తగ్గేదే లే... మాట్లాడితే కోట్లే.. వీడు మామూలోడు కాదండోయ్..!

Jun 20 2021 @ 11:15AM

  • ఎకరాలకొద్దీ ‘పిడుగు’ భూ మాయ
  • కోట్లు కొల్లగొట్టుడు.. కొర్రీలు పెట్టుడు
  • 8 కంపెనీలు.. 19 బ్యాంకు ఖాతాలు
  • వందల కోట్లలో లావాదేవీలు
  • 91 డాక్యుమెంట్లలో ఎన్ని ఫోర్జరీలో..?
  • తీగలాగుతున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని.. యజమానులకు తెలియకుండా ఇతరులకు అమ్మకానికి పెట్టి, రూ. 56 కోట్లు కొట్టేయడానికి పథకం వేసిన పిడుగు ఆదినారాయణ మూర్తి ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును లోతుగా విశ్లేషిస్తూ పిడుగు చేసిన అనేక అక్రమాలను వెలుగులోకి తీస్తున్నారు. 


8 కంపెనీల సృష్టి.. 

15 ఏళ్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అనుభవం ఉన్న పిడుగు.. ఇప్పటి వరకు 8 రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు స్థాపించాడు. 1. రాన్‌ ఎస్టేట్‌ ప్రై. లిమిటెడ్‌ అమీర్‌పేట, 2. ఏఎన్‌ఆర్‌ ఎవెన్యూస్‌ ప్రాజెక్టు ప్రై. లిమిటెడ్‌ అమీర్‌పేట, 3. శ్రీసాయి ఆదర్శ ఎంటర్‌ప్రైజెస్‌ అమీర్‌పేట, 4. శ్రీ రమ్య రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపర్స్‌ అమీర్‌పేట, 5. రాన్‌ ఫ్రమ్‌ టెక్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ అమీర్‌పేట, 6. ప్లాటిమమ్‌ ఇన్‌ఫ్రాసిటీ ప్రై. లిమిటెడ్‌ అమీర్‌పేట, 7. జయ దాశరథి ప్రాజెక్టు ఎల్‌ఎల్‌పీ కోకాపేట, 8. ఆదినారాయణ ఆర్ట్స్‌ కృష్ణానగర్‌ పేరుతో కంపెనీలు స్థాపించాడు. అన్ని కంపెనీలకు రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఒక్కో కంపెనీలు ఎంతమంది వాటాదారులున్నారు..? కంపెనీ బైలాస్‌/ నిబంధనలు ఏమున్నాయి..? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయా కంపెనీల్లో ఇప్పటి వరకు ఎలాంటి లావాదేవీలు జరిగాయి. వాటిలో ఎన్ని బోగస్‌ కంపెనీలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

19 ఖాతాలపై దృష్టి..

మహేశ్వరంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన రూ. 56కోట్ల భూమాయ కేసులో సైబరాబాద్‌ పోలీసులు ఇప్పటికే అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 91 డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిలో పేర్కొన్న భూములు, ప్రాంతాలు, జిల్లాల ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వాటిలో పలు డాక్యుమెంట్లు నకిలీవిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిలో పేర్కొన్న భూములు కూడా పదుల ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పిడుగు సృష్టించిన నకిలీ పట్టాపా్‌సబుక్‌లపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వాటిని ఎలా తయారు చేస్తున్నారు..? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ముద్రిస్తున్నారు..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 


మాట్లాడితే కోట్లే..

భూముల కోసం.. వెంచర్ల కోసం.. ఇతర అవసరాల కోసం భూములు కావాలని పిడుగును సంప్రదిస్తే.. రూ.కోట్లలో ట్రాన్సక్షన్‌ జరగాల్సిందే. ఎవరైనా భూములు కావాలని సంప్రదిస్తే డబ్బు మాట రూ.కోట్లలో ఉండాల్సిందే తప్ప.. వేరే మాటేలేదు. ఒక్క ఎకరం పరిగణలోకి తీసుకున్నా.. కోటికి పైన ట్రాన్సక్షన్‌ జరగాల్సిందే. ఎక్కడా తగ్గేదేలేదు. పిడు గు సృష్టించిన భూ మాయలో ఎక్కువగా రాచకొండ పరిధిలోని మహేశ్వరం, సైబరాబాద్‌ పరిధిలోని బాలానగర్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భూములున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి సహా.. పలు ప్రాంతాలకు చెందిన సంబంధిత ద్రువపత్రాలు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా భూ క్రయ విక్రయాల పేరుతో తన 8 రియ ల్‌ ఎస్టేట్‌ కంపెనీల ద్వారా రూ. వందల కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇప్పటికే పిడుగు గ్రూపులకు సంబంధించి 19 బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటి లావాదేవీలపై దృష్టి సారించారు. ఒక్కో ఖాతా నుంచి ఎన్ని రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. వాటిని ఎక్కడెక్కడకి బదిలీ చేశారు. ఆ లావాదేవీల్లో పాత్రదారులు ఎందురు..? సూత్ర దారులు ఎందరు..? అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


కోట్లు చేతికి వచ్చాక.. 

ఇదిలా ఉండగా.. నకిలీ దస్ర్తాలు సృష్టించి కేవలం కాగితాల్లోనే ఎకరాల కొద్ది భూములు ఉన్నట్టు చూపించి, కొనుగోలుదారులను గోల్‌మాల్‌ చేస్తున్న పిడుగు ముఠా.. కొనుగోలు దారుల నుంచి రూ.కోట్లు చేతుల్లో పడగానే పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత అగ్రిమెంట్స్‌, రిజిస్టర్‌ సేల్‌డీడ్‌లు ఇవ్వడంలో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తారు. రేపు మాపు అంటూ నెలల తరబడి దాటవేస్తూ.. కొర్రీలు పెడతాడు. దాంతో విసిగిపోయిన బాఽధితులు అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు మోసం వెలుగులోకి వస్తుంది. దాంతో మోసపోయిన  బాధితులు డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసం చుక్కలు చూడాల్సిందేనని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు త్వరలోనే పిడుగు ముఠా చేసిన మరిన్ని భూ బాగోతాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.