పైనాపిల్‌(అనాస) విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం

ABN , First Publish Date - 2022-08-19T06:19:29+05:30 IST

పైనాపిల్‌(అనాస) విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి. దివ్య సుధ తెలిపారు.

పైనాపిల్‌(అనాస) విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం
స్క్వేష్‌ తయారీని వివరిస్తున్న శాస్త్రవేత్తలు

కుటీర పరిశ్రమలపై ఆదివాసీ రైతులు దృష్టి సారించాలి

బీసీటీ కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త దివ్య సుధ



చింతపల్లి, ఆగస్టు 18: పైనాపిల్‌(అనాస) విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి. దివ్య సుధ తెలిపారు. గురువారం చింతపల్లి మండలం బద్దిమెట్ట గ్రామంలో గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ మహిళలకు పైనాపిల్‌తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు. తొలుత పైనాపిల్‌తో క్యాండీ, స్క్వేష్‌, జామ్‌, పికిల్‌ తయారుచేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన రైతులు అధిక విస్తీర్ణంలో పైనాపిల్‌ సాగు చేస్తున్నారన్నారు. ప్రతి ఏటా జూలై రెండో పక్షం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రైతులు పండించిన పైనాపిల్‌ పండ్లను విక్రయిస్తుంటారని తెలిపారు. ఒక కాయ రూ.15 నుంచి రూ.20 ధరకు విక్రయిస్తారని, కొన్ని సందర్భాల్లో మార్కెట్‌లో కొనుగోలుదారులు లేక అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు పైనాపిల్‌తో విలువ అధారిత ఉత్పత్తులను తయారుచేసి విక్రయించుకోవడం వల్ల రెట్టింపు ధర పొందవచ్చునని తెలిపారు. పైనాపిల్‌ పండును ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చునన్నారు. పైనాపిల్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉందన్నారు. పైనాపిల్‌తో క్యాండీ, స్క్వేష్‌, జామ్‌, పికిల్‌ తయారు చేసుకుని మార్కెట్‌లో విక్రయించుకోవచ్చునన్నారు. గిరిజన మహిళలు పైనాపిల్‌ ఉత్పత్తులతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు. విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే మహిళలకు బ్యాంక్‌లు కూడా రుణాలు ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు బి.శ్రీహరిరావు, బండి నాగేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:19:29+05:30 IST