Advertisement

జగన్‌ రూటే సెపరేటు!

May 10 2020 @ 00:22AM

మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం ధరలను 75 శాతం పెంచారు. అది కూడా మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు కాకుండా బూమ్‌ బూమ్‌, బామ్‌ బామ్‌ అంటూ ఎవరూ ఎప్పుడూ వినని బ్రాండ్లను ప్రవేశపెట్టారు. మద్యం ప్రియులను నిరుత్సాహపరచడానికే వారికి షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం జగన్‌కే సాధ్యం. ఆయన ఈ మాట అన్న తర్వాత విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఎన్ని గుండెలు! అదేమంటే మద్యపానాన్ని నిరుత్సాహపరచడం కూడా తప్పా? అని ఎదురుదాడి చేస్తారు. మద్యం ధరలను పెంచడం ద్వారా అమ్మ ఒడి పథకం కింద తల్లులకు ఇచ్చినట్టే ఇచ్చి, తండ్రుల నుంచి అంతకు అంతా వసూలు చేయబోతున్నారు. అదేమని ప్రశ్నించలేని స్థితిని ప్రతిపక్షాలకు కల్పించారు. మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే అడ్డుకుంటున్నారన్న అపప్రథను ప్రతిపక్షాలకు అంటగట్టడానికి జగన్‌ అండ్‌ కో సిద్ధంగా ఉంది.


సోషల్‌ ఇంజనీరింగ్‌ను నమ్ముకున్న జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేషాన్ని రగిలింపజేసి ఆశించిన ఫలితాన్ని పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యూహంతో ఆ సామాజికవర్గంపై కత్తి దూస్తూనే ఉన్నారు. కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి, మిగతా వర్గాలకు మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకుని.. తాజాగా ఆ వర్గాన్నీ పరోక్షంగా టార్గెట్‌ చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలకు.. ముఖ్యంగా బీసీలకు దూరం అయిన విషయాన్ని గమనించిన జగన్మోహన్‌రెడ్డి అండ్‌ కో ప్రస్తుతం ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. ఈ క్రమంలో కమ్మ– కాపు సామాజికవర్గాలను వదులుకోవడానికి జగన్‌ సిద్ధపడ్డారని భావిస్తున్నారు.


ఇతరుల ఊహకు అందని పథకాలకు కేసీఆర్‌ రూపకల్పన చేశారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ వంటి పథకాలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నప్పటికీ రైతుబంధు, 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా వంటి పథకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో పూర్వ ముఖ్యమంత్రులు అనుసరించిన విధానాన్ని కొనసాగించడంతోపాటు కుమారుడు కేటీఆర్‌ సహాయంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. కేసీఆర్‌ వ్యవహార శైలి పట్ల ఎవరికెన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రజలలో మాత్రం ఇంతకంటే ఇంకెవరున్నారు అన్న అభిప్రాయాన్ని వ్యాపింపజేసుకున్నారు.


కష్టపడి, పట్టుబట్టి మరీ పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చినప్పటికీ, వాటిని ఏర్పాటుచేసిన ప్రాంతంలో కూడా చంద్రబాబు  ఓడిపోయారు. ఏ రాజధానిని అయితే నమ్ముకున్నారో ఆ రాజధాని వల్ల గరిష్ఠంగా ప్రయోజనం పొందే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా ఆయనను ఓడించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కులం అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించడంలో విఫలమవడంతో కొందరివాడేనన్న అపప్రథను మూటగట్టుకున్నారు. ఫలితంగా చంద్రబాబు నమ్ముకున్న అభివృద్ధి, సంక్షేమం కూడా ఓటమి నుంచి ఆయనను కాపాడలేదు. పార్టీని, రాజకీయాన్ని గాలికి వదిలేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చాలా తెలివైనవాడు. తెలుగు ప్రజలపై తనదైన ముద్ర వేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులతో పోల్చితే జగన్మోహన్‌రెడ్డిది విభిన్న శైలి! ఎన్‌.టి.రామారావు ‘రాజకీయం’ తెలియని నిష్కల్మష నాయకుడు. ముఖ్యమంత్రులుగా ఒక్కొక్కరు ఒక్కో మోడల్‌ను అనుసరిస్తుంటారు. జగన్‌ మోడల్‌ మాత్రం ఇప్పటివరకు ఎవరూ అనుసరించలేదు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అత్యధిక భాగం బలమైన ఓటు బ్యాంకును తయారుచేసుకునే విధంగానే ఉంటాయి. పేదలు, బడుగు, బలహీనవర్గాల పేరుతో ఇతరులు ఏమనుకుంటారో, రాష్ట్రానికి మంచిదో కాదో.. అని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ, పథకాలకు రూపకల్పన చేసుకుపోతున్నారు. మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచే విషయంలో ముందు వెనుక ఆలోచించకుండా, ‘‘పెంచిన ధరలతో మందుబాబులకు షాక్‌ కొట్టాలి’’ అని చెప్పి మరీ ధరలు పెంచిన గడసరితనం జగన్మోహన్‌రెడ్డి సొంతం.


పేద ప్రజల సైకాలజీని ఔపోశన పట్టిన ఆయన.. సోషల్‌ ఇంజనీరింగ్‌ను కూడా మిళితం చేసి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తరచుగా ఆత్మరక్షణలోకి నెడుతుంటారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ను నమ్ముకున్న జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేషాన్ని రగిలింపజేసి ఆశించిన ఫలితాన్ని పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యూహం తో ఆ సామాజికవర్గంపై కత్తి దూస్తూనే ఉన్నారు. కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి, మిగతా వర్గాలకు మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకుని.. తాజాగా ఆ వర్గాన్నీ పరోక్షంగా టార్గెట్‌ చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలకు.. ముఖ్యంగా బీసీలకు దూరం అయిన విషయాన్ని గమనించిన జగన్మోహన్‌రెడ్డి అండ్‌ కో ప్రస్తుతం ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది.


కాపులకు భయపడి చంద్రబాబు అండ్‌ కో.. పవన్‌కల్యాణ్‌ వంటివారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకోలేదు. ఇప్పుడు జగన్‌ అండ్‌ కో అటువంటి శషభిషలకు తావు లేకుండా ముందుగా నాగబాబు, ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా టార్గెట్‌ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా కాపు నాయకులెవ్వరూ నోరు విప్పలేకపోయారు. వంగవీటి రంగా హత్యానంతరం రాజశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగి కాపులకు అండగా నిలిచారు. దీంతో చనిపోయేవరకు వైఎస్‌ఆర్‌ను కాపులు అభిమానించారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న విధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. తనకు అండగా ఉంటున్న దళితులు, ముస్లింలతోపాటు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉంటూ వచ్చిన బీసీలను తనవైపు తిప్పుకోవడానికై జగన్‌ ఎత్తుగడలు వేశారు. ఈ క్రమంలో కమ్మ– కాపు సామాజికవర్గాలను వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారని భావిస్తున్నారు. రాజకీయంగా జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొందరికి అనాలోచితంగా అనిపించినా అందులో నిగూఢంగా రాజకీయం నిక్షిప్తమై ఉందని అర్థంచేసుకోవలసి ఉంటుంది.


ఈ విషయం అమాయక ప్రజలకు అర్థం కాదు కనుక ఆయన నిర్ణయాలకు జైకొడుతున్నారు. ఇప్పుడు రాజశేఖర్‌రెడ్డి అనుసరించిన మోడల్‌ను తీసుకుందాం. రెండున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులను ఢీకొని, డక్కామొక్కీలు తిన్న రాజశేఖర్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం– అభివృద్ధి అనే రెండు ప్రాధాన్యాంశాలను నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన అన్ని వర్గాల ఆమోదం పొందగలిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ ఒక్క వర్గంపైనా కక్షతో వ్యవహరించలేదు. వివిధ వర్గాలకు చెందినవారిని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రోత్సహించారు. ప్రభుత్వపరంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కూడా వివక్ష చూపలేదు. తెల్ల కార్డుల జారీ, ఇళ్ల పట్టాల మంజూరు, ఫీజుల చెల్లింపు వంటి పథకాల అమలులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నప్పటికీ సంతృప్తస్థాయి అన్న నినాదంతో అందరికీ అన్నీ ఇచ్చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాజకీయంగా తాను మరింత బలోపేతం అవడం కోసం ప్రతిపక్షాలపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. తన దారిలోకి వచ్చినవారిని సంతృప్తిపరుస్తూనే, ఎదురు తిరిగినవారిని అణగదొక్కారు. ప్రజల విషయానికి వచ్చేసరికి వివక్ష చూపలేదు.


తనకంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పాలనలో నిర్లక్ష్యానికి గురైనట్లు ప్రజలు భావించిన నీటిపారుదల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చంద్రబాబుకు మంచి పేరు తెచ్చిన విధానాలను కూడా కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయాలలోని లొసుగులను ప్రశ్నించిన కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు, కొంత మంది వ్యక్తులు మినహా మిగతా వారిపట్ల ఆయన శత్రుభావం ప్రదర్శించలేదు. దీంతో అందరివాడుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వం లో చోటుచేసుకున్న అవినీతిని పూర్వపక్షం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒంటి చేత్తో ఎదుర్కొని చివరకు తెలంగాణ రాష్ట్ర సమితికి మనుగడ ఉండదన్న అభిప్రాయాన్ని ప్రజలలోనే కాకుండా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా వ్యాపింపజేశారు. ఈ కారణంగానే రాజశేఖర్‌రెడ్డి బతికి ఉండి వుంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదని ఇప్పటికీ పలువురు అభిప్రాయపడుతుంటారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యమంత్రి అయిన ఆయన తొలి విడతలో తనదైన శైలిలో పనిచేసి నాయకుడిగా ప్రజలలో గుర్తింపు పొందగలిగారు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి పథకాల ద్వారా ప్రజలకు సన్నిహితం అయ్యారు. పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికై అందరికీ అందుబాటులో ఉండేవారు. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. ఐటీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా మిగతా రంగాలపై అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీలో సీనియర్‌ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు.


జిల్లా స్థాయిలో అధికారమంతా కలెక్టర్లు, ఎస్పీల వద్ద కేంద్రీకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలుగా మిగిలిపోయారు. ఆకస్మిక తనిఖీల వల్ల ఉద్యోగులను దూరం చేసుకున్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా కాకుండా ఒక కంపెనీకి సీఈవో మాదిరిగా వ్యవహరించారు. ఫలితంగా కొన్ని రంగాలలో ఎంత పురోగతి సాధించినా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించినప్పటికీ.. 2004 ఎన్నికలలో ఓడిపోయి రాజశేఖర్‌రెడ్డికి అధికారం అప్పగించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీని నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని 2014లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్‌రెడ్డి రూపంలో తనకు బలమైన ప్రత్యర్థి ఉన్నాడన్న విషయాన్ని విస్మరించి, ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పార్టీని, రాజకీయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సవరించుకుని, పాలనాపరంగా తీసుకున్న ప్లస్‌ పాయింట్లను మేళవించి పటిష్ఠమైన వ్యూహాన్ని రూపొందించుకోలేకపోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత రాజధాని నిర్మించాలన్న ఆరాటంతోపాటు అభివృద్ధి మోడల్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డికి మంచి పేరు తెచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పథకాలను అమలుచేశారు.


గతంలో తమ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వలేదన్న విమర్శలను అధిగమించడానికై వారిని పూర్తిగా వదిలేశారు. ఒకప్పుడు తనకు దూరమైన ఉద్యోగులను దగ్గరకు తీసుకోవడానికై వారికి అడిగినవన్నీ సమకూర్చారు. ఏతావాతా చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని ప్రారంభంలోనే ప్రజల్లో అభిప్రాయం ఏర్పడినా ఖాతరు చేయలేదు. వేళాపాళా లేకుండా టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు అంటూ గంటల తరబడి విసిగించడంతో అధికారులతోపాటు ఉద్యోగులు కూడా మళ్లీ దూరమయ్యారు. చివరకు తనకంటూ ఒక మోడల్‌ లేకుండా పాలన సాగించడంతో ఉభయభ్రష్టత్వం చెందారు. కష్టపడి, పట్టుబట్టి మరీ పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చినప్పటికీ, వాటిని ఏర్పాటుచేసిన ప్రాంతంలో కూడా ఓడిపోయారు. ఏ రాజధానిని అయితే నమ్ముకున్నారో ఆ రాజధాని వల్ల గరిష్ఠంగా ప్రయోజనం పొందే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా ఆయనను ఓడించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కులం అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించడంలో విఫలమవడంతో కొందరివాడేనన్న అపప్రథను మూటగట్టుకున్నారు. ఫలితంగా ఆయన నమ్ముకున్న అభివృద్ధి, సంక్షేమం కూడా ఓటమి నుంచి ఆయనను కాపాడలేదు.


పార్టీని, రాజకీయాన్ని గాలికి వదిలేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విషయానికి వస్తే.. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న నాటి నుంచి ఎత్తులు– జిత్తులతో అడుగులు వేశారు. రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం రూపంలో అదృష్టం కలిసిరావడంతో అంతకుముందు బలహీనపడిన కేసీఆర్‌ మళ్లీ బలం పుంజుకున్నారు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తొలి ఎన్నికలలో అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇతర పార్టీల తరఫున గెలిచినవారిని చీల్చి తనవైపు తిప్పుకొని బలం పెంచుకున్నారు. పార్టీ నాయకులకు గానీ, ఇతరులకు గానీ చనువు ఇస్తే నెత్తిన ఎక్కుతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అందరినీ దూరం పెట్టారు. కేసీఆర్‌ అంటే చండశాసనుడు అని పేరు తెచ్చుకున్నారు. తాను కోరుకున్నవారిని మాత్రమే కలిసేవారు. అధికారులు సైతం తోక జాడించకుండా ఆదిలోనే అదుపులో పెట్టుకున్నారు. వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌–బీజేపీ మధ్య చీలిపోతున్నందున తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలిచారు. ప్రభుత్వపరంగా చూస్తే కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తిచేయడానికై చర్యలు తీసుకున్నారు. సంక్షేమం విషయానికి వస్తే.. ఇతరుల ఊహకు అందని పథకాలకు రూపకల్పన చేశారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ వంటి పథకాలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నప్పటికీ రైతుబంధు, 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా వంటి పథకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో పూర్వ ముఖ్యమంత్రులు అనుసరించిన విధానాన్ని కొనసాగించడంతోపాటు కుమారుడు కేటీఆర్‌ సహాయంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. కేసీఆర్‌ వ్యవహార శైలి పట్ల ఎవరికెన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రజలలో మాత్రం ఇంతకంటే ఇంకెవరున్నారు అన్న అభిప్రాయాన్ని వ్యాపింపజేసుకున్నారు.


ఆ ముగ్గురికీ భిన్నంగా...

ఈ ముగ్గురు నాయకులకు భిన్నమైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. దీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగడం అనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటూ, పథకాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, న్యాయస్థానాల అభ్యంతరాలను కూడా ఆయన ఖాతరు చేయడంలేదు. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయమే తీసుకుందాం. మాతృభాషకు ప్రాధాన్యం లేకపోవడం ఏమిటి అని ఆక్షేపించిన పాపానికి ‘‘నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉండకూడదా?’’ అని ఎదురుదాడి చేయడం ద్వారా వారంతా స్వరాన్ని సవరించుకోవలసిన పరిస్థితి కల్పించారు. అంతేకాదు, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టడంతోపాటు బడుగు, బలహీనవర్గాల శ్రేయోభిలాషిగా పేరుకు పేరు కూడా సంపాదించుకున్నారు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా హైకోర్టు తీర్పును అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకప్పుడు చంద్రబాబు తీసుకున్న ఇదే నిర్ణయాన్ని జగన్‌ అండ్‌ కో తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ప్రజలు మరిచిపోయారు. ఎప్పటినుంచో అమలులో ఉన్న పథకాలకు పేర్లు మార్చి, స్వల్ప మార్పులు చేసి ప్రజలలో మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజుల చెల్లింపు పథకానికి ‘జగనన్న విద్యా దీవెన’ అని పేరు పెట్టి కళాశాలల యాజమాన్యాలకు బదులు ఆ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే వేస్తామని ప్రకటించడం కూడా రాజకీయ ప్రయోజనం కోసం చేసినదే! ఆయా కళాశాలల్లో ఫీజులను నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గత ప్రభుత్వాలు అమలుచేసిన విధానాన్ని పక్కన పెట్టి సరైన ప్రాతిపదిక లేకుండా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు గతం లో ఎన్నడూ లేని విధంగా మద్యం ధరలను 75 శాతం పెంచారు. అది కూడా మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు కాకుండా బూమ్‌ బూమ్‌, బామ్‌ బామ్‌ అంటూ ఎవరూ ఎప్పుడూ వినని బ్రాండ్లను ప్రవేశపెట్టారు.

మద్యం ప్రియులను నిరుత్సాహపరచడానికే వారికి షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం జగన్‌కే సాధ్యం. ఆయన ఈ మాట అన్న తర్వాత విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఎన్ని గుండెలు! అదేమంటే మద్యపానాన్ని నిరుత్సాహపరచడం కూడా తప్పా? అని ఎదురుదాడి చేస్తారు. మద్యం ధరలను పెంచడం ద్వారా అమ్మ ఒడి పథకం కింద తల్లులకు ఇచ్చినట్టే ఇచ్చి, తండ్రుల నుంచి అంతకు అంతా వసూలు చేయబోతున్నారు. అదేమని ప్రశ్నించలేని స్థితిని ప్రతిపక్షాలకు కల్పించారు. మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే అడ్డుకుంటున్నారన్న అపప్రథను ప్రతిపక్షాలకు అంటగట్టడానికి జగన్‌ అండ్‌ కో సిద్ధంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచకపోయినా చార్జీలన్నీ బాదుడే బాదుడంటూ విమర్శించిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చార్జీలను పెంచారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నానని ప్రకటించడం ద్వారా ఉద్యోగులు, కార్మికులలో మార్కులు సంపాదించడంతోపాటు బస్సు చార్జీలు పెంచుకోగలిగారు. చంద్రబాబుకు ఉద్యోగులు దూరం కావడానికి కారణమైన టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులకు స్వస్తి చెప్పి సాయంత్రం ఐదింటికల్లా దుకాణం బంద్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా సమీక్షలను మధ్యాహ్నానికే పూర్తిచేసి అధికారులు రాత్రులు కూడా పడిగాపులు కాసే పరిస్థితి లేకుండా చేశారు. దీంతో వేతన సవరణ అమలు చేయకపోయినా, సీపీఎస్‌ విధానం రద్దు చేయకపోయినా ఒక్క ఉద్యోగ సంఘం నాయకుడు కూడా నోరు విప్పలేని పరిస్థితి! అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలుగుదేశం పార్టీ వారిపై ఇబ్బడిముబ్బడిగా కేసులు పెట్టి క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు బయటికి రావడానికి జంకే పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్లు కేసులకు భయపడిపోతున్నారు.

ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసినా.. వాటన్నింటిని బడుగు, బలహీనవర్గాల కోసం తీసుకున్నామని చెప్పుకోవడం ద్వారా ఆ వర్గాలను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేదల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి జగన్మోహన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో రాష్ట్రాభివృద్ధి గాలికి పోయినా పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ప్రభుత్వ పథకాల మాయలో ప్రభుత్వ వైఫల్యాలు తెరమరుగు అవుతున్నాయి. విశాఖపట్టణంలో ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీకై 12 మంది మరణించిన దుర్ఘటన విషయమే తీసుకుందాం. మామూలుగా అయితే ఈ దుర్ఘటన జరిగినందుకు అధికార పార్టీ ఆత్మరక్షణలో పడాలి. అలాంటిది ప్రతిపక్షాలు నోరెత్తలేని పరిస్థితిని జగన్మోహన్‌రెడ్డి కల్పించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడంతో ప్రతిపక్షాలకు కూడా శభాష్‌ అని చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇలాంటి సందర్భాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలి. తాను మంచి మనసున్న ముఖ్యమంత్రినని ప్రజలను నమ్మించడానికై కోటి రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరఫున జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన భారీ పరిహారం వల్ల  ఖర్చు అయింది 30 కోట్ల రూపాయలు మాత్రమే గానీ, ప్రజల దృష్టిలో జగన్మోహన్‌రెడ్డికి మంచివాడు అన్న పేరే వచ్చింది కదా? ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. ప్రతి అడుగులోనూ ఓటుబ్యాంకును స్థిరీకరించుకోవడమే కనిపిస్తుంది. సంక్షేమానికి సైతం అప్పులు చేస్తున్నప్పటికీ, నిలదీయలేని పరిస్థితి ప్రతిపక్షాలకు కల్పించడం మామూలు విషయం కాదు. కుల, మతపరంగా తనకు బలమైన ఓటుబ్యాంకు ఉన్నందున ఇతర వర్గాలను పట్టించుకోవలసిన అవసరం లేదన్న అభిప్రాయంతో జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్టు అనిపిస్తోంది. బహుశా ఈ కారణంగానే రాజధాని మూలపడటం వంటి అంశాలు ప్రజలకు పట్టడంలేదు. ప్రస్తుతానికి జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న మోడల్‌ రాజకీయంగా సత్ఫలితాలనే ఇస్తోంది. మున్ముందు ఏమి జరుగుతుందో వేచిచూద్దాం!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.