వేతనాల కోసం వైద్యుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-30T10:27:29+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సీనియర్‌ రెసిడెంట్‌ (ఎస్‌ఆర్‌) వైద్యులకు నెలల తరబడి

వేతనాల కోసం వైద్యుల ఆందోళన

డ్యూటీ చేస్తూ నిరసన.. జీతాలివ్వకుంటే విధులు బహిష్కరిస్తాం

రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్‌ రెసిడెంట్స్‌ హెచ్చరిక 

హైదరాబాద్‌ సహా జిల్లాల్లో నెలల తరబడి అందని జీతాలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సీనియర్‌ రెసిడెంట్‌ (ఎస్‌ఆర్‌) వైద్యులకు నెలల తరబడి వేతనాలందడం లేదు. దీంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఆర్‌లు ఆందోళన బాట పట్టారు. వైద్య సేవలందిస్తూనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణకు దిగుతామని, అవసరమైతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పరిఽధిలోని ఆస్పత్రుల్లో 3 నెలలు, జిల్లాల్లో అయితే ఆరేడు నెలలుగా జీతాలు రావడం లేదని ఎస్‌ఆర్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌  బోధానాస్పత్రి, హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి దవాఖానలో పని చేస్తున్న డాక్టర్లకు 8 నెలలుగా వేతనాలివ్వడం లేదు. అలాగే ఆదిలాబాద్‌ రిమ్స్‌, హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లోని వైద్యులకు 5 నెలలుగా ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఆస్పత్రుల పరిధిలో మొత్తం 698 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌ పని చేస్తున్నారు. సకాలంలో జీతాలందకపోవడంతో కుటుంబ ఖర్చులకు కూడా పైసల్లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాని వారంతా వాపోతున్నారు. చేసిన పనికి  కూడా దీనంగా డబ్బులివ్వండి మహాప్రభో అని అడుక్కోవడమేంటని ఓ సీనియర్‌ రెసిడెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయక సేవలందిస్తే...తమకిచ్చే గుర్తింపు ఇదా అని మరో ఎస్‌ఆర్‌ సర్కారును ప్రశ్నించారు. 

స్పెషలైజేషన్‌ పూర్తి.. 

ఈ 698 మంది డాక్టర్లు 2018-2021లో వివిధ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్లుగా పనిచేేసందుకు గతేడాది నవంబరులో వీరిని సర్కార్‌ నియమించుకుంది. నెలకు రూ.80,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ఇందులో కటింగ్స్‌ పోనూ చేతికి రూ.72 వేలే వస్తాయని ఎస్‌ఆర్‌లు చెబుతున్నారు. కాగా, గతేడాది నవంబరు నుంచి మార్చి వరకూ జీతాలు ఇవ్వలేదు. దీంతో మార్చిలో డాక్టర్లు ఆందోళనకు దిగగా కొంత మందికి ఐదు నెలలు, కొంత మందికి మూడు నెలల జీతాలు చెల్లించారు. ఆ తర్వాత చెల్లింపులు ఆపేశారు. గతవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాసినా స్పందన లేదని ఎస్‌ఆర్‌లు అంటున్నారు. 

వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేయాలి

సీనియర్‌ రెసిడెంట్స్‌కు క్రమం తప్పకుండా ప్రతీనెలా వేతనాలు చెల్లించాలి. అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఒకటో తేదీలోగా అటెండెన్స్‌ వివరాలు తీసుకోవాలి. ఐదోతేదీలోగా వేతనాలివ్వాలి. జీతాల చెల్లించే వ్యవస్థను వెంటనే స్ట్రీమ్‌లైన్‌ చేయాలి. 

- డాక్టర్‌ గుండగాని శ్రీనివాస్‌, జూనియర్‌ డాక్టర్ల సంఘం గౌరవ సలహాదారు

Updated Date - 2022-06-30T10:27:29+05:30 IST