స్వీయ విధ్వంసంలో జగన్!

ABN , First Publish Date - 2020-10-20T09:03:03+05:30 IST

‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి..’ అని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కొన్ని దశాబ్దాల క్రితం చెప్పిన...

స్వీయ విధ్వంసంలో జగన్!

నేరచరితులైన ప్రజాప్రతినిధులపై విచారణను వేగవంతం చేయడం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలైంది. అవినీతిచరితులపై మోదీ సర్కార్ వైఖరి తెలిసీ జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనో బురద చల్లడం, మొత్తం న్యాయవ్యవస్థను బజారుకు లాగడం ఆయన వివేక భ్రష్టతకు స్పష్టమైన సంకేతం తప్ప మరేమీ కాదు. నరేంద్ర మోదీ అయినా అమిత్ షా అయినా జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఏ ముఖ్యమంత్రి విషయంలోనైనా వారు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు. అంతమాత్రాన ఆ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి చర్యనూ వారు సమర్థిస్తారనుకోవడం సరికాదు.


‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి..’ అని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కొన్ని దశాబ్దాల క్రితం చెప్పిన మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం వర్తిస్తాయి. 17 నెలల క్రితం ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు దేశం దృష్టి అంతా ఆయన పైకి మళ్లింది. అయితే జగన్మోహన్ రెడ్డి లాగా ఏ ముఖ్యమంత్రీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఇన్ని వివాదాలు మూటకట్టుకోలేదు. సరికదా అపరిపక్వమైన నిర్ణయాలు తీసుకుని ఆత్యహత్యాసదృశ వైఖరికి పాల్పడలేదు. అసలు ఒక ముఖ్యమంత్రి పిన్నవయసులో బాధ్యతలు చేపట్టినంత మాత్రాన అతడు అపరిపక్వ పాలన అందిస్తారని, అనుభవరాహిత్యంతో ప్రవర్తిస్తారని అనుకోవడానికి ఏ మాత్రం వీల్లేదు. ఎంతోమంది యువకులకు యుక్తవయస్సులోనే యుక్తాయుక్త విచక్షణ, వివేకం అబ్బుతాయి. కానీ విచిత్రమేమంటే జగన్‌కు పిన్నవయసులో అధికారం చేజిక్కినప్పటికీ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించగల నేర్పు లోపించింది. నిజానికి చాలా మందితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డిది రాజకీయ కుటుంబం. తండ్రి జనాదరణ గల రాజకీయనాయకుడు. చిన్న వయస్సు నుంచి రాజకీయాలను సమీపం నుంచి చూసే అవకాశం లభించింది. అయినప్పటికీ ఆయన రాజకీయాల నుంచి ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. జగన్ 40 వ ఏటే ఆయన పై సిబిఐ, ఈడీ దాదాపు 17 ఛార్జిషీట్లు దాఖలు చేయడమే ఇందుకు నిదర్శనం. అయినప్పటికీ తండ్రి రాజశేఖర్ రెడ్డి జనాదరణ, చంద్రబాబు ప్రభుత్వ స్వయంకృతాపరాధాల వల్ల జగన్‌కు అధికారం లభించింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు, 25 లోక్‌సభ సీట్లలో 22 సీట్లు ఆయనకు లభించాయి. ఇంతటి మెజారిటీ సాధించిన నేతలు అరుదనే ఒప్పుకోవాలి.


అత్యంత సాఫీగా, పకడ్బందీగా సుపరిపాలన సాగిస్తూ రోజురోజుకూ తన ప్రజాదరణ పెంచుకుంటూ పోయేందుకు జగన్‌కు అన్ని అవకాశాలూ లభించాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందించేందుకు తొలుత నుంచే చేయూతనిచ్చింది. రాజధాని నిర్మాణం, మెట్రో, రహదారి ప్రాజెక్టులు, రేవులు, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు నెలకొల్పడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేటా యించేందుకు మోదీ సర్కార్ సిద్ధపడింది. జగన్ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి కావల్సిన సహాయాన్ని కేంద్రం నుంచి పొందుతూ ఎలాంటి వివాదం లేకుండా సుపరిపాలన అందించిఉంటే ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలో పేరు పొందేవారు.


కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నిర్మాణాత్మక కార్యక్రమాల కన్నా విధ్వంస కార్యక్రమాల పైనే జగన్ దృష్టి సారించడం మొదలుపెట్టారు. విద్యుత్ ప్రాజెక్టుల కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసి అంతర్జాతీయ విపణిలో దేశం విమర్శలు ఎదుర్కొనేలా చేశారు. రాజధాని రద్దు, పోలవరం టెండర్ల రద్దు.. ఇలా రద్దుల పర్వమే ఆయన పాలనకు గీటురాయి అయింది. ఉదయం లేచినప్పటి నుంచీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలను కాలరాయడమే కాక, కొందరు నేతల పట్ల కక్షసాధింపు చర్యల కోసమే ఆయన తన అమూల్యమైన సమయాన్ని వృథా చేశారు. ఎవర్ని జైలుకు పంపించాలా, ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలా, ఎవర్ని శంకరగిరి మాన్యాలు పట్టించాలా అని మాత్రమే ఆయన ఆలోచించారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని అర్ధాంతరంగా తగ్గించి కొత్త వ్యక్తిని నియమించి న్యాయస్థానం విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, పాఠశాలల్లో మాతృభాషను రద్దు చేసి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా డబ్బుల్ని రకరకాల సంక్షేమ పథకాలకు మళ్ళించడం కొనసాగించారు. గత ఏడాదిగా వివిధ వర్గాలకు డబ్బులు, పదవులు పంచిపెట్టడం, 60మందికి పైగా సలహాదారులను నియమించుకోవడం మినహా జగన్ చేసిందేమీ కనబడడం లేదు. పైగా ఆయన హయాంలో రాష్ట్రంలో అనేకచోట్ల పలు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది- దేవాలయాలపై ఒక పద్ధతి ప్రకారం జరిగిన విధ్వంసక దాడులు. అశేష భక్తులు ఆరాధించే తిరుపతి వెంకన్న ఆస్తులపై కన్ను వేయడం, టీటీడీ భూములను, నిధులను మళ్లించే ప్రయత్నాలు ప్రజల మెప్పు పొందలేదు. రాత్రికి రాత్రే మన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌ను మార్చడంతో లక్ష కోట్ల విలువైన సింహాచలం ఆలయ భూముల కోసమేనని ప్రజలు భయాందోళనలకు గురి కావడం జగన్ ప్రభుత్వ నిజాయితీని శంకించేలా చేశాయి.


తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలను ఎక్కుపెడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే కాక ఆ లేఖను అధికారికంగా విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి వివేకాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఆ లేఖలో చేసిన ఆరోపణలు వాస్తవమేనా, లేక జగన్ కేవలం ఒక వర్గంపై కక్ష పెంచుకుని గుడ్డి వ్యతిరేకతతో కన్నూమిన్నూ గానకుండా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ దేశ వ్యాప్తంగా చెలరేగింది. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు నిజమని ఆయన భావిస్తుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరిగి స్పందించేంతవరకూ ఎందుకు వేచి ఉండలేదు? బహుశా తన ఆరోపణల్లో బలం లేదని, దాన్ని న్యాయప్రపంచం పట్టించుకోదని అనిపించినందువల్లే ఆయన తన లేఖను విడుదల చేయడం ద్వారా రచ్చ చేయాలని భావించి ఉండవచ్చు. అంతేకాదు, తనతో పాటు దేశంలోని నేరచరితులైన రాజకీయ నాయకులందరిపై ఏడాది లోపు దేశంలోని అన్ని హైకోర్టులు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తున్నందువల్ల ఆ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రమణపై బురద చల్లాలని ఆయన అనుకుంటుండవచ్చు. నిజానికి ఈ దేశ రాజకీయాలను అవినీతిపరుల నుంచి ప్రక్షాళన చేయాలని ప్రధాని మోదీ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందుకు పెద్దనోట్ల రద్దు నుంచి ఆయన అనేక చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. పన్నుల వ్యవస్థలో లోపాలను అరికట్టి ఎగవేతదారులను పన్నుల చట్రంలోకి లాగే పలు నిర్ణయాలను తీసుకున్నారు. అందులో భాగంగానే నేరచరితులైన ప్రజాప్రతినిధులపై విచారణను వేగవంతం చేయడం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలైంది. 2014లోనే అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా ఏడాది లోపే విచారణ పూర్తి కావాలని చెప్పారు. ఈ కేసు అప్పటి నుంచి సాగుతూ ఇప్పటికి కొలిక్కి వచ్చింది. జస్టిస్ ఎన్‌వి రమణ ఉన్న ధర్మాసనం ముందుకే ఈ కేసు విచారణకు రావడం యాదృచ్ఛికం. ఈ ధర్మాసనం ముందు కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేరచరితులపై కేసులు వేగంగా దర్యాప్తు జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామని, ప్రత్యేక కోర్టులకు, సాక్షుల విచారణకు అవసరమైన సౌకర్యాల కల్పనకు నిధులు కూడా కేంద్రం కేటాయిస్తుందని చెప్పారు. అవినీతి చరితులపై మోదీ ప్రభుత్వం వైఖరి తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనో బురద చల్లడం, మొత్తం న్యాయవ్యవస్థను బజారుకు లాగడం ఆయన వివేక భ్రష్టతకు స్పష్టమైన సంకేతం తప్ప మరేమీ కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా హోంమంత్రి అమిత్ షా అయినా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఏ ముఖ్యమంత్రి విషయంలోనైనా వారు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు. అంత మాత్రాన ఆ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి చర్యనూ వారు సమర్థిస్తారనుకోవడం అమాయకత్వం. జగన్ స్వయం విధ్వంసక చర్యలకు ఆయనే బాధ్యులు కాక తప్పదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-10-20T09:03:03+05:30 IST