కుప్పం తెరమీదకు విశాల్‌ పేరెందుకొచ్చింది?

ABN , First Publish Date - 2022-07-03T06:42:56+05:30 IST

కుప్పం తెరమీదకి హఠాత్తుగా తమిళ హీరో విశాల్‌ పేరును ఎందుకు తీసుకువచ్చారో తెలియక వైసీపీ వర్గాలే గందరగోళ పడుతున్నాయి.

కుప్పం తెరమీదకు  విశాల్‌ పేరెందుకొచ్చింది?
హీరో విశాల్‌

అబ్బే అటువంటి ఆలోచనే లేదంటున్న తమిళ హీరో

భరత్‌కు ఎగనామం తప్పదా?


కుప్పం, జూలై 2: కుప్పం తెరమీదకి హఠాత్తుగా తమిళ హీరో విశాల్‌ పేరును ఎందుకు తీసుకువచ్చారో తెలియక వైసీపీ వర్గాలే గందరగోళ పడుతున్నాయి. మరి భరత్‌ పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా వెంటనే వినిపిస్తోంది. అబ్బే కుప్పం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేది భరతే అని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించినా ఏదో తెలియని అనుమానం వైసీపీ వర్గాల్లో మెదలుతోంది. కుప్పం నుంచి పోటీచేసే ఆలోచనే లేదని హీరో విశాల్‌ స్వయంగా వివరణ ఇచ్చినా కూడా, నిప్పు లేకుండా పొగరాదు కదా అంటున్నారు.


2024 కన్నా ముందే ఎన్నికలు రావచ్చనే ప్రచారం నేపథ్యంలో కుప్పం గుబులు వైసీపీ నాయకుల్లో బలంగా ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీ గణనీయంగా తగ్గడం, స్థానిక ఎన్నికలన్నింటిలోనూ వైసీపీ విజయకేతనం ఎగురవేయడం వంటి పరిణామాలతో ఆ పార్టీ నాయకులు ఈసారి చంద్రబాబును ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేయడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ అయితే బాబును ఓడించడం చిటికెలో పని అనే విధంగా ఇటీవల జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ప్రసంగం కూడా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా పలు సందార్భాల్లో సవాళ్లు విసురుతున్నారు. ఈ గాంభీర్యం అంతా బయటకే అని, లోపల్లోపల ఆందోళనతో ఉన్నారని విశాల్‌ పేరు తెరమీదకు రావడంతో అర్ధమవుతోంది.  చంద్రబాబును ఢీకొనే బలమైన అభ్యర్ధిని బరిలోకి దించకపోతే పరువుపోతుందనే అభిప్రాయంతో వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. నిజానికి వైసీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న భరత్‌ను ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జనంలో అనుమానాలు మొదలయ్యాయి. పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఈ అనుమానాలను మరింత పెంచుతూ వచ్చారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభల్లోను, మూడునాలుగు రోజుల క్రితం పలమనేరులో జరిగిన సభలోనూ భరత్‌ను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సాక్షాత్తు పెద్దిరెడ్డే  ప్రకటించినా, ఆ మాటను సంపూర్ణంగా విశ్వసించలేకపోతున్నారు. పైగా పెద్దిరెడ్డి కుటుంబంలోని వ్యక్తి ఒకరు కుప్పం నుంచి బరిలో నిలుస్తారన్న ప్రచారం జోరుగా ఉంది. పార్టీలోని భరత్‌ వ్యతిరేకులు ఈ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. మధ్యలో హీరో విశాల్‌ పేరును రంగంలోకి లాగారు. కుప్పంలో ఆయన తండ్రికున్న వ్యాపార సంబంధాన్ని చూపుతూ ఆయనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుమీద వైసీపీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థిగా బలమైన ప్రచారం జరిగిపోయింది. నాయకులు చెబుతున్నంత బలంగా కుప్పంలో పార్టీ పరిస్థితి ఉంటే ఇన్ని పేర్లు ప్రచారంలోకి రాకూడదు. భరత్‌ పేరు ఒక్కటే వినిపించాలి. ఈ గందరగోళ ప్రచారం అంతా పార్టీలోని అనైక్యతను, బలహీనతను వెల్లడిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



Updated Date - 2022-07-03T06:42:56+05:30 IST