మువ్వన్నెలూ మూడు ధర్మాలూ

ABN , First Publish Date - 2022-08-13T07:05:24+05:30 IST

భారత రాజ్యాంగ ప్రస్తావనలోని మూడు పదాలు, కాదు మూడు ధర్మ సూత్రాలను పాఠకులు గుర్తు చేసుకోవాలి.

మువ్వన్నెలూ మూడు ధర్మాలూ

భారత రాజ్యాంగ ప్రస్తావనలోని మూడు పదాలు, కాదు మూడు ధర్మ సూత్రాలను పాఠకులు గుర్తు చేసుకోవాలి. అవి: సార్వభౌమిక, లౌకిక, ప్రజాస్వామిక. ఆధునిక గణతంత్ర రాజ్యాన్ని నిర్వచించే ధర్మాలవి. ఆ ధర్మాల ప్రాతిపదికన భారత గణతంత్ర రాజ్యాన్ని నెలకొల్పుకునేందుకై మన పురా నవజాతి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని సాధించుకుంది.


ఈ ఆగస్టు 15న భారతీయులు స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. 2047లో స్వాతంత్ర్య శత వార్షికోత్సవ వేడుకలు, ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకునేందుకు భారత జాతి అఖండ అస్తిత్వంతో ఉండగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. అయినా ఈ ప్రశ్నను నేను ఎంతో తడబాటుతో అడుగుతున్నాను– 2047 సంవత్సరంలో భారత రిపబ్లిక్ సార్వభౌమిక, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఉంటుందా? 


శతాబ్దాలుగా భారతావనిలోని అనేక ప్రాంతాలు సార్వభౌమిక రాజ్యాలుగా ఉన్నాయి. విదేశీ రాజులు లేదా రాణుల పాలనాధికారంలో లేవు అనే అర్థంలో మాత్రమే అవి సార్వభౌమికాలు! రాజ్యం ‘సార్వభౌమికమే’ అయినా ప్రజలు సార్వభౌమికులు కారు. పలువురు పాలకులు నిరంకుశులు, అసమర్థులు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆ భూపాలురు చేసింది ఏమీలేదు.


ఒక నవీన రిపబ్లికన్ రాజ్యాంగం కింద రాజ్యం మాత్రమే సార్వభౌమికం కాదు, ప్రజలూ సార్వభౌమికులే. సార్వభౌమాధికారం పూర్తిగా ప్రజలదే. తమ పాలకులను మార్చివేసేందుకు అధికారాన్ని కలిగి ఉండడమనేది ఒక సార్వభౌమిక ప్రజల విశిష్ట గుణ చిహ్నం. స్వేచ్ఛాయుత, సక్రమ ఎన్నికలు ప్రజల సార్వభౌమిక హక్కు అయితే ఇటీవలి సంవత్సరాలలో ఇటువంటి నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు గ్రహణం పట్టింది. ఎన్నికల తీరుతెన్నులు, ఈ రోజుల్లో, చాల వరకు ధన బలంతో ప్రభావితమవుతున్నాయి. మరి ధన శక్తిలో బీజేపీదే ప్రథమ స్థానం. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలలో 95 శాతాన్ని స్వాయత్తం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఒక దుర్మార్గ పూరిత అపారదర్శక సాధనాన్ని (ఎన్నికల బాండ్లు) సృష్టించింది.


ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగడమన్నది నిలిచిపోయే పరిస్థితికి చేరుకోనున్నామా? అటువంటి దౌర్భాగ్య స్థితి రాబోదని నేను విశ్వసిస్తున్నాను. అయితే అటువంటి ప్రమాదం వాటిల్లే అవకాశాన్ని పూర్తిగా కొట్టివేయలేము. కాంగ్రెస్ –ముక్త్ భారత్ అనే ఆయుధాన్ని కేవలం కాంగ్రెస్ మీద మాత్రమే బీజేపీ ఎక్కుపెట్టలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఇటీవల చేసిన ఒక ప్రకటనను గమనంలోకి తీసుకోండి. ‘చిన్న పార్టీలు అన్నీ అంతరించిపోతాయి. బీజేపీ మాత్రమే ఒక జాతీయ రాజకీయ పార్టీగా మిగులుతుంది’ అని ఆయన అన్నారు. ఇది ఏదో యథాలాపంగా చేసే రాజకీయ ప్రకటన కానేకాదు; అదొక భావన. బీజేపీ శ్రేణులు దానిని చాలా జాగ్రత్తగా అభివృద్ధిపరుస్తున్నాయి. అమలుపరుస్తున్నాయి కూడా.


భారత్ జనాభా మరి కొద్ది సంవత్సరాలలో 160 కోట్లకు చేరనున్నది. అయితే దేశ జనాభాలో ఆయా మతాల వారి నిష్పత్తిలో పెద్దగా మార్పు ఉండబోదు. ప్రస్తుతం భారత జనాభాలో హిందువులు 78.4 శాతం, ముస్లింలు 14.4 శాతం, క్రైస్తవులు 2.2 శాతం, సిక్కులు 1.7 శాతం, ఇతరులు 3.3 శాతం మేరకు ఉన్నారు. రెండు సహస్రాబ్దాలుగా భారత్‌లో సమస్త జీవన రంగాలలో బహుళత్వ సంస్కృతి వర్ధిల్లుతోంది. అయితే ఇప్పుడు ఈ విశిష్టతను మనకు మనమే రూపుమాపుకుంటున్నాము. మనకు భిన్నంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తదితర దేశాలు బహుళత్వ సమాజం వల్ల సమకూరే ప్రయోజనాలను సగర్వంగా అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో ముస్లిం, క్రైస్తవ సామాజిక సమూహాల నుంచి ఒక్కొక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. సిక్కుల నుంచి ఎవరూలేరు. ప్రస్తుత ముస్లిం, క్రైస్తవ న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తరువాత మరో ముస్లిం లేదా క్రైస్తవ న్యాయమూర్తిని నియమించబోరనే భయ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


భారత్ లౌకిక సమాజంగా కాకుండా మరో విధంగా ఉండగలదా అని మీకు మీరు ప్రశ్నించుకోండి. ముస్లింలు, క్రైస్తవులను మినహాయిస్తే మన సంగీతం, సాహిత్యం, సినిమా, క్రీడలు, సైన్స్, మెడిసిన్, లా, టీచింగ్, సివిల్ సర్వీసెస్ రంగాలు తమ సమున్నతిని కోల్పోవూ? లౌకిక వాదానికి చెడ్డ పేరు నిచ్చింది ఆరెస్సెస్, బీజేపీలే. లౌకికవాదమంటే ‘బుజ్జగింపు’ అని సంఘ్ పరివార్ శ్రేణులు నిరసించాయి. ఈ నిరసన వారి సమస్త విధానాలనూ ప్రభావితం చేసింది. లౌకికవాదం మరణం, హిందూరాష్ట్ర ప్రకటన భారత్ భావనకు చావు దెబ్బ అనడంలో సందేహం లేదు. అంతేకాదు, అది మన ప్రజాస్వామ్య అంతాన్నీ త్వరితం చేస్తుంది. ఇటువంటి పరిణామాలను స్వాగతించేందుకు భారతీయులలో అత్యధికులు సంసిద్ధంగా లేరు. అటువంటి వాటిని వారు హర్షించరు. బీజేపీ మద్దతుదారులలో అత్యధికులు హిందూ రాష్ట్రను కోరుకుంటున్నారు. తిరుగులేని శక్తులు (హిందూత్వ వాదులు) స్థిర ప్రతి బంధకాలు (ఉదారవాద, సహనశీల భారతీయులు) కలుసుకున్నప్పుడు ఎవరు ఎవరిని గెలుస్తారనేది నాకు తెలియదు.


ప్రజాస్వామ్య మంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం మాత్రమేకాదు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజూ సంభాషణలు, సంవాదాలు, చర్చలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా ఆచరించాలి. ఈ ప్రమాణం ప్రకారం భారత్ ప్రజాస్వామ్యం అతికష్టం మీద ఊపిరి పీల్చుకుంటుంది. భారత్‌ను ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’ అని స్వీడన్‌కు చెందిన వి–డెమ్ ఇన్‌స్టిట్యూట్ అభివర్ణించింది. 2021 ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానాన్ని 53కి తగ్గించింది. ప్రతి ప్రాంతీయ పార్టీ స్వరాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని సాధించుకునేందుకు పోరాడుతోంది. అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు వాటి పోరాటాలలో సహకరించడం లేదు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులతో కలవడానికీ ఇష్టపడడం లేదు. ఇది చాలా శోచనీయం. ఈ పరిస్థితిలో (జెపి నడ్డా ఆశించినట్టు) ఏక పార్టీ వ్యవస్థ ఆవిర్భవించే అవకాశాన్ని కొట్టివేయలేము. అదే జరిగిననాడు మనదీ ప్రజాస్వామ్యమే కానీ అది భారతీయ లక్షణాలతో ఉన్న ప్రజా తంత్రమని ఆయన పార్టీ ఘనంగా చెప్పగలదు సుమా!


ఆగస్టు 15న మువ్వన్నెల జెండాకు వందనం చేసినప్పుడు ఆ స్ఫూర్తి పతాక రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తు చేసుకోండి. వర్తమాన రాజకీయ సందర్భంలో, మన జాతీయ జెండాలోని మూడు రంగులు –కాషాయం, తెలుపు, ఆకుపచ్చ– భారత గణతంత్ర రాజ్య ప్రాణ ప్రాతిపదికలు అయిన సార్వభౌమత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-08-13T07:05:24+05:30 IST