పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్థానం ఆయనకేనా!

ABN , First Publish Date - 2020-07-14T16:27:53+05:30 IST

ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేసిన..

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్థానం ఆయనకేనా!

రేసులో పొన్నాడ సతీష్‌కుమార్‌, చెల్లుబోయిన వేణు


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారోననే ప్రచారం జోరుగా సాగుతోంది. బోస్‌తో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణను కూడా రాజ్యసభకు పండడం వల్ల ఆయన కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరూ బీసీలే. బోస్‌ శెట్టిబలిజ, మోపిదేవి మత్స్యకార సామాజికవర్గాలకు చెందినవారు. అందువల్ల ఈ రెండు పదవులనూ ఈ వర్గాలకే మళ్లీ ఇస్తారనే ప్రచారం ఉంది. అందువల్ల ఇదే వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు పదవులు ఆశిస్తున్నారు.


రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు మంత్రి పదవికి పోటీపడుతున్నారు. అదే వర్గం నుంచి కృష్ణా జిల్లా నుంచి మరొకరు ఆశిస్తున్నారు. తొలిసారి నెగ్గిన వారికి స్థానం లేదనే నిబంధన పాటిస్తే వేణుకు ఇవ్వకపోవచ్చు. కానీ రాజకీయంగా ఆయనకు అనుభవం ఉంది. జడ్పీ చైర్మన్‌గా పని చేయడమే కాక శెట్టిబలిజవర్గంలో బలమైన నాయకుడు. మత్స్యకార వర్గం నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మోపిదేవి స్థానాన్ని పొన్నాడతో భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సతీష్‌ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన మత్స్సకారవర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి పదవి ఖాయమనే ప్రచారం ఉంది.


Updated Date - 2020-07-14T16:27:53+05:30 IST