున్నారు.  సర్కిల్‌ కార్యాలయంలోని అందరు అధికారులు కొత్త నెంబర్లకు స్వస్థి పలికి పాత నెంబర్‌లలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-05-07T16:07:56+05:30 IST