పిలాయిపల్లి పూర్తయ్యేదెన్నడో

ABN , First Publish Date - 2021-07-27T06:09:22+05:30 IST

మూసీ సాగునీటి కాల్వ పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పిలాయిపల్లి  పూర్తయ్యేదెన్నడో
పిలాయిపల్లి కాల్వ జీరోపాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన గేట్లు

 సాగునీటి కోసం ఆయకట్టు రైతుల నిరీక్షణ
వరి నారు ముదురుతోందని ఆందోళన
 ఈ సీజనలోనూ తప్పని క్రాప్‌హాలిడే!

 భూదానపోచంపల్లి :
మూసీ సాగునీటి కాల్వ పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టలేనని ప్రధాన కాంట్రాక్టర్‌ చేతులెత్తేయడంతో, మరో ముగ్గురు సబ్‌ కాంట్రాక్టర్లు పనులు నిర్వహించారు. కాల్వ విస్తరణకు ప్రభుత్వం రూ.102కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.42కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఏడాది జూన మొదటి వారంలో రైతులకు సాగునీరు అందిస్తామని ప్రభు త్వం ప్రకటించినా, అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం వర్షా లు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. నారు పో సుకోండి నీరిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిలాయిపల్లి కాల్వ విస్తరణ కోసం పూర్తిస్థాయిలో భూసేకరణ చేయకుండానే ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించింది. 890ఎకరాల భూసేకరణకు రూ.40కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం విస్తరణ పనులకు నిధులు విడుదల చేయలేదు. దీంతో పనులు జాప్యమవుతున్నాయి. ఫలితంగా పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వల పరిధిలోని 20,600ఎకరాల ఆయకట్టు రైతులు మూడు సీజన్లు వరి సాగుచేసుకోకుండా నష్టపోయారు.
మూసీ కాల్వల విస్తరణకు రూ.284.85కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016 ఆగస్టులో హరితహారం సందర్భంగా చౌటుప్పల్‌లో మొక్కలు నాటేందుకు వచ్చిన సందర్భంలో మూసీ కాల్వల విస్తరణ కు రూ.284.85కోట్లు మంజూరు చేశారు. కాగా, నిధులు మంజూరై ఐదేళ్లు కా వొస్తున్నా, పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలను విస్తరిస్తే 16మండలాల్లోని 119గ్రామాల్లోని 221చెరువులను మూసీ నీటితో నింపవచ్చు. ఆ నీటితో 60,800 ఎకరాల భూమికి సాగునీరందించవచ్చు. అందుకు 890ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది.
భూ సేకరణకు అరకొర నిధులే
మూసీ కాల్వల విస్తరణ కోసం భూసేకరణగాను ప్రభుత్వం రూ.40కోట్లు మాత్రమే కేటాయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాక ఈ నిధులు సరిపోవని నిర్ధారించారు. హైదరాబాద్‌ శివారులో ఉన్న యాదాద్రి జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరం భూమి ధర కనిష్ఠంగా రూ.30లక్షల వరకు ఉంది. దీని ప్రకారం ప్రభుత్వం కేటాయించిన రూ.40కోట్లు, 890ఎకరాల సేకరణకు సరిపోవు. దీంతో మరో రూ.60కోట్ల కావాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే భూసేకరణ పూర్తిస్థాయిలో చేయకుండానే ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించింది. రబీలో క్రాప్‌హాలిడే ప్రకటించగానే ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన, 100రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో భూసేకరణలో కీలక భూమిక పోషించే వీఆర్‌వోలు, ఆర్‌ఐ, తహసీల్దార్లు ఈ కార్యక్రమానికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో భూసేకరణలో జాప్యం చోటుచేసుకుంది.
ఈ సీజనలోనూ సాగునీరు లేనట్టే?
మూసీ కాల్వల్లో ప్రధానమైన పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కాల్వ ఆయకట్టుకు ప్రస్తుత వానాకాలం సీజనలో సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈమేరకు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సైతం నిర్వహించి జూన మొదటి వారంలో సాగునీరు అందించాలని ఆదేశించారు. అయినా ఈ సీజనలోనూ సాగునీరు అందేది ప్రశ్నార్థకమే. గతంలో కాలువ మరమ్మతుల పేరుతో ప్రభుత్వం 2014, 2017, 2020లో క్రాప్‌హాలిడే ప్రకటించింది. దీంతో పొలాలు బీళ్లుగా మారాయి. మూడు దఫాలుగా క్రాప్‌హాలిడే విధించడంతో రైతులు రూ.300కోట్ల మేర నష్టపోయారు. ప్రస్తుతం పనుల్లో పురోగతి లేకపోవడంతో జూలై 10వ తేదీ వరకు కాల్వ పరిధిలోని పిలాయిపల్లి,జగతపల్లి, నారాయణగిరి, మొహర్‌నగర్‌, జలాల్‌పూర్‌, భీమనపల్లి, కనుముకుల గ్రామాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రైతులు నారుమడులు పోసుకుని నిరీక్షిస్తున్నారు. కాల్వ జీరో పాయిం ట్‌ వద్ద పిల్లర్లతో షట్టర్ల నిర్మాణం, సుమారు 2కిలోమీటర్ల పొడవునా కాల్వ కు గైడింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. కేవలం పిలాయిపల్లి కాల్వ విస్తరణకు ప్రభుత్వం రూ.102కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.52కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో డీవాటరింగ్‌ చేసేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత సీజనలోనూ సాగునీరు అందేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో జూనలో పోసుకున్న నారు ముదురుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాల్వ పనుల్లో నాణ్యత కరువు

- పాక మల్లే్‌షయాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు
మూడు సీజన్లలో క్రాప్‌హాలిడే విధించారు. ఈ సీజనలో సైతం సాగునీరు అందించే పరిస్థితి లేదు. కాల్వ జీరో పాయింట్‌ వద్ద చేపట్టిన పనుల్లో నాణ్యత లేదు. ఇటీవల వచ్చిన మూసీ వరద ఉధృతికి కాల్వకు గండి పడింది. ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే కాల్వకు గండి పడిందంటే నాణ్యత ఏ మేరకో అర్థంచేసుకోవచ్చు. క్రాప్‌హాలిడే కారణంగా రైతులు రూ.300కోట్లకు పైగా నష్టపోయారు. ఇప్పటికైనా పనులు పూర్తిచేయించి సాగునీరు అందించాలి.  


మాటలే తప్ప చేతలు లేవు

- కోట రాంచంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా నేత
పిలాయిపల్లి కాల్వ పనులు పూర్తిచేసి జూన మొదటివారంలో ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటల్లోనేగానీ చేతల్లో లేదు. సాగునీరు జూన నెలలో ఇస్తామంటే రైతులు నార్లు పోసుకుని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు వరకైనా కాల్వ పనులు పూర్తి చేసి సాగునీరు ఇస్తారా అనేది అనుమానమే. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలి. క్రాప్‌హాలిడేతో నష్టపోయిన ఆయకట్టు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

సాగునీరు అందించేందుకు కృషి

  - మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, భూదానపోచంపల్లి ఎంపీపీ
పిలాయిపల్లి కాల్వ విస్తరణకు ప్రభుత్వం రూ.102కోట్లు కేటాయించి రూ.52కోట్లు విడుదల చేసింది. జీరోపాయింట్‌ వద్ద షట్టర్ల నిర్మాణం, జగతపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. వర్షం లేకుంటే ఎమ్మెల్యే సహకారంతో వారం రోజుల్లో పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


Updated Date - 2021-07-27T06:09:22+05:30 IST