Pilots Fall Asleep : విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. ల్యాండింగ్ మిస్..

ABN , First Publish Date - 2022-08-19T22:01:22+05:30 IST

బస్ లేదా లారీ డ్రైవర్ కునుకేయడంతో రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం.

Pilots Fall Asleep : విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. ల్యాండింగ్ మిస్..

అడీస్‌అబాబా : బస్ లేదా లారీ డ్రైవర్ కునుకేయడంతో రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అయితే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా విమానం(Plane) నడుపుతూ పైలెట్లు(Pilots) నిద్రపోయిన ఘటన సోమవారం వెలుగు చూసింది. సూడాన్‌లోని ఖర్టౌమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా బయలుదేరిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్(Ethiopian Airlines) బోయింగ్ 737 ‘ఫ్లైట్ ET343’ నడుపుతూ పైలెట్లు ఇద్దరూ నిద్రపోయారు. దీంతో ల్యాండింగ్ మిస్సయ్యింది. ఎయిర్‌పోర్ట్ సమీపిస్తున్న సమయంలో ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అప్రమత్తం చేసినా పైలెట్లు నిద్రలేవలేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు చేరువవుతున్నా 37 వేల అడుగుల ఎత్తులోనే విమానం ప్రయాణిస్తుండడంతో అనుమానం వచ్చిన ఏటీసీ అధికారులు పైలెట్లను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. పైలెట్లు విమానాన్ని ‘ఆటోపైలెట్ సిస్టమ్‌’లో ఉంచడంతో విమానం సూచించిన ఎత్తులోనే ప్రయాణిస్తుంది. అయితే ల్యాండ్ అవ్వాల్సిన రన్‌‌వేను దాటిపోయిన తర్వాత  ‘ఆటోపైలెట్ సిస్టమ్’ దానంతటదే ఆగిపోతుంది. ఇథియోపియన్ విమానంలోనూ ఇదే జరిగి ‘అలారమ్’ మోగింది. అప్పుడు ఒళ్లు విరుచుకుంటూ పైలెట్లు నిద్రలేచారు. 


పైలెట్లు తేరుకుని ఏటీసీ అధికారులతో సంప్రదించడంతో మరో 25 నిమిషాల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ‘ఏవియేషన్ హెరాల్ట్’ పేర్కొంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని విమానయాన పర్యవేక్షణ సిస్టమ్ ‘ఏడీఎస్-డీ’ డేటా కూడా నిర్ధారించింది. విమానం ప్రయాణించిన మార్గం ఫొటోని విడుదల చేసింది. అడీస్ అబాబా ఎయిర్‌పోర్ట్ సమీపంలో విమానం గాల్లో రౌండ్లు కొట్టిన మార్గం ఫొటోలో కనిపిస్తోంది. కాగా విమానం తదుపరి ఫైట్‌ను మరో 2.50 గంటల తర్వాత బయలుదేరడానికి అధికారులు అనుమతిచ్చారు. 


కాగా విమానయాన రంగ నిపుణుడు అలెక్స్ మచెరాస్ ఈ ఘటనపై ట్విటర్ వేదికగా స్పందించాడు. తీవ్ర ఆందోళనకరమైన ఘటనగా అభివర్ణించాడు. పైలెట్ల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని విమర్శించాడు. కాగా ఇదేతరహా ఘటన ఒకటి మే నెలలో నమోదయ్యింది. న్యూయార్క్ నుంచి రోమ్ వెళ్తున్న విమాన పైలెట్లు నిద్రపోయారు. విమానం 38 వేల అడుగుల కంటే పైన ప్రయాణించడంపై దర్యాప్తు చేపట్టగా ఈ షాకింగ్ విషయం బయటపడింది. ఇద్దరూ నిద్రపోయినట్టు తేలింది.

Updated Date - 2022-08-19T22:01:22+05:30 IST